‘ఒత్తిడి కాదు.. కరెక్ట్‌ నిర్ణయం’ ద్రౌపది ముర్ముకే శివసేన మద్దతు

Uddhav Thackeray Shiv Sena Supports BJP NDA Draupadi Murmu - Sakshi

ముంబై: రాష్ట్రపతి ఎన్నికల్లో ఉద్దవ్‌ థాక్రే నేతృత్వంలోని శివసేన మద్దతుపై ఎట్టకేలకు ఓ స్పష్టత వచ్చింది. బీజేపీ-ఎన్డీయే అభ్యర్థి ద్రౌపది ముర్ముకు శివసేన మద్దతు ప్రకటించేసింది.  నిన్న(సోమవారం) ఎంపీలతో జరిగిన కీలక సమావేశంలో ఈ మేరకు మెజార్టీ సభ్యులు ముర్మువైపే మొగ్గుచూపినట్లు సమాచారం. దీంతో అధిష్టానం సైతం ఆ దిశగా సానుకూలత చూపిస్తోంది.

మహారాష్ట్ర జనాభాలో పది శాతం ఎస్టీ జనాభా ఉంది. ఈ తరుణంలో.. గిరిజన కమ్యూనిటీకి చెందిన ద్రౌపది ముర్ముకే మద్దతు ఇవ్వాలని సేన ఎంపీలు.. శివసేన చీఫ్‌, మాజీ సీఎం ఉద్దవ్‌ థాక్రేపై ఒత్తిడి తెచ్చారు. మొత్తం 22 ఎంపీలకుగానూ 16 మంది(ఇద్దరు షిండే గూటిలో ఉన్నారు) ముర్ముకే మద్దతు తెలపాలని నిర్ణయించుకున్నట్లు ప్రకటించారు. దీంతో శివసేన రాష్ట్రపతి అభ్యర్థి మద్దతు విషయంలో దాదాపుగా ఒక స్పష్టత వచ్చినట్లయ్యింది. 

మరోవైపు ఈ మధ్యాహ్నాం సంజయ్‌ రౌత్‌.. రాష్ట్రపతి అభ్యర్థి మద్దతు విషయంలోనూ ఒక స్పష్టత ఇచ్చేశారు. సోమవారం ఎంపీల సమావేశంలో ద్రౌపది ముర్ము మద్దతు అంశంపైనే ప్రధానంగా చర్చ జరిగిందని ఆయన వెల్లడించారు. అయితే.. ముర్ముకు మద్దతు ఇచ్చినంత మాత్రానా బీజేపీకి సపోర్ట్‌ చేసినట్లు కాదంటూ ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.

ప్రతిపక్షం బలంగా ఉండాలన్నది మా ఉద్దేశం. యశ్వంత్‌ సిన్హా విషయంలోనూ శివ సేన సానుకూలంగానే ఉంది. గతంలో ఎన్డీయే అభ్యర్థికి కాకుండా.. ప్రతిభా పాటిల్‌కు మద్దతు ఇచ్చాం. ప్రణబ్‌ ముఖర్జీకి కూడా మద్దతు ఇచ్చాం. ఒత్తిడిలో శివసేన ఎలాంటి నిర్ణయాలు తీసుకోదు. శివసేన ఎప్పుడూ సరైన నిర్ణయమే తీసుకుంటుంది. అంటూ సంజయ్‌ మాట్లాడారు. 

సంకుచిత స్వభావం కాదు.. ఉద్దవ్‌థాక్రే
శివసేనది సంకుచిత స్వభావం కాదని, తనపై ఎవరి ఒత్తిడి ఉండదని.. ఉండబోదని శివసేన చీఫ్‌ ఉద్దవ్‌ ధాక్రే స్పష్టం చేశారు. రాష్ట్రపతి అభ్యర్థిగా ద్రౌపది ముర్ముకు తాము మద్దతు ప్రకటిస్తామని స్వయంగా వెల్లడించిన ఆయన.. ప్రస్తుతం ఉన్న రాజకీయ వాతావరణంలో ఆమెను బలపర్చకూడదు. కానీ, మేమంతా సంకుచిత స్వభావం ఉన్నవాళ్లం కాదు. అందుకే గిరిజన మహిళకు మద్దతు ప్రకటిస్తున్నాం అని ఉద్దవ్‌ థాక్రే తెలిపారు.

ఇక రాష్ట్రపతి ఎన్నిక విషయంలో ఉద్దవ్‌ థాక్రే నేతృత్వంలోని శివసేన.. రాజకీయాలు పట్టించుకోదని, గతంలో మాదిరే ఇప్పుడు గిరిజన మహిళ అయిన ద్రౌపది ముర్ముకు మద్దతు ఇచ్చి తీరుతుందని ఎంపీ గజానన్‌ కిరీట్కర్‌ సోమవారం కీలక వ్యాఖ్యలు చేశారు. ఇదిలా ఉంటే..  విపక్షాలు రాష్ట్రపతి అభ్యర్థి ఎంపిక సమయంలో మల్లగుల్లాలు పడుతుంటే.. పార్టీ సంక్షోభాన్ని ఎదుర్కొంది శివసేన. అందుకే కీలక సమావేశాలకు దూరంగా ఉంటూ వచ్చింది. దీంతో అప్పటి నుంచి ఎవరికి మద్దతు ఇస్తుందా? అనే ఆసక్తికర చర్చ నడుస్తూ వచ్చింది.

చదవండి: రాష్ట్రపతి ఎన్నికలు..  చంద్రబాబు ఎక్కడ??

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top