టీవీకే విజయ్‌ ప్రమాణ స్వీకారం వాయిదా | tvk vijay oath take Ceremony Was Cancelled | Sakshi
Sakshi News home page

టీవీకే విజయ్‌ ప్రమాణ స్వీకారం వాయిదా

May 6 2026 8:23 PM | Updated on May 6 2026 9:05 PM

tvk vijay oath take Ceremony Was Cancelled

చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రిగా టీవీకే విజయ్‌ గురువారం ప్రమాణ స్వీకారం చేయాల్సి ఉండగా అది వాయిదా పడింది. తమిళనాడులోని 234 సభ్యుల సభలో టీవీకే 108 స్థానాలు గెలిచింది. మెజారిటీ మార్క్‌ (118)కి 10 సీట్లు తక్కువగా ఉన్నాయి. కాంగ్రెస్ మద్దతుతో 5 స్థానాలు పెరిగాయి. మొత్తం 113కి చేరింది. 

మెజారిటీ మార్క్‌ కోసం ఇంకా సీట్లు అవసరం. పీఎంకే, సీపీఐ, సీపీఐ(ఎం), వీసీకే వంటి చిన్న పక్షాలతో చర్చలు జరుగుతున్నాయి. విజయ్‌ను ప్రభుత్వం ఏర్పాటుకు ఆహ్వానించే ముందు గవర్నర్ రాజేంద్ర అర్లేకర్ మెజారిటీ మద్దతు నిరూపించాలని కోరారు. 

ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలంటే ముందు మెజారిటీ మద్దతుకు పత్రాలరూపంలో ఆధారాలు సమర్పించాలని గవర్నర్ రాజేంద్ర అర్లేకర్ పట్టుబట్టారు. ఈ పరిణామం వల్ల టీవీకే ప్రమాణ స్వీకార కార్యక్రమ ప్రణాళిక దెబ్బతింది. ప్రమాణ స్వీకారంలో విజయ్ సహా నలుగురు సీనియర్ నేతలు ప్రమాణం చేసి, సభలో మెజారిటీ నిరూపణకు రెండు వారాలు గడువు కోరాలని భావించారు.

కాగా, రాష్ట్రంలో కొత్త ప్రభుత్వ ఏర్పాటు కోసం టీవీకేకు కాంగ్రెస్ పూర్తి మద్దతు ఇచ్చింది. దీంతో తమిళనాడులో డీఎంకేతో కాంగ్రెస్‌కు ఉన్న దీర్ఘకాల మైత్రి చెడిపోయింది. టీవీకే-కాంగ్రెస్‌ స్నేహబంధం ప్రభుత్వ ఏర్పాటు వరకు మాత్రమే కాకుండా.. స్థానిక సంస్థల ఎన్నికలు, లోక్ సభ, రాజ్య సభ ఎన్నికలు సహా భవిష్యత్‌లో జరిగే ఎన్నికల్లోనూ కొనసాగుతుందని చెప్పాయి. టీవీకే తన ఎమ్మెల్యేలను మామల్లాపురంలోని ఓ ప్రైవేట్ లగ్జరీ రిసార్ట్‌కు తరలించింది.

అనుమతి కోసం మరో ప్రయత్నం
టీవీకే ప్రధాన కార్యదర్శి అధవ్ అర్జునా ఇవాళ రాత్రి గవర్నర్‌ను మరోసారి కలిశారు. ప్రభుత్వ ఏర్పాటుపై అనుమతి తీసుకోవడానికి మరో ప్రయత్నం చేశారు. సమయాన్ని ఇస్తే 118 సంపూర్ణ మద్దతు కూడగడుతామని హామీ ఇచ్చారు. మొదట ప్రమాణ స్వీకారానికి అనుమతి ఇవ్వాలని కోరారు. 

Advertisement
 
Advertisement
Advertisement