కోయంబత్తూరు: తమిళనాడు ఎన్నికల వేళ కోయంబత్తూరు-గౌండంపాళయం నియోజకవర్గ అభ్యర్థిగా టీవీకే తరఫున కనిమొళి సంతోష్ పేరును ప్రకటించడంతో వివాదం రాజుకుంది. గతంలో ఆమె సోషల్ మీడియాలో చేసిన పోస్టులు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఒక పోస్టులో ఆమె.. “మెడికల్ ఆస్ట్రాలజీ ద్వారా క్యాన్సర్‌ను 100 శాతం నయం చేయవచ్చు” అని చెప్పినట్లు ఉంది.
సెలబ్రిటీ జ్యోతిష్కురాలు కమిమొళి
నరసింహనాయకన్పాళయం ప్రాంతానికి చెందిన కనిమొళి న్యాయవాది, వ్యాపారవేత్త. అంతేకాదు, తనను తాను సెలబ్రిటీ జ్యోతిష్కురాలినని, వాస్తు నిపుణురాలినని చెప్పుకుంటారు. మెడికల్ ఆస్ట్రాలజీపై ఆమె చేసిన పాత సోషల్ మీడియా పోస్టులను ఇప్పుడు ప్రత్యర్థి పార్టీల నేతలు గుర్తుచేస్తున్నారు.
ఒక వీడియోలో కనిమొళి మాట్లాడుతూ.. “మెడికల్ ఆస్ట్రాలజీ జ్యోతిష్యంలో ప్రత్యేక శాఖ. క్యాన్సర్ ప్రాణాపాయం కలిగించే వ్యాధి. మెడికల్ ఆస్ట్రాలజీ ద్వారా క్యాన్సర్‌ను కూడా పూర్తిగా నయం చేయవచ్చు” అని చెప్పారు. అలాగే వ్యక్తి జాతకాన్ని విశ్లేషించి వచ్చే వ్యాధులను గుర్తించవచ్చని, సరైన పరిష్కారాలు తెలుసుకోవచ్చని కూడా తెలిపారు.
కనిమొళికి ప్రస్తుతం సోషల్ మీడియాలో 1,00,000కు పైగా ఫాలోవర్లు ఉన్నారు. ఆమె ప్రచారం చేసిన మెడికల్ ఆస్ట్రాలజీ వీడియోలను డీఎంకే, అన్నాడీఎంకే, నామ్ తమిళర్ కచ్చి సభ్యులు బాగా షేర్ చేస్తూ విమర్శలు గుప్పిస్తున్నారు. కనిమొళి మూఢనమ్మకాలను వ్యాప్తి చేశారని అంటున్నారు.
ఎలాంటి వారికి టికెట్లిచ్చారు?
టీవీకే అధినేత విజయ్ 234 నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించారు. పార్టీ ఎన్నికల మేనిఫెస్టో కూడా విడుదల చేశారు. ఆ తర్వాత 234 మంది అభ్యర్థులతో విజయ్ వ్యక్తిగతంగా ఫొటోలు దిగారు. అవి వైరల్ అయ్యాయి.
అయితే కనిమొళిని అభ్యర్థిగా ప్రకటించడంపై ఇప్పుడు సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అభ్యర్థులను నిశితంగా పరిశీలించి ఎంపిక చేశామని విజయ్ ముందుగా చెప్పారు. అయితే, సిన్సియర్ నేతలకు సీట్లు రాలేదని కొందరు నిరసన వ్యక్తం చేస్తున్నారు. శాస్త్రీయ సూత్రాలకు విరుద్ధంగా మూఢనమ్మకాలను ప్రోత్సహించే వారికి సీట్లు ఇచ్చారని విమర్శిస్తున్నారు.


