- కూటమి ప్రభుత్వం కొత్తగా ఒక్క ఇల్లు కట్టకుండా తప్పుడు ప్రచారం
- గత ప్రభుత్వంలో జగనన్న కాలనీల పేరుతో ఊర్లకు ఊర్లు నిర్మించాం
- ఇప్పుడు టిడ్కో ఇళ్లను తమవిగా చూపుతున్న కూటమి ప్రభుత్వం
- మాజీ మంత్రి మేరుగు నాగార్జున ధ్వజం
తాడేపల్లి. తమ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి హయాంలో ఇచ్చిన టిడ్కో ఇళ్లకు రంగులేసి తమ ఘనతగా కూటమి ప్రభుత్వం చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ నేత మేరుగు నాగార్జున. చివరకు టిడ్కో ఇళ్లపై కూడా చంద్రబాబు సర్కారు క్రెడిట్ చోరీ చేస్తుందని ధ్వజమెత్తారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు మేరుగు నాగార్జున.
ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు మానుకోవాలని, వాస్తవాలను గుర్తించాలని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన మాజీ మంత్రి మేరుగు నాగార్జున హితవు చెప్పారు.
ప్రెస్‌మీట్‌లో మేరుగు నాగార్జున ఇంకా ఏమన్నారంటే..:
ప్రజలు వాస్తవాలు చెబుతున్నా పట్టని బాబు
సీఎం చంద్రబాబు ఆలోచనలు దారుణంగా ఉన్నాయి. ప్రజలకు ఏమీ తెలియదన్నట్లుగా ఆయన పాలన సాగిస్తున్నారు. ఈరోజు రాష్ట్రవ్యాప్తంగా టిడ్కో ఇళ్ల పట్టాలు ఇస్తున్నామని చెబుతున్నారు. కానీ ప్రజలే బయటకు వచ్చి, తమకు గత ప్రభుత్వంలోనే పట్టాలు ఇచ్చారని చూపుతున్నా, చంద్రబాబు పట్టించుకోవడం లేదు. క్రెడిట్ చోరీకి చంద్రబాబు బ్రాండ్ అంబాసిడర్‌గా మారినట్లు కనిపిస్తోంది.
కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 21 నెలల్లో 5,50,314 ఇళ్లు నిర్మించామని, ఈరోజు 2,50,893 ఇళ్లకు గృహ ప్రవేశం చేశామని చెబుతున్నారు. కానీ 2014–2019 మధ్య గానీ, 2024 నుంచి ఇప్పటి వరకు గానీ ఒక నిరుపేద కుటుంబానికి ఒక్క ఇల్లు కట్టించి ఇచ్చిన దాఖలాలు ఉన్నాయా? వారి కోసం కనీసం గజం భూమి అయినా చంద్రబాబు కొన్నారా?
గత ప్రభుత్వంలో జగన్‌గారు ఏకంగా 31.19 లక్షల ఇళ్ల స్థలాలిచ్చి, 21.75 లక్షల ఇళ్లు మంజూరు చేయడంతో పాటు, వాటిలో 9.02 లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తి చేశారు. పేదల ఇళ్ల కోసం 17,005 వైయస్సార్ జగనన్న కాలనీలు ఏర్పాటు చేశారు. కొన్ని చోట్ల ఆ కాలనీలు ఒక ఊరు మాదిరిగా ఏర్పడ్డాయంటే అతిశయోక్తి కాదు. ఆ కాలనీల పేరు మార్చి, ఇప్పుడు వాటినే తామే ఏర్పాటు చేస్తున్నట్లు చంద్రబాబు ప్రచారం చేసుకుంటున్నారు.
అదీ గత ప్రభుత్వ చిత్తశుద్ధి
రాష్ట్రంలో సొంత ఇల్లు లేకుండా ఒక్క కుటుంబం కూడా ఉండకూడదన్న లక్ష్యంతో, గత ప్రభుత్వం వ్యవహరించింది. పేదలందరికీ పక్కా ఇల్లు కల్పించాలనే ఉద్దేశంతో ఎన్నడూ లేని విధంగా రూ.31,832 కోట్ల విలువైన 71,811 ఎకరాలను సేకరించి, అందులో 25,374 ఎకరాలను కొనుగోలు చేసి దాదాపు రూ.11,343 కోట్లు ఖర్చు చేశారు. గత ప్రభుత్వంలో కాలనీలు మాత్రమే కాదుం ఊర్లకు ఊర్లే నిర్మించారు. ఈ రోజు రాష్ట్రంలో ఎక్కడికి వెళ్లినా విద్యుత్ దీపాలతో వెలిగిపోతున్న జగనన్న కాలనీలు కనిపిస్తున్నాయి. దివంగత మహానేత వైయస్సార్‌గారి వారసుడిగా జగన్ నిరుపేదలకు గూడు కల్పించిన విధానం అది.
ఇళ్ల స్థలాల మార్కెట్ విలువ సుమారు రూ.75 వేల కోట్లు
గత ప్రభుత్వంలో ఇళ్ల నిర్మాణంలో జంగిల్ క్లియరెన్స్, డ్రైనేజీ, ఎలక్ట్రిసిటీ, మంచినీటి సౌకర్యాల కోసం మాత్రమే దాదాపు రూ.32,900 కోట్లు ఖర్చు చేశారు. నాడు పంపిణీ చేసిన ఇళ్ల స్థలాల మార్కెట్ విలువ సుమారు రూ.75 వేల కోట్లు ఉంటుంది. ఇక లబ్ధిదారులకు ఇచ్చిన ఇంటి విలువ ప్రాంతాన్ని బట్టి కొన్ని చోట్ల దాదాపు రూ.20 లక్షలు. అవేవీ చేయని కూటమి ప్రభుత్వం పచ్చి అబద్ధాలతో మోసం చేసే ప్రయత్నం చేస్తోంది. ఎకరికో పుట్టిన బిడ్డను మా బిడ్డగా చెప్పుకునే పరిస్థితి ఈ ప్రభుత్వానికే దక్కుతుంది. టిడ్కో ఇళ్లన్నీ తామే నిర్మించామని చెప్పుకోవడం దారుణం.
గత ప్రభుత్వంలో 1.24 లక్షల టిడ్కో ఇళ్లు పంపిణీ
టిడ్కో ఇళ్లకు సంబంధించి గత ప్రభుత్వంలో దాదాపు 35 పట్టణ స్థానిక సంస్థ (యూఎల్‌బీ)ల్లోని 66 ప్రాంతాల్లో లక్షకు పైగా ఇళ్లు లబ్ధిదారులకు అందజేశారు. సాలూరు, విజయనగరం, చిత్తూరు వంటి పట్టణాల్లో కూడా టిడ్కో ఇళ్లు పంపిణీ చేశాం. మొత్తంగా 1,24,680 ఇళ్లు అన్ని వసతులతో జీ+3 విధానంలో నిర్మించి ఇచ్చాం.
గతంలో ఇచ్చిన ఇళ్లకు రంగులు వేసి క్రెడిట్ చోరీ
ఇవాళ రాష్ట్రవ్యాప్తంగా గత ప్రభుత్వంలో ఇచ్చిన ఇళ్లకు రంగులు వేసి కూటమి ప్రభుత్వం తమదిగా ప్రచారం చేసుకోవడం సిగ్గుచేటు. ప్రభుత్వంలో ఉన్నవారు కొత్త కార్యక్రమాలు చేపట్టాలి, ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలి. కానీ వైఎస్ జగన్ గారు చేసిన మేలును మీరు క్రెడిట్‌గా తీసుకోవడం అన్యాయం. అందుకే ప్రజలే ఈ రోజు బయటకు వచ్చి మీ మాయను, భూంరాంగ్ వ్యవహారాలను బట్టబయలు చేస్తున్నారు. ఇళ్ల పట్టాలు ఇవ్వడం, ఇళ్లు నిర్మించడం, టిడ్కో ఇళ్లను పారదర్శకంగా పంపిణీ చేయడం..ఈ చరిత్ర మొత్తం గత ప్రభుత్వానిది. ఆ ఘనత అంతా జగన్‌కే దక్కుతుంది.
ఒక్క ఇంటి పట్టా ఇవ్వకుండా మసిపూసి మారేడుకాయ చేసిన చరిత్ర చంద్రబాబుగారిది. అందుకే ఇకనైనా బాధ్యతాయుతంగా ప్రవర్తించాలని, తమ నాయకుడి గురించి మాట్లాడేటప్పుడు నోరు అదుపులో పెట్టుకోవాలని మేరుగు నాగార్జున హెచ్చరించారు.


