మైక్ లాక్కొని హంగామా.. టీడీపీలో పెరిగిన విభేదాలు! | Fight Between TDP Leaders in Nellore | Sakshi
Sakshi News home page

మైక్ లాక్కొని హంగామా.. టీడీపీలో పెరిగిన విభేదాలు!

Mar 30 2026 1:35 PM | Updated on Mar 30 2026 1:38 PM

Fight Between TDP Leaders in Nellore

నెల్లూరు జిల్లా: టీడీపీలో నివురుగప్పిన నిప్పులా దాగి ఉన్న విభేదాలు ఒక్కసారిగా బయటపడ్డాయి. ఎన్నో ఏళ్లుగా పార్టీనే నమ్ముకొని ఉన్న తమకు అన్యాయం జరుగుతోందంటూ ఒక్కసారిగా వ్యాఖ్యానించడంతో పరిస్థితులు హీటెక్కాయి. బుచ్చిరెడ్డిపాళెంలో ఆదివారం నిర్వహించిన పార్టీ ఆవిర్భావ దినోత్సవమే దీనికి వేదికైంది. 

సముదాయించకుండా.. అడ్డుకొని..! 
పట్టణంలోని ఓ ఫంక్షన్‌ హాల్లో టీడీపీ ఆవిర్భావ దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సీనియర్‌ నేత బొమ్మ సుబ్బారెడ్డి మైక్‌ పట్టుకొని తన మనస్సులోని బాధను వెళ్లగక్కారు. రెండేళ్లుగా తనను అవమానిస్తున్నారనీ.. నాటి ఎన్టీఆర్  నుంచి నేటి వరకు పార్టీ కోసం రక్తాన్ని ధారపోస్తే, ఇప్పుడు కనీస మర్యాద కరువైందంటూ కంటతడి పెట్టారు. ఈ తరుణంలో అక్కడే ఉన్న కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి ఆయన్ను సముదాయించాల్సింది పోయి, అందుకు విరుద్ధంగా వ్యవహరించడంతో పలువురు విస్తుపోయారు. స్టేజీపై అలా మాట్లాడొద్దంటూ నోరు నొక్కేందుకు యతి్నంచారు. 

మైక్‌ లాక్కొని.. సీనియర్లను తోసేసి 
అసమ్మతి గళాన్ని వినిపిస్తే తట్టుకోలేని తమ్ముళ్లు హద్దు మీరి ప్రవర్తించారు. సుబ్బారెడ్డి తన బాధ చెప్పుకొంటుండగానే, నేత కోడూరు కమలాకర్‌రెడ్డి అత్యుత్సాహాన్ని ప్రదర్శించి పెద్దాయన చేతిలోని మైక్‌ను బలవంతంగా లాక్కున్నారు. అనామకుడినా నేను..? ఇంత అవమానిస్తారా అంటూ సుబ్బారెడ్డి ఆవేదన వ్యక్తం చేస్తూ వేదిక దిగి వెళ్లిపోవడం అక్కడున్న వారిని కలిచివేసింది. మరో సీనియర్‌ నేత బషీర్‌ సైతం వేదికపైనే అసంతృప్తిని వెళ్లగక్కారు. రెండేళ్లుగా తనను ఏ కార్యక్రమానికీ పిలవడం లేదని, పార్టీలో సీనియర్లను ఏ మాత్రం లెక్కచేయడంలేదంటూ బాహాటంగానే విమర్శించారు. ఎంతో కాలంగా పార్టీని నమ్ముకొని ఉంటే బయట నుంచి వచ్చిన నేతలు తమపై పెత్తనం చేయడమేమిటంటూ ఆవేదన వ్యక్తం చేశారు. మొత్తానికి బుచ్చిరెడ్డిపాళెం సాక్షిగా జరిగిన ఈ రచ్చ, టీడీపీలో ఐక్యత లేదనే విషయాన్ని స్పష్టంగా తెలియజేస్తోంది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement