ఆరు నెలల్లోనే కలెక్టర్‌పై బదిలీ వేటు | Collector Tamim Ansariya Transfer Guntur Political Pressure Allegations | Sakshi
Sakshi News home page

ఆరు నెలల్లోనే కలెక్టర్‌పై బదిలీ వేటు

Mar 30 2026 1:10 PM | Updated on Mar 30 2026 1:21 PM

Collector Tamim Ansariya Transfer Guntur Political Pressure Allegations

గుంటూరు: ఇప్పటి వరకు గుంటూరు జిల్లా కలెక్టర్‌గా పనిచేసిన ఎ.తమీమ్‌ అన్సారియా ఆకస్మికంగా ఆదివారం బదిలీ అయ్యారు. మైనారిటీ వర్గానికి చెందిన ఆమెను ఆరు నెలల్లోనే ఎందుకు బదిలీ చేయాల్సి వచ్చిందో అర్థం కావడం లేదు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన నియోజకవర్గాల రేటింగ్‌లో గుంటూరు వెస్ట్‌ 175వ స్థానంలో నిలిచింది. ఈ నేపథ్యంలో అధికారులతోపాటు కలెక్టర్‌ కూడా తమ మాట వినడం లేదని జిల్లాకు చెందిన కొందరు ప్రజాప్రతినిధులు ఇటీవల   ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. దీంతోపాటు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గళ్ళా మాధవి మొదటి నుంచి అధికారులపై తిరుగుబాటు ధోరణి అవలంబిస్తున్నారు. ఇటీవల జిల్లా కలెక్టర్ల కాన్ఫరెన్స్‌లో ముఖ్యమంత్రి ప్రత్యేకంగా తమీమ్‌ అన్సారియాను హెచ్చరించారు. అధికారులు, ప్రజాప్రతినిధులతో సయోధ్యతో మెలగాలని సున్నితంగా హెచ్చరించారు. తమిళనాడుకు చెందిన తమీమ్‌ అన్సారియాకు ఆంధ్రాలో పెద్దగా గాడ్‌ ఫాదర్స్‌ లేకపోవడం, మైనారిటీ కావడం కూడా బదిలీకి కారణంగా కనిపిస్తోంది.  

మానవతా వాదిగా గుర్తింపు 
తమీమ్‌ అన్సారియా గత ఏడాది సెపె్టంబర్‌ 13న గుంటూరు జిల్లా కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించే సమయానికి జిల్లాలో అనేక సమస్యలున్నాయి. వాటిని దాదాపు విజయవంతంగానే పరిష్కరించారు. తుపాను నేపథ్యంలో తీసుకున్న ముందస్తు జాగ్రత్తలు, పెద్దగా నష్టం లేకపోవడం అప్పట్లో మంచి పేరు తెచ్చాయి. వరదల్లోనూ ట్రాక్టర్లపై గ్రామాలకు వెళ్లి బాధితుల కష్టాలను స్వయంగా తెలుసుకుని సాయం అందించేలా చర్యలు చేపట్టారు. ప్రభుత్వ వసతి గృహాలకు వెళ్లి విద్యార్థులతో మాట్లాడేవారు. విజయం మనదే పేరిట ఆ విద్యార్థులతో ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టారు. జాతీయ స్థాయిలో నిర్వహించిన సరస్‌ మేళా విజయవంతం చేశారు. గత నాలుగు రోజులుగా తమీమ్‌ అన్సారియా బదిలీ వార్త చక్కర్లు కొడుతుండడంతో ఎస్‌సీ. ఎస్‌టీ, బీసీ, మైనారిటీ వర్గాల నాయకులు నిరసన కార్యక్రమాలు చేపట్టారు.  


 

Advertisement
 
Advertisement
Advertisement