అస్సాం ఎన్నికల‌ బరిలో ‘జెన్‌ జీ’ | Gen Z Leaders Test Their Luck in Assam Assembly Elections | Sakshi
Sakshi News home page

అస్సాం ఎన్నికల్లో యువ అభ్యర్థులు

Mar 30 2026 2:24 PM | Updated on Mar 30 2026 4:00 PM

Gen Z Leaders Test Their Luck in Assam Assembly Elections

విద్యావంతులకే పార్టీల పెద్దపీట

34 ఏళ్ల లోపు యువతకు టికెట్లు

సాక్షి, న్యూఢిల్లీ: రాజకీయాలంటే వారసత్వ ఆస్తి అనే పాత పద్ధతులకు అస్సాం ఎన్నికల్లో ‘ఎండ్‌ కార్డ్‌’ పడుతోంది. ప్రజలతో అనుబంధం, విద్య, పోరాట పటిమే పెట్టుబడిగా కుర్రకారు రాజకీయ రణరంగంలోకి దూసుకొస్తోంది. అస్సాం అసెంబ్లీ ఎన్నికల్లో ఆరు లక్షల మంది యువత తొలిసారిగా ఓటు హక్కును వినియోగించుకోబోతున్నారు. దాంతో పార్టీలు యువతకు గాలం వేస్తున్నాయి.

34 ఏళ్ల లోపు నవతరానికి, విద్యావంతులకు మునుపెన్నడూ లేని విధంగా టికెట్లు కేటాయించాయి. వాళ్లు పక్కా గ్రౌండ్‌ వర్క్, సమస్యలపై అవగాహనతో రంగంలోకి దిగుతున్నారు. అసెంబ్లీ అడుగుపెట్టి ప్రజా గళం వినిపించాలని ఈ యువ అభ్యర్థులు ఉవ్విళ్లూరుతున్నారు. వీరంతా విద్యార్థి ఉద్యమాలు, సామాజిక సేవ నుంచి వచ్చిన, క్షేత్రస్థాయి అనుభవమున్న వారే...!

తేయాకు తోటల నుంచి
రాజోర్‌ దళ్‌ పార్టీ తరఫున మార్గెరీటా నియోజ కవర్గం నుంచి బరిలో ఉన్న రాహుల్‌ ఛెత్రీ తేయాకు తోటల్లో పనిచేసిన కుటుంబం నుంచి వచ్చారు. విద్యార్థి ఉద్యమాల ద్వారా నాయకుడిగా ఎదిగారు. దిబ్రూగఢ్‌ విశ్వవిద్యాలయంలో చదువుకున్న రాహుల్‌ నిరుద్యోగం, విద్య, మౌలిక సదుపాయాల కల్పనను ప్రచారంలో ప్రస్తావిస్తున్నారు.

విద్యార్థి రాజకీయాలతో
అల్గాపూర్‌–కట్లిచెర్రా నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిగా జుబేర్‌ అనామ్‌ మజుందార్‌ పోటీ చేస్తున్నారు. ఆయన తొలుత విద్యార్థి సంఘాల్లో పనిచేశారు. యూత్‌ కాంగ్రెస్‌ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నారు. చురుకైన, దూకుడైన నాయకుడిగా పేరుగాంచారు. ప్రజలకు చేరువ కావడానికి డిజిటల్‌ మాధ్యమంలో ప్రచారం చేస్తున్నారు.

మధ్యతరగతి ప్రతినిధి
కాంగ్రెస్‌ పార్టీ తిన్‌సుకియా అభ్యర్థిగా డేవిడ్‌ టి.ఫుకాన్‌ను నిలబెట్టింది. మేనేజ్‌మెంట్‌ విద్యను అభ్యసించిన ఫుకాన్‌ సామాజిక కార్యక్రమాల్లో చురుగ్గా ఉంటారు. మధ్యతరగతి ప్రజల ప్రతినిధిగా గుర్తింపు పొందారు. పరిశ్రమలు, తేయాకు తోటల కార్మికుల సమస్యల పరిష్కారం, మౌలిక సదుపాయాల అభివృద్ధే లక్ష్యంగా ప్రచారం చేస్తున్నారు.

గిరిజన గొంతుకగా
యూనివర్సిటీలో ఉన్నత విద్యను అభ్యసించి, జిల్లా అటానమస్‌ కౌన్సిల్‌లో చురుగ్గా పనిచేసిన 36 ఏళ్ల రూపాలీ లాంగ్థాసా గిరిజన సమాజంలో కొత్త తరానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ప్రాంతీయ అభివృద్ధి, సాంస్కృతిక గుర్తింపునకు ప్రాముఖ్యం ఇస్తున్నారు. హాఫ్‌లాంగ్‌ బీజేపీ అభ్యర్థిగా బరిలోకి ఉన్నారు.

గ్లోబల్‌ అనుభవంతో
సెంట్రల్‌ గౌహతి నుంచి అస్సాం జాతీయ పరిషత్‌ అభ్యర్థిగా కుంకీ చౌదరి బరిలో ఉన్నారు. ఈసారి పోటీలో ఉన్న అభ్యర్థులందరిలోనూ అతి పిన్న వయస్కురాలిగా నిలిచారు. లండన్‌లో మాస్టర్స్‌ చేసిన ఆమె కార్పొరేట్‌ కెరీర్‌ను వదిలి స్థానిక సమస్యల పరిష్కారమే లక్ష్యంగా రాజకీయాల్లోకి వచ్చారు. విద్య, నైపుణ్యాభివృద్ధి రంగాల్లో కుంకీ చౌదరి విస్తృతంగా పనిచేశారు.

కార్యకర్త నుంచి

గోల్‌పారా వెస్ట్‌ నుంచి బీజేపీ అభ్యర్థిగా పవిత్ర రాభా పోటీ చేస్తున్నారు. విద్యార్థి రాజకీయాలతో ప్రస్థానం ప్రారంభించి, యువమోర్చాలో కీలక పాత్ర పోషించి సంస్థాగతంగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. స్థానిక అభివృద్ధి, ఉపాధి కల్పనే ప్రధాన ఎజెండాగా ఆయన ముందుకెళ్తున్నారు.

మంచి కెరీర్‌ వదిలేసి
మరియానీ నియోజకవర్గం నుంచి రైజోర్‌ దళ్‌ అభ్యర్థిగా డాక్టర్‌ జ్ఞానశ్రీ బోరా పోటీ చేస్తున్నారు. కెమిస్ట్రీలో పీహెచ్‌డీ చేసిన ఆమె సురక్షితమైన కెరీర్‌ను వదిలేసి ప్రజాక్షేత్రంలోకి వచ్చారు. పౌరసత్వ సవరణ చట్ట వ్యతిరేక ఉద్యమంలో క్రియాశీలకంగా పాల్గొన్నారు. నిరుద్యోగం, మెరుగైన ఆరోగ్య సేవలు, రాజకీయాల్లో మహిళల భాగస్వామ్యం తదితర అంశాలను ప్రధాన అస్త్రాలుగా మలుచుకున్నారు.

చ‌ద‌వండి: మాయోంగ్ గ్రామానికి నేత‌ల క్యూ.. ఎందుకో తెలుసా?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement