Bandi Sanjay Comments: టీఆర్‌ఎస్‌ ఓడిపోతే రాజీనామా చేస్తావా? 

Telangana: Bandi Sanjay challenges CM KCR To Resign - Sakshi

సీఎం కేసీఆర్‌కు బండి సంజయ్‌ సవాల్‌ 

అసెంబ్లీలో టీఆర్‌ఎస్‌కు ట్రిపుల్‌ ‘ఆర్‌’ సినిమా చూపిస్తాం 

హుజూరాబాద్‌: ‘హుజూరాబాద్‌ అసెంబ్లీ నియోజకవర్గ ఉపఎన్నికలో టీఆర్‌ఎస్‌ గెలుపు ఖాయమంటూ ప్రగల్భాలు పలుకుతున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌.. ఒకవేళ ఆ పార్టీ ఓడిపోతే తన పదవికి రాజీనామా చేసేందుకు సిద్ధమా? కేసీఆర్‌కు దమ్ముంటే సమాధానమివ్వాలి’అంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్‌ ఎంపీ బండి సంజయ్‌ సవాల్‌ విసిరారు. హుజూరాబాద్‌లో సైలెంట్‌ ఓటింగ్‌ జరగబోతోందని, బీజేపీ గెలుపును అడ్డుకోవడం ఇక ఎవరితరమూ కాదన్నారు.

అసెంబ్లీలో ఇప్పటికే బీజేపీ తరఫున డబుల్‌ ‘ఆర్‌’(రాజాసింగ్, రఘునందన్‌రావు) ఉన్నారని, త్వరలో మరో ‘ఆర్‌’(రాజేందర్‌) అడుగు పెట్టబోతున్నారని జోస్యం చెప్పారు. ఇక నుంచి సీఎంకు అసెంబ్లీలో బీజేపీ ట్రిపుల్‌ ‘ఆర్‌’సినిమా చూపించబోతోందని వ్యాఖ్యానించారు. ఆదివారం హుజూరాబాద్‌లో జరిగిన బీజేపీ కార్యకర్తల సమావేశంలో ఆయన ఎన్నికల శంఖారావం పూరించారు.

సంజయ్‌ మాట్లాడుతూ..కరెన్సీ నోట్లతో ఓట్లను కొనాలని  టీఆర్‌ఎస్‌ పార్టీ చూస్తోందని, అయినా ఆపార్టీకి డిపాజిట్‌ కూడా దక్కదని పేర్కొన్నారు. బీజేపీకి ఓటేయాలని ప్రజలు ఎప్పుడో నిర్ణయించుకున్నారని స్పష్టం చేశారు. దళితబంధుకు షరతుల్లేకుండా రూ.10 లక్షలు ఇస్తున్నామని ప్రకటించిన కేసీఆర్‌.. ఇప్పుడేమో ఏవేవో షరతులు పెడుతున్నారని ఆరోపించారు.   

స్వీయమానసిక ధోరణి రుద్దుతున్నారు: ఈటల 
హుజూరాబాద్‌లో రాజ్యాంగాన్ని పక్కన పెట్టిన కేసీఆర్‌.. స్వీయ మానసిక ధోరణిని ప్రజలపై రుద్దుతున్నారని మాజీమంత్రి, బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్‌ అన్నారు. 13, 14 తేదీల్లో తనపై తానే దాడి చేయించుకుంటానని ఓ మంత్రి, ఎమ్మెల్యే ప్రచారం చేస్తున్నారని, ఈటల బరిగీసి కొట్లాడుతడు తప్ప చిల్లర పనులు చేయడని స్పష్టం చేశారు. 

కంకణం కట్టుకుందాం.. కమలాన్ని గెలిపిద్దాం 
ప్రజా సంగ్రామయాత్ర తొలిదశ పూర్తయిన నేపథ్యంలో ఆదివారం చార్మినార్‌ భాగ్యలక్ష్మీ అమ్మవారి ఆలయంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్‌ సతీసమేతంగా  పూజలు నిర్వహించారు. తొలిదశ యాత్ర విజయవంతమైందన్నారు. కమలాన్ని గెలుపొందించాలని కంకణం కట్టుకుందాం అని పిలుపునిచ్చారు. 

బీజేపీ అభ్యర్థిగా ‘ఈటల’ 
సాక్షి, న్యూఢిల్లీ: హుజూరాబాద్‌ ఉప ఎన్నికలో అభ్యర్థిగా ఈటల రాజేందర్‌ను బీజేపీ అధి ష్ఠానం ప్రకటించింది. ఈ మేరకు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్‌సింగ్‌ ఆదివారం ఓ ప్రకటన విడుదల చేశారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top