
1952 ఎన్నికల సమయంలో తెలంగాణతో పాటు, కర్నాటక, మహారాష్ట్ర లకు చెందిన కొన్ని జిల్లాలతో కలిసి హైదరాబాద్ రాష్ట్రం ఉండేది. ఆ రాష్ట్రానికి జరిగిన ఎన్నికలలో తెలంగాణ వరకు చూస్తే కాంగ్రెస్ కు 38 సీట్లు, పిడిఎఫ్ 36 , సోషలిస్ట్ పార్టీకి 11, షెడ్యూల్ కాస్ట్ ఫెడరేషన్ కు మూడు సీట్లు రాగా ఇండిపెండెంట్లు ఏడుగురు గెలిచారు. అప్పట్లో తెలంగాణలో కమ్యూనిస్టు పార్టీ పై నిషేధం ఉండేది. కాని ఆ పార్టీ వారంతా పీపుల్స్ డెమొక్రటిక్ ఫ్రంట్ పేరుతో ఎన్నికలలో పోటీచేశారు.అప్పట్లో సోషలిస్టు పార్టీ కూడా కాస్త బలంగానే ఉండేది.
1956 లొ ఆంధ్ర , తెలంగాణలో విలీనం అయి ఉమ్మడి ఆంద్రప్రదేశ్ ఏర్పడినా, 1957 లో మాత్రం తెలంగాణ భాగానికే ఎన్నికలు జరిగాయి.దానికి కారణం 1955లో ఆంధ్ర రాష్ట్రానికి మద్యంతర ఎన్నికలు జరగడమే. ఆంధ్రలో ఎన్నికైన ఎమ్మెల్యేలకు 1962 వరకు పదవిలో ఉండే అవకాశాన్ని పార్లమెంటు కల్పించింది. తెలంగాణలో 1957లో రెగ్యులర్ ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికలలో కాంగ్రెస్ 68, పిడిఎఫ్ 22, సోషలిస్టు 2, ప్రజాపార్టీ ఒకటి, ఎస్.సి.ఎఫ్-ఒకటి గెలుచుకోగా, ఇండిపెండెంట్లు పది మంది గెలిచారు.
1962, 1967 ఎన్నికలలో గెలుపొంది మంత్రిగా కూడా పనిచేసిన కార్మిక సంఘం నేత జి.సంజీవరెడ్డి ఇప్పటికీ జీవించి ఉన్నారు. బహుశా 1962 ఎన్నికలలో పోటీచేసి గెలిచినవారిలో ఈయన ఒక్కరే సజీవంగా ఉండడం విశేషం. ఆయన రాజ్యసభ సభ్యుడిగా కూడా వ్యవహరించారు.
:::కొమ్మినేని శ్రీనివాస రావు, ఏపీ మీడియా అకాడెమీ చైర్మన్