డ్రగ్స్, కంటోన్మెంట్‌పై సవాళ్లు విసిరి పారిపోయారు
దమ్ముంటే జూబ్లీహిల్స్‌లో బీజేపీ డిపాజిట్ తెచ్చుకోవాలి
అజహరుద్దీన్‌కు మంత్రి పదవి ఇస్తే కిషన్‌రెడ్డికి ఇబ్బందేంటి?
జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారంలో సీఎం రేవంత్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: అభివృద్ధిపై చర్చకు సవాల్ విసరటం.. ఆ తర్వాత పారిపోవటం బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు అలవాటేనని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఎద్దేవా చేశారు. కేంద్రంలోని నరేంద్రమోదీ ప్రభుత్వం బీజేపీ పాలిత రాష్ట్రాలపై ప్రేమ చూపిస్తూ.. ఇతర పార్టీల పాలిత రాష్ట్రాలపై వివక్ష చూపిస్తోందని ఆరోపించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం రాత్రి హైదరాబాద్‌లోని షేక్‌పేట, యూసుఫ్‌గూడలో రోడ్‌షో నిర్వహించి కార్నర్ మీటింగ్‌లలో సీఎం ప్రసంగించారు.
‘చర్చలకు సవాల్ విసరడం.. పారిపోవడం కేటీఆర్‌కు అలవాటే. గతంలో గంజాయి, డ్రగ్స్ టెస్టులంటే అమర వీరుల స్థూపం వద్ద నేను ఆరు గంటలు వేచి చూశాను. ఆయన రాలేదు. ఆసెంబ్లీలో చర్చిద్దామంటే తండ్రి కొడుకులు పారిపోయారు.
మొన్నటికి మొన్న కంటోన్మెంట్‌లో శ్రీ గణేష్ ను ఎమ్మెల్యేగా గెలిపించినందుకు నేను రూ.4 వేల కోట్లతో అభివృద్ధి చేశాననని చెబితే.. అభివృద్ధి ఎక్కడ జరిగిందో చెప్పు రాజీనామా చేస్తానని కేటీఆర్ సవాల్ విసిరారు. శ్రీ గణేష్ రూ.5 వేల కోట్ల అభివృద్ధి పనులకు సంబంధించిన జీవోలు చూపిస్తే.. రాజీనామా చేయకుండా పారిపోయిన కేటీఆర్, మళ్లీ చర్చలకు సవాల్ విసురుతున్నారు’అని ఎద్దేవా చేశారు.
తెలంగాణపై కేంద్రం వివక్ష
బీజేపీ పాలిత గుజరాత్, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ తదితర రాష్ట్రాలో అభివృద్ధికి సహకరిస్తున్న కేంద్రం.. కాంగ్రెస్ పాలిత తెలంగాణకు అన్యాయం చేస్తోందని సీఎం విమర్శించారు. గుజరాత్‌లో సబర్మతి రివర్‌ఫ్రంట్, యూపీలో గంగానదీ రివర్‌ఫ్రంట్, ఢిల్లీలో యుమునా రిఫర్‌ఫ్రంట్ కట్టుకోవచ్చు కానీ, హైదరాబాద్‌లో మూసీ రివర్‌ఫ్రంట్ ఎందుకు కట్టుకోకూడదు అని ప్రశ్నించారు.
సికింద్రాబాద్‌లో కిషన్‌రెడ్డిని గెలిపించి కేంద్ర మంత్రిని చేస్తే హైదరాబాద్‌లో మెట్రో రైలు విస్తరణ, గోదావరి జలాలు, మూసీ అభివృద్ధి, ట్రిఫుల్ ఆర్ రేడియల్ రోడ్లకు నిధులు రాకుండా అడ్డుకుంటున్నారని ఆరోపించారు. ‘కాళేశ్వరం కేసులో కేసీఆర్‌పై సీబీఐ కేసులు ఎందుకు పెట్టడం లేదని ప్రశి్నస్తే.. నాతో చర్చిస్తాననని కిషన్‌రెడ్డి అంటున్నారు.
నాతో చర్చలేంటి? ఢిల్లీలో ప్రధాని నరేంద్రమోదీ, హోంమంత్రి అమిత్‌షాతో చర్చించి కేసీఆర్, కేటీఆర్‌లను జైలుకు పంపేందుకు ఎందుకు అనుమతి ఇవ్వడం లేదో కోట్లాడాలి’అని సూచించారు. జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్‌ను 30 వేల మెజార్టీతో గెలిపిస్తామని, కిషన్‌రెడ్డికి దమ్ముంటే డిపాజిట్ తెచ్చుకోవాలని సవాల్ విసిరారు. బీఆర్‌ఎస్ పేరుతో బీజేపీ ఓట్లు అడుగుతోందని ఆరోపించారు. ప్రధాని నరేంద్రమోదీ, మాజీ సీఎం కేసీఆర్ ఒక్కటేనని విమర్శించారు.
కాంగ్రెస్ అంటేనే ముస్లిం.. ముస్లిం అంటే కాంగ్రెస్ అని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. కొడంగల్‌లో తాను మూడు సార్లు గెలవడానికి మైనార్టీల సహకారం ఎంతో ఉందని తెలిపారు. అజహరుద్దీన్‌కు మంత్రి పదవి ఇస్తే కిషన్‌రెడ్డికి సమస్య ఏంటని ప్రశ్నించారు. ఎన్నికల ప్రచారంలో పీసీసీ అధ్యక్షుడు మహేష్కుమార్‌గౌడ్, మంత్రులు ఉత్తమ్ కుమార్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్, వివేక్ వెంకటస్వామి, అజహరుద్దీన్, కొండా సురేఖ, ఎంపీ అనిల్ కుమార్‌యాదవ్, మజ్లిస్ ఎమ్మెల్యే కౌసర్‌మొయినుద్దీన్, కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.


