డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనలో రాష్ట్రం అప్పుల పాలైంది
పరిగిలో 220 కేవీ సబ్‌స్టేషన్ ప్రారంభించిన భట్టి
పరిగి: గత పదేళ్ల పాలనలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం అప్పులు చేసి, రాష్ట్రంలోని అన్ని వ్యవస్థలను నాశనం చేసిందని ఉపముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క మండిపడ్డారు. వికారాబాద్ జిల్లా పరిగి పట్టణ కేంద్రంలోని నజీరాబాద్‌తండాలో బుధవారం ఆయన 220 కేవీ సబ్‌స్టేషన్‌ను ప్రారంభించి, 400 కేవీ విద్యుత్ సబ్ స్టేషన్, 33 కేవీ సబ్‌స్టేషన్లకు శంకుస్థాపన చేశారు.
అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ.. బీఆర్‌ఎస్ ప్రభుత్వంలో రూ.1లక్ష కోట్లతో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా రాష్ట్ర ప్రజలకు ఎలాంటి ఉపయోగం లేకుండాపోయిందన్నారు. గత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి దేశంలోనే మొట్టమొదటిగా రైతులకు ఉచిత విద్యుత్‌ను సరఫరా చేశారని గుర్తుచేశారు. కాంగ్రెస్ అంటేనే కరెంట్ అని పేర్కొన్నారు.
రాష్ట్రంలో 53 లక్షల కుటుంబాలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ను అందిస్తున్నామన్నారు. ఉచిత విద్యుత్ కోసం ఇప్పటి వరకు రూ.2,830 కోట్లు ఆ శాఖకు కేటాయించామని వెల్లడించారు. దళితులకు 3 ఎకరాల భూమి, ఇంటికో ఉద్యోగం, బంగారు తెలంగాణ అంటూ మభ్య పెట్టిన బీఆర్‌ఎస్ ప్రభుత్వం రాష్ట్రానికి చేసిందేమీ లేదన్నారు. కేసీఆర్ పాలనలో ఒక్కరికి కూడా ఇల్లు రాలేదని ధ్వజమెత్తారు.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే రాష్ట్రంలో 4.5 లక్షల ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేసిందని చెప్పారు. తెలంగాణను దేశంలోనే అగ్రగామిగా నిలబెట్టే విధంగా సీఎం రేవంత్‌రెడ్డి ప్రభుత్వం కృషి చేస్తోందని అన్నారు. ఈ కార్యక్రమంలో శాసన మండలి చీఫ్‌విప్ పట్నం మహేందర్‌రెడ్డి, పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి, డీసీసీ ఉపాధ్యక్షుడు లాల్‌కృష్ణ తదితరులు పాల్గొన్నారు.


