ఢిల్లీ వెళ్లిన చంద్రబాబుకు షాక్‌.. ఎంపీ కేశినేని వైఖరితో నిర్ఘాంతపోయిన బాబు

TDP MP Kesineni Nani Impatient On Chandrababu - Sakshi

సాక్షి, అమరావతి, న్యూఢిల్లీ : చంద్రబాబు ఢిల్లీ పర్యటనలో సొంత పార్టీ ఎంపీ నుంచే తిరస్కారం ఎదురైంది. విజయవాడ ఎంపీ కేశినేని నాని ఆయనతో అంటీముట్టనట్లు వ్యవహరించారు. చంద్రబాబుకు స్వాగతం పలుకుతూ తన సహచర ఎంపీ గల్లా జయదేవ్‌ బొకే ఇచ్చేందుకు పిలిచినా, ఆయన దానిని తోసేస్తూ నిరాకరించారు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతోంది. కొంత కాలంగా కేశినేని నాని.. చంద్రబాబు వైఖరిపై తరచూ అసంతృప్తి వెలిబుచ్చుతూనే ఉన్నారు. చంద్రబాబు వచ్చే ఎన్నికల్లో గెలవలేరని కొద్దిరోజుల క్రితం కుండబద్ధలు కొట్టినట్లు చెప్పారు.
చదవండి: ‘ఏపీలో బీజేపీని బాబు జనతా పార్టీగా మార్చేశారు’

చంద్రబాబు భజన పరులనే నమ్ముతారని, వాస్తవాలు చెప్పేవాళ్లు ఆయనకు నచ్చరని విమర్శించారు. తరచూ ఆయన అసమ్మతి స్వరం వినిపిస్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌ జాతీయ కమిటీ సమావేశానికి హాజరయ్యేందుకు నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీకి వచ్చారు. శనివారం ఉదయం ఆయనకు స్వాగతం పలికేందుకు టీడీపీ ఎంపీలు గల్లా జయ్‌దేవ్, రామ్మోహన్‌ నాయుడు, కనకమేడల రవీంద్రకుమార్‌లతో కేశినేని నాని విమానాశ్రయానికి వచ్చారు. అక్కడ చంద్రబాబుకు బొకే ఇవ్వాలని గల్లా జయదేవ్‌ కోరినప్పటికీ నాని తిరస్కరించడం చూసి అక్కడ ఉన్న వారంతా ఆశ్చర్యపోయారు. నాని ప్రవర్తనతో ఎంపీలతో సహా బాబు సైతం నిర్ఘాంతపోయారు. అనంతరం బాబు వెనకాలే అయిష్టంగా నడిచి వెళ్లిన నాని, తోటి ఎంపీలు పిలిచినా రాకుండా ఒంటరిగా సొంత కార్లో వెళ్లారు. బాబు గల్లా జయ్‌దేవ్‌ ఇంట్లో గడిపిన కొద్ది సమయంలోనూ నాని అక్కడే ఉన్నా, ముభావంగా ఉన్నారు.

బాబుతో రఘురామ భేటీ 
అశోకా రోడ్‌లో ఉన్న గల్లా జయదేవ్‌ ఇంట్లో చంద్రబాబు నాయుడు ఉన్న సమయంలోనే నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు అక్కడికి వచ్చారు. మధ్యాహ్నం 2 గంటలకు వచి్చన రఘురామ సాయంత్రం 4 గంటల వరకు.. దాదాపు 2 గంటల పాటు బాబుతో కలిసే ఉన్నారు. ఇదే సమయంలో అక్కడ ఉన్న కేశినేని నానిని వేరే గదిలోకి పంపి, వివిధ అంశాలపై బాబు, రఘురామ రహస్యంగా సుదీర్ఘ చర్చలు జరిపారు.

అనంతరం అక్కడి నుంచి చంద్రబాబు రాష్ట్రపతి భవన్‌లో ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన జాతీయ కమిటీ సమావేశానికి వెళ్లారు. అంతకు ముందు చంద్రబాబు.. రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో భేటీ అయ్యారు. ఆమెకు శుభాకాంక్షలు తెలిపి.. 10 నిమిషాల పాటు వివిధ అంశాలపై చర్చించారు. ఇదిలా ఉండగా, చంద్రబాబు..  ప్రధానితో ఒకటి రెండు నిమిషాల పాటు ముచ్చటించారు. అయితే ఏ విషయం గురించి మాట్లాడారన్నది తెలియరాలేదు. కేంద్ర మంత్రులు నితిన్‌ గడ్కరీ, అశ్విని వైష్ణవ్‌ సహా క్రీడాకారులు పీటీ ఉష, పుల్లెల గోపీచంద్, సినీ నటుడు రజినీకాంత్‌తో సైతం ముచ్చటించారు.    

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top