దర్శిలోనూ దౌర్జన్యం

TDP leaders Over Action In Prakasam District Darsi - Sakshi

దర్శి: ప్రకాశం జిల్లా దర్శి నగర పంచాయతీ నామినేషన్ల ఘట్టం చివరి రోజున టీడీపీ నేతలు దౌర్జన్యానికి తెగబడ్డారు. దర్శి నగర పంచాయతీ 8వ వార్డులో టీడీపీ తరఫున చింతలపూడి శ్రీనివాసరావు, ఆయన తండ్రి సాంబయ్య ఇద్దరూ నామినేషన్‌ వేశారు. సోమవారం ఉపసంహరణకు ఆఖరి రోజు కావడంతో వారు నామినేషన్‌లు ఉపసంహరించుకున్నారు. ఆ వార్డులో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి మేడం మోహన్‌రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. దీంతో సహనం కోల్పోయిన టీడీపీ జిల్లా అధ్యక్షుడు నూకసాని బాలాజీ, నేతలు.. దామచర్ల జనార్దన్, నారపుశెట్టి పాపారావు, కందుల నారాయణరెడ్డి, పమిడి రమేష్‌ ఎన్నికల అధికారి కార్యాలయం ముందు నానా యాగీ చేశారు.

కార్యాలయం లోపలికి వెళ్తామంటూ పోలీసులపై దౌర్జన్యానికి దిగారు. ఎన్నికల అధికారి అనుమతి ఉంటేనే లోపలికి పంపుతామని ఎస్‌ఐ చంద్రశేఖర్‌ నచ్చజెప్పినా వినిపించుకోలేదు. ఆర్వోనే బయటకు రావాలని, లేదంటే తామే లోపలికి వెళ్లి తేల్చుకుంటామంటూ ఎస్‌ఐకి వేలు చూపిస్తూ దురుసుగా వ్యవహరించారు. ఎట్టకేలకు తమ లాయర్‌ రావడంతో టీడీపీ నేతలు కార్యాలయంలోనికి వెళ్లారు. టీడీపీ అభ్యర్థి నామినేషన్‌ ఉపసంహరించుకున్నట్టు చూపడంతో నేతలు వెనుదిరిగారు. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top