
వైఎస్సార్ సీపీ నేతలను హతమార్చేందుకు ప్రణాళిక
రవి తమ్ముడు భరత్, చిన్నాన్న రఘు రంగ ప్రవేశం
ఎమ్మెల్సీ రమేష్‌యాదవ్‌కు రక్షణ కరువు..
కుట్రలకు పక్కాగా సహకరిస్తున్న పోలీసు యంత్రాంగం
సాక్షి టాస్క్‌ఫోర్స్: ‘పులివెందుల గడ్డపై జెడ్పీటీసీ విజయం టీడీపీ సొంతం కావాలి...! ఏమి చేస్తారో... ఎలా చేస్తారో మీ ఇష్టం..! ప్రభుత్వం నుంచి సంపూర్ణ సహకారం ఉంటుంది.. మీకు నచ్చినట్లు యంత్రాంగాన్ని ఉపయోగించుకోండి...!’ ముఖ్యమంత్రి కార్యాలయం చేసిన ఈ డైరెక్షన్‌తో పులివెందుల టీడీపీ ఇన్‌ఛార్జి బీటెక్ రవి యాక్షన్‌లోకి దిగిపోయారు. జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో ఎలాగైనా గెలుపే లక్ష్యంగా అరాచకాలకు తెగబడుతున్నారు. అడ్డొచ్చిన వారిని అంతమొందించాలని పథక రచన చేస్తున్నారు.
అందులో భాగంగానే వైఎస్సార్‌సీపీ నేతలపై హత్యాయత్నం ఘటనలు వరుసగా చోటు చేసుకుంటున్నట్లు స్పష్టమవుతోంది. పచ్చ ముఠాలు పట్టపగలు మారణాయుధాలతో దాడికి తెగబడినప్పటికీ ఎమ్మెల్సీ రమేష్‌యాదవ్‌కు గన్‌మేన్ సిద్ధయ్య కనీస ప్రొటెక్షన్ కల్పించకపోవడం గమనార్హం. గాల్లోకి కాల్పులు జరపలేదు. ఉన్నత స్థాయి ఆదేశాలతోనే గన్‌మెన్ మిన్నకుండిపోయినట్లు సమాచారం.
తొలుత సైదాపురం సురేష్‌కుమార్‌రెడ్డి (చంటి), అమరేష్రెడ్డిని టీడీపీ గూండాలు లక్ష్యంగా చేసుకోగా తర్వాత రోజు ఎమ్మెల్సీ రమేష్ యాదవ్, వేల్పుల రామలింగారెడ్డిపై హత్యాయత్నం జరిగింది. ఎమ్మెల్సీ రమేష్‌యాదవ్ వాహనాన్ని ధ్వంసం చేసి పెట్రోల్ పోసి తగలబెట్టే యత్నం చేశారు. ఇంత జరుగుతున్నా వాహనంలో ఉన్న ఎమ్మెల్సీ రమేష్‌యాదవ్, వేల్పుల రామలింగారెడ్డిలను కాపాడాలనే ప్రయత్నం గన్‌మెన్ సిద్ధయ్య చేయకపోవడం పలు అనుమానాలకు దారి తీస్తోంది.
హత్యోదంతంలో రవి కుటుంబ సభ్యులు..
ఎమ్మెల్సీ రమేష్‌యాదవ్, వేల్పుల రామలింగారెడ్డిలపై హత్యాయత్నం ఘటనలో స్వయంగా టీడీపీ ఇన్‌చార్జి బీటెక్ రవి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. ఆయన తమ్ముడు మారెడ్డి భరత్‌రెడ్డి, చిన్నాన్న రఘునాథరెడ్డి మారణాయుధాలు వెంట బెట్టుకొని నడిచి రాగా.. పేర్ల శేషారెడ్డి, మబ్బుచింతపల్లె శ్రీనాథరెడ్డి, విజయ్‌కుమార్‌రెడ్డి, కిరికిరి బాషా అండ్ ఎల్లోగ్యాంగ్ వేల్పుల రామును హత్య చేసేందుకు యత్నించారు. అయితే నల్లగొండువారిపల్లె గ్రామస్తులు తిరగబడడంతో అదృష్టవశాత్తు బతికి పోయారు.
కొమ్ము కాస్తున్న యంత్రాంగం...
పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో అధికార యంత్రాంగం పూర్తి ఏకపక్షంగా వ్యవహరిస్తోంది. హత్యా యత్నానికి సంబంధించి రెండు ఘటనల్లోనూ తదుపరి ఎలాంటి చర్యలు లేవు. గురువారం కూడా టీడీపీ గ్యాంగ్ ఇనుప రాడ్లు వెంటబెట్టుకొని వాహనాల్లో యథేచ్ఛగా పులివెందులలో సంచరించింది. మరోవైపు బాధితులపైనే రివర్స్ కేసు నమోదు కావటాన్ని పరిశీలిస్తే పోలీస్ ఉన్నతాధికారులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నట్లు స్పష్టమవుతోంది. వైఎస్సార్ïÜపీ కీలక నేతలు ఎక్కడెక్కడ పర్యటిస్తున్నారు? ఎవరెవరు ఉన్నారు? ఎంతమంది ఫాలో అవుతున్నారు.
టార్గెట్ చేసుకున్న వ్యక్తి అక్కడ ఉన్నాడా? లేడా? తదితర సమాచారం అంతా స్థానిక పోలీసుల ద్వారా అధికార పార్టీ నేతలకు ఎప్పటికప్పుడు చేరుతున్నట్లు సమాచారం. ఇక బ్యాలెట్ పేపర్ ముద్రించడంలో కూడా మతలబు ఉన్నట్లు అనుమానాలు రేకెత్తుతున్నాయి. 11 మంది పోటీలో ఉన్న జెడ్పీటీసీ ఎన్నికల్లో బ్యాలెట్‌ను సింగిల్‌గా కాకుండా డబుల్ సైడ్ గుర్తులు ఇస్తూ ముద్రించేందుకు అధికారులు సిద్ధమైనట్లు తెలుస్తోంది.
ఓటర్లను గందరగోళానికి గురి చేయాలనే ఈ ఎత్తుగడ వేసినట్లు స్పష్టమవుతోంది. వైఎస్సార్‌సీపీ అభ్యర్థి తుమ్మల హేమంత్‌రెడ్డి గుర్తు 1వ గడిలో ఉంది. డబుల్ సైడ్ బ్యాలెట్ పేపర్‌ను మడత వేయడం వల్ల ఎక్కువగా వైఎస్సార్‌సీపీ ఓట్లు చెల్లకుండా పోవాలనే కుయుక్తి దాగి ఉన్నట్లు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.