అన్నాడీఎంకేకు మరో షాక్‌: చేజారనున్న ‘పెద్దరికం’

Tamil Nadu: AIADMK Losing Her Seats In Rajya Sabha - Sakshi

రాజ్యసభలో పడిపోతున్న బలం

ఇద్దరు మృతి, మరో ఇద్దరు రాజీనామాతో శ్రేణుల్లో ఆవేదన

ఇప్పటికే అసెంబ్లీ ఎన్నికల్లో చావుదెబ్బతిన్న.. అన్నాడీఎంకే రాజ్యసభలోనూ తన బలాన్ని క్రమంగా కోల్పోతోంది. ఉన్నత స్థాయిలో తీసుకున్న అనాలోచిత నిర్ణయాలకు తోడు ఇద్దరు సభ్యుల ఆకస్మిక మరణం పెద్దలసభలో పార్టీ స్థాయి దిగజారడానికి ముఖ్య కారణాలని.. పార్టీ వర్గాలు వాపోతున్నాయి.  భవిష్యత్‌లో పార్లమెంటరీ కమిటీలోనూ పార్టీ ప్రాతినిథ్యం కోల్పోనుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

సాక్షి ప్రతినిధి, చెన్నై: పదవుల కోసం ఎంతోమంది పాకులాడుతుంటే వారిద్దరూ ఉన్న పదవులకు రాజీ నామా చేసి రాజ్యసభలో.. పార్టీని సంక్షోభంలో పడేశారని అన్నాడీఎంకే శ్రేణులు వాపోతున్నాయి. అగ్రనేతల స్వయంకృతాపరాధం వల్లే  పెద్దలసభలో పెద్దరికం కోల్పోయే దశకు చేరుకున్నామని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా అన్నాడీఎంకే ఉప సమన్వయకర్త కేపీ మునుస్వామి తన సభ్యత్వానికి రాజీనామా చేయడం వల్ల రాజ్యసభలో పార్టీ అంతస్థును కోల్పోనుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

రాజ్యసభలో అన్నాడీఎంకేకు చెందిన తంబిదురై, నవనీతకృష్ణన్, విజయకుమార్, ఎస్‌ఆర్‌ బాలసుబ్రమణ్యం, చంద్రశేఖరన్, వైద్యలింగం, కేపీ మునుస్వామి, పుదుచ్చేరి గోపాలకృష్ణన్‌.. ఇలా ఎనిమిది మంది సభ్యుల బలం ఉండేది. ఇటీవల తమిళనాడులో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వైద్యలింగం, కేపీ మునుస్వామి పోటీ చేసి గెలుపొందడంతో రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా సమరి్పంచారు. దీంతో పార్టీ బలం ఆరుకు పడిపోయింది. అక్టోబరులో గోపాలకృష్ణన్‌ పదవీకాలం ముగిసిపోతుండడంతో అది కాస్తా.. ఐదుకు చేరనుంది.

ఇక 2022 జూన్‌లో ఎస్‌ఆర్‌ బాలసుబ్రమణియమ్, నవనీత కృష్ణన్, విజయకుమార్‌ పదవీకాలం ముగుస్తుండగా రాజ్యసభలో అన్నాడీఎంకే బలం రెండు స్థానాలకు పరిమితం కానుంది. అదే ఏడాది రాజ్యసభలో డీఎంకే ఎంపీలు ఆర్‌ఎస్‌ భారతి, టీకేఎస్‌ ఇళంగోవన్‌ పదవీకాలం ముగుస్తుంది. ఈ ఐదుస్థానాలకు జరిగే ఎన్నికల్లో ఎమ్మెల్యేల సంఖాబలాన్ని బట్టి డీఎంకే మూడు, అన్నాడీఎంకేకు రెండు స్థానాలు దక్కుతాయి. ఈ లెక్కన వచ్చే ఏడాది జూన్‌ నాటికి అన్నాడీఎంకేకు రాజ్యసభలో నలుగురు ఎంపీలే మిగులుతారు. ఇక సభలో కనీసం ఐదుగురు సభ్యులుంటేనే పార్లమెంటరీ కమిటీలో చోటుదక్కుతుంది. ఐదుగురు సంఖ్యాబలం ఉన్నపుడే రాజ్యసభలో జరిగే చర్చల్లో నిర్ణీత సమయం కేటాయించి ప్రసంగించే అవకాశాన్ని రాజ్యసభ చైర్మన్‌ ఇస్తారు. ఐదుకంటే తక్కువ సంఖ్యాబలం ఉన్నట్లయితే ఇతర పారీ్టల జాబితాలో వారిని చేరుస్తారు. అంతేగాక ప్రసంగించేందుకు తక్కువ సమయం కేటాయిస్తారు. దీంతో పార్లమెంటరీ కమిటీ అంతస్థును కూడా అన్నాడీఎంకే కోల్పోనుంది. పార్టీ సీనియర్‌ నాయకుల స్వయంకృతాపరాధం, స్వార్థమే ఈ పరిస్థితికి కారణమని అన్నాడీఎంకే శ్రేణులు మండిపడుతున్నారు.

ఇంకా వారు మాట్లాడుతూ, వైద్యలింగానికి ఏడాది, కేపీ మునుస్వామికి ఐదేళ్ల పదవీకాలం ఉంది. ఎమ్మెల్యేలుగా ఎన్నికైనందున ఇద్దరూ రాజీనామా చేశారు. ఏడాదితో ముగిసిపోయే పదవికి వైద్యలింగం రాజీనామా చేయడాన్ని ఏలాగో సరిపెట్టుకోవచ్చు, ఐదేళ్ల పదవీకాలం ఉన్న కేపీ మునుస్వామి రాజీనామా చేయడం జీరి్ణంచుకోలేక పోతున్నామని కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నాలుగేళ్ల పదవీకాలం ఉన్నదశలో తమ పార్టీ రాజ్యసభ సభ్యులు మహమ్మద్‌ జాన్, మార్సిల్‌ ఇప్పటికే మరణించారు. ఖాళీగా మారిన ఈ రెండు స్థానాలకు ఆరునెలల్లోగా ఎన్నికలు జరపాల్సి ఉంది. వైద్యలింగం, కేపీ మునుస్వామి కూడా రాజీనామా చేయడంతో ఈ ఏడాది సెప్టెంబర్‌లో మూడుస్థానాలకు ఎన్నికలు జరపాల్సిన పరిస్థితి నెలకొంది. తమిళనాడు అసెంబ్లీలో 159 మంది సభ్యుల బలం కలిగిన డీఎంకే మొత్తం మూడు స్థానాలను గెలుచుకునే అవకాశం ఉంది. కేవలం 75 మంది సభ్యుల బలం ఉన్నా అన్నాడీఎంకేకు ఒక్క రాజ్యసభ స్థానం కూడా దక్కేపరిస్థితి లేదని వాపోతున్నారు.

చదవండి: రాష్ట్రాలకు నెట్టేసి నోరు మెదపని ప్రధాని మోదీ
చదవండి: మృత్యుఘోష: బాంబుల మోతతో దద్దరిల్లిన గాజా

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top