అధికార పార్టీ అండదండలతో జిల్లాలో కొందరు కల్లు వ్యాపారులు పేదల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. వారి ఆగడాలను అడ్డుకోవాల్సిన అధికారులు వంతపాడుతున్నారు. పైగా కళ్ల ముందు కల్తీ బాధితులు కనిపిస్తున్నా.. మా కళ్లకు అలాంటివేం కనిపించడం లేదంటూ నిర్లక్ష్యంగా స్టేట్‌మెంట్లు ఇస్తున్నారు. స్వయంగా సీఎం బావమరిది నందమూరి బాలకృష్ణ ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో కనిపిస్తున్న పరిస్థితులు ఇవి.
కల్తీ కల్లుతో హిందూపురం, పరిగి మండలాలకు చెందిన పేదలు తీవ్ర అస్వస్థతకు గురవుతున్నారు. మతిస్థిమితం కోల్పోయి వింతగా ప్రవరిస్తుండటంతో ఆస్పత్రులకు తరలిస్తున్నారు. రెండురోజుల క్రితం చౌళూరులో కల్లుతాగిన 13 మంది అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. స్థానికంగా వైద్యం అందించినా పరిస్థితి మెరుగుపడకపోవడంతో బంధువులు వారిని పొరుగున్న ఉన్న కర్ణాటక ఆస్పత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు.
బాలయ్య ఫోకస్ మారాలి
హిందూపురంలో ఇప్పటిదాకా ఏ ఇష్యూపైనా ఎమ్మెల్యే బాలకృష్ణ నేరుగా స్పందించింది లేదు. ఇప్పుడు అధికార పార్టీ నేతల ఆధర్వ్యంలో జరుగుతున్న కల్తీ కల్లు వ్యవహారంపైనా ఆయన స్పందిస్తారన్న ఆశలేదని స్థానికులు అంటున్నారు. అయితే ఈ వ్యవహారంపై స్పందిస్తూ ఆస్ట్రేలియా ఎన్నారై, వైఎస్సార్సీపీ సీనియర్ నేత సూర్య నారాయణ రెడ్డి బాలయ్యపై మండిపడ్డారు.

ఏపీలో ప్రతీది కల్తీమయం అవుతోందని.. రెక్కాడితే గానీ డొక్కాడని బతుకులను కల్తీ కల్లు కాటేయడం బాధాకరమని అన్నారాయన. ఎప్పుడో ఒకసారి అసెంబ్లీకి వెళ్లి వైఎస్ జగన్ మీదనో, చిరంజీవి మీదనో నోటి దురద తీర్చుకోవడం తప్పించి నియోజకవర్గానికి చేసిందేమీ లేదని అన్నారు. ఆయన నియోజకవర్గంలో పేదలు కల్తీ కల్లు బారిన పడడం.. అందులో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉండడం బాధాకరమని అన్నారు. బాలయ్య తన నటనను సినిమాల వరకే పరిమితం చేయాలని.. పేదవాళ్ల జీవితాలతో ఆడుకోవద్దని.. ఇకనైనా ఫోకస్ హిందూపురం మీద పెడితే బాగుంటుందని సూర్య నారాయణ రెడ్డి హితవు పలికారు.
జోరుగా..
హిందూపురం పెనుకొండ, మడకశిర నియోజకవర్గాల పరిధిలోని పలు గ్రామాల్లో రసాయనాలు కలిపిన కల్లు విక్రయాలు జరుగుతున్నాయి. చౌళూరుకు సరిహద్దున ఉన్న కర్ణాటక గ్రామాల నుంచి సైతం వస్తున్నారు. ఈ వ్యవహారంలో ఎక్సైజ్ అధికారులు ఏమీ పట్టనట్లు వ్యవరిస్తున్నారనే ఆరోపణలున్నాయి. ఈత వనాల నుంచి అరకొరగా వచ్చే కల్లును సేకరించి అందులో డైజోఫాం, హెచ్ తదితర రసాయనాలతోపాటు తీపి కోసం(డబుల్ డెక్కర్) చాకరిన్, చక్కెర, తెలుపు కోసం మైదా కలిపి పేద ప్రజలకు విక్రయిస్తున్నారని తెలుస్తోంది.

పుట్టపర్తి ప్రాంతంలో ఉన్న ఓ అధికారి కల్లు దుకాణాల నిర్వహణలో చక్రం తిప్పుతున్నారు. హిందూపురం పరిధిలోని ఓ అధికారి నెలనెలా సొసైటీల నుంచి వసూళ్లు చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. హిందూపురానికి చెందిన ఓ వ్యాపారి కొన్నేళ్లుగా గీత సొసైటీలను తన ఆధీనంలోకి తీసుకున్నారు. హైదరాబాద్, మహారాష్ట్ర నుంచి డైజోఫాం, హెచ్‌ను గుట్టుచట్టుప్పుడు కాకుండా దిగుమతి చేసుకుని తన ఫాంహౌస్‌లో ఈత కల్లులో కలిపిస్తున్నారు. ఈ ఘటనలపై పోలీసులు కేసులు నమోదు చేశారు.


