
సాక్షి, తాడేపల్లి: తన రెంటపాళ్ల పర్యటనలో మృతి చెందిన చీలి సింగయ్య, పాపసాని వెంకట జయవర్ధన్ రెడ్డి కుటుంబ సభ్యులను వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డిని కలిశారు. బుధవారం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయానికి ఆ రెండు కుటుంబాలను రప్పించుకున్న ఆయన.. పార్టీ తరఫున అండగా నిలుస్తామని భరోసా ఇచ్చారు.
తొలుత చీలి సింగయ్య భార్య లూర్ధు మేరి, పిల్లలు, ఇతర కుటుంబ సభ్యులు జగన్‌ను కలిశారు. ఇప్పటికే ఆ కుటుంబానికి వైఎస్సార్‌సీపీ అండగా నిలిచింది. రూ.10 లక్షల ఆర్థిక సాయం కూడా అందజేసింది. ఈ తరుణంలో సింగయ్య కుటుంబ సభ్యులను ఓదార్చిన వైఎస్ జగన్.. పార్టీ అన్ని విధాల అండగా ఉంటుందని, ఆదుకుంటామని తెలిపారు.

వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ లేళ్ళ అప్పిరెడ్డి, ప్రత్తిపాడు నియోజకవర్గ సమన్వయకర్త బలసాని కిరణ్‌కుమార్ సింగయ్య కుటుంబాన్ని వెంట పెట్టుకుని వచ్చారు. అదే సమయంలో..

ఈ పర్యటనలో సత్తెనపల్లికి చెందిన పాపసాని వెంకట జయవర్దన్‌రెడ్డి గుండెపోటుకు గురై మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ కుటుంబానికి కూడా వైఎస్సార్‌సీపీ అండగా నిలిచింది. తక్షణమే పార్టీ తరఫున రూ.10 లక్షల సాయం అందజేశారు. ఇవాళ జయవర్ధన్ తల్లిదండ్రులు సావిత్రి, భాస్కర్ రెడ్డి, సోదరుడు మణికంఠ రెడ్డి, ఇతర కుటుంబ సభ్యులు జగన్‌ను కలిశారు. జయవర్ధన్ కుటుంబాన్ని వైఎస్సార్‌సీపీ అన్నివిధాల ఆదుకుంటుందని ఈ సందర్భంగా వైఎస్ జగన్ భరోసా ఇచ్చారు. ఈ కుటుంబం వెంట వైఎస్సార్‌సీపీ సత్తెనపల్లి నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ గజ్జల సుధీర్ భార్గవ్ రెడ్డి వచ్చారు.
