
సాక్షి, తాడేపల్లి: ఏపీలో చంద్రబాబు సర్కార్ నిర్లక్ష్యం కారణంగా రైతులకు యూరియా కొరత, రైతాంగ సమస్యలపై వైఎస్సార్‌సీపీ నిరసనలకు పిలుపునిచ్చింది. ఈ క్రమంలో ఈనెల 9న వైఎస్సార్‌సీపీ ‘అన్నదాత పోరు’ కార్యక్రమం చేపట్టనుంది. ఇందులో భాగంగా ఆర్డీవో కార్యాలయాల ఎదుట శాంతియుత నిరసనలు చేపట్టాలని పార్టీ నిర్ణయం తీసుకుంది.
ఈ సందర్భంగా ‘అన్నదాత పోరు’ పోస్టర్‌ని వైఎస్సార్‌సీపీ స్టేట్ కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి రిలీజ్ చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు లేళ్ల అప్పిరెడ్డి, మొండితోక అరుణ్ కుమార్, నందిగం సురేష్, వెల్లంపల్లి శ్రీనివాస్, టీజేఆర్ సుధాకర్ బాబు, రాయన భాగ్యలక్ష్మి, మనోహర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్బంగా పార్టీ స్టేట్ కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ..‘రాష్ట్రంలో నియంతృత్వ పాలన నడుస్తోంది. రైతులు యూరియా అడిగితే బొక్కలో తోస్తానంటూ సీఎం మాట్లాడతారా?. రైతులను బెదిరించటం, తొక్కుతాం, నారతీస్తాం అంటారా?. రైతులంటే అంత చిన్న చూపేంటి?. ఈ ప్రభుత్వ మెడలు వంచేంత వరకు వైఎస్సార్‌సీపీ పార్టీ వెనుకడుగు వేయదు. రైతులకు యూరియా సరఫరా చేసే వరకు పోరాటం చేస్తాం. ఈనెల 9న ఆర్డీవో కార్యాలయాల ఎదుట శాంతియుత నిరసనలు చేపడతాం.
రాష్ట్రంలో ఇప్పటికి 60 శాతం సాగు కూడా కాలేదు. కానీ, ఎక్కడా యూరియా మాత్రం అందటం లేదు. యూరియాను టీడీపీ నేతలే బ్లాక్ మార్కెట్‌కు తరలించుకున్నారు. సమస్యను సృష్టించి, అందులో నుంచి దోపిడీ చేయటం టీడీపీ నేతలకు బాగా తెలుసు. రైతులకు విత్తనాలు, ఎరువులు ఏవీ అందటం లేదు. ఎరువుల కొరత లేదంటున్న చంద్రబాబుకు రైతుల క్యూలు కనపడటం లేదా?. కాళ్లు అరిగేలా తిరుగుతున్న రైతులు కనపడటం లేదా?. మిర్చి, పొగాకు, మామిడి రైతులు కష్టపడుతుంటే చంద్రబాబు చోద్యం చూశారు. వైఎస్ జగన్ వెళ్తే హడావుడిగా కేంద్రానికి లేఖలు రాశారు. ఉల్లికి ధర లేదని వైఎస్సార్‌సీపీ నేతలు వెళ్తే మళ్ళీ హడావుడి చేశారు. ఇదేమైనా నియంతృత్వ పాలనా?. యూరియా అడిగితే బెదిరించే సీఎంని ఇప్పుడే చూస్తున్నాం’ అని వ్యాఖ్యలు చేశారు.