సాక్షి,తాడేపల్లి: మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాల్లో 12న జరిగే ర్యాలీలను సూపర్ సక్సెస్ చేద్దాం. వైద్య వ్యవస్ధను నిర్వీర్యం చేసిన కూటమి ప్రభుత్వానికి గుణపాఠం చెబుదాం. ప్రజా స్పందనను బలంగా వినిపిద్దాం’అంటూ పార్టీ స్టేట్ కో ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి పిలుపునిచ్చారు.
వైఎస్సార్‌సీపీ సీఈసీ, ఎస్‌ఈసీ సభ్యులు, అనుబంధ విభాగాల అధ్యక్షులు, వర్కింగ్ ప్రెసిడెంట్స్, మండల పార్టీ అధ్యక్షులు, జెడ్పీ ఛైర్మన్‌లు, వైస్ ఛైర్మన్‌లు, జెడ్పీటీసీలు, మేయర్లు, డిప్యూటీ మేయర్లు, కార్పొరేటర్లు, మునిసిపల్ ఛైర్‌పర్సన్‌లు, వైస్ ఛైర్‌పర్సన్‌లు, కౌన్సిలర్లు, ఎంపీపీలు, వైస్ ఎంపీపీలతో సజ్జల రామకృష్ణారెడ్డి టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఈ సందర్భంగా సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ.. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఈ నెల 12న ర్యాలీలు జరుగనున్నాయి, కోటి సంతకాల సేకరణ కోసం క్షేత్రస్ధాయిలో మీరంతా ఉన్నారు, ఇదంతా కూడా ఒక ప్రజా ఉద్యమంగా కొనసాగుతోంది. మీ అందరి భాగస్వామ్యం వల్ల కోటి సంతకాల సేకరణ రచ్చబండ కార్యక్రమం విజయవంతం అవుతుంది.
మనం తీసుకుంటున్న ప్రజాభిప్రాయాన్ని ప్రతిబింబించేలా 12న జరిగే ర్యాలీలు ఉండాలి. వైద్యవ్యవస్ధను జగన్ ప్రజలకు చక్కటి గొడుగులా తయారుచేస్తే చంద్రబాబు దానిని నిర్వీర్యం చేశారు. మనం చేసే ఆందోళనలు, ర్యాలీలు జాతీయస్ధాయిలో చర్చ జరిగేలా ఉండాలి. అప్పుడే చంద్రబాబు ప్రభుత్వం దిగివస్తుంది. కలిసి వచ్చే పార్టీలందరినీ కలుపుకుపోదాం. కులసంఘాలు, స్వఛ్చంద సంస్ధలు, ట్రేడ్ యూనియన్లు ఇలా అందరినీ కలుపుకుందాం. అప్పుడే సూపర్ సక్సెస్ అవుతుంది. ఇందుకు అవసరమైన కసరత్తు పూర్తిచేయాలి. ఏ మాత్రం ఏమరుపాటు వద్దు, అందరూ ఈ కార్యక్రమాన్ని పర్సనల్‌గా తీసుకుని సక్సెస్ చేయాలి. సోషల్ మీడియా, డిజిటల్ మీడియాను విస్తృతంగా వినియోగించుకుందాం. మీ పరిధిలో ఉన్న వారందరినీ ఒక్క తాటిపైకి తీసుకొచ్చి ర్యాలీలు సక్సెస్ చేయాలి. మీరంతా ఓనర్ షిప్ తీసుకుని లీడర్లుగా నిరూపించుకునే అవకాశం ఇది.
స్ధానిక సంస్ధల ఎన్నికలు ఎప్పుడొచ్చినా మీరంతా సిద్దంగా ఉండాలి, దీనిపై కూడా సీరియస్‌గా దృష్టిపెట్టాలి. క్షేత్రస్ధాయి నుంచి పార్టీ కమిటీలు, అనుబంధ విభాగాల కమిటీల నియామకంపై ప్రత్యేక దృష్టిపెట్టాలి. ఈ కమిటీలన్నీ పూర్తయితే దాదాపు 13 లక్షల మంది సైన్యం సిద్దమవుతుంది. ఇదంతా పారదర్శకంగా డిజిటలైజేపన్ చేయాలి. పరిశీలకుల సహాకారం తీసుకుని పక్కాగా చేయండి. కేంద్ర కార్యాలయం నుంచి అవసరమైన సహకారం ఉంటుంది. అన్ని నియోజకవర్గాల్లో డిజిటల్ మేనేజర్లను కూడా నియమించడం జరిగింది. కమిటీల ఏర్పాటు పకడ్భందీగా చేయాలి, డేటా అంతా కూడా డిజిటలైజ్ చేయాలి.
ప్రతి ఇంట్లో మన పార్టీ ఉంటుంది, నిత్యం ప్రజా సమస్యలపై మనం చేస్తున్న పోరాటాలకు అనూహ్యమైన మద్దతు లభిస్తోంది. ప్రజల్లో మన పార్టీకి ఉన్న ఇమేజ్ బాగా పెరుగుతుంది. దీనిని ఇంకా మరింతగా పెంచుకుందాం. కూటమి ప్రభుత్వ అరాచకాలను ధీటుగా ఎదుర్కొందాం’అని సూచించారు.


