
మీ కుటుంబంలో మంచి జరిగితేనే ఓటు వేయమని జగన్ అంటున్నారు. ఎంతో ఆత్మవిశ్వాసం ఉంటేనే అలా అడగగలరు. అలా చంద్రబాబు ఎందుకు ఓటు అడగలేకపోతున్నారు.
సాక్షి, తాడేపల్లి: తమ మేనిఫెస్టో ప్రజలకు అరచేతిలో వైకుంఠం చూపించేదిలా ఉండదని.. ప్రజలకు ఏం చేస్తామో అదే చెప్పామని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ఆదివారం ఆయన తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ, తాయిళాలు ప్రకటించి ఓట్లు వేయించుకునే ఆలోచనలు తమకు ఉండవని.. చంద్రబాబు 14 ఏళ్లు సీఎంగా ఉండి రాష్ట్రాన్ని నాశనం చేశారని సజ్జల మండిపడ్డారు
‘‘2014-19 మధ్య చంద్రబాబు తన విశ్వరూపం చూపించారు. చంద్రబాబువి సభ్యసమాజంలో ఉండగలిగే వ్యక్తి మాటలులాగా లేవు. రాళ్ల దాడి చేయమని గతంలో చంద్రబాబు అన్నాడు.. అన్నట్టుగానే రాళ్లతో దాడి చేయించాడు. మేనిఫెస్టో అంటే విశ్వసనీయత ఉండాలి. మీ కుటుంబంలో మంచి జరిగితేనే ఓటు వేయమని జగన్ అంటున్నారు. ఎంతో ఆత్మవిశ్వాసం ఉంటేనే అలా అడగగలరు. అలా చంద్రబాబు ఎందుకు ఓటు అడగలేకపోతున్నారు. సంక్షేమ పథకాలతో లక్షలాది కుటుంబాల్లో మేలు జరిగింది. ఈ పథకాలతో రాష్ట్రాన్ని శ్రీలంక చేస్తారా? అని ప్రశ్నించిన చంద్రబాబు ఇప్పుడు అంతకంటే ఎక్కువ పథకాలు తెస్తానని ఎలా చెప్తున్నారు’’ అంటూ సజ్జల ప్రశ్నించారు.
‘‘అమలు చేసే వారెవరూ అడ్డగోలు హామీలు ఇవ్వరు. ప్రజలకు సేవ చేయాలన్న సంకల్పం ఉన్న వారే చేయగలిగిన హామీలు ఇస్తారు. చంద్రబాబు వలన వాలంటీర్ల వ్యవస్థ ఆగిపోయింది. పెన్షన్ల పంపిణీకి ఆటంకం కలిగించారు. ఇప్పుడు మళ్లీ ఇంటింటికీ ఉద్యోగులను పంపించి పెన్షన్లు ఇవ్వమంటున్నారు. పేదలంతా తమ కాళ్ల మీద తాము నిలపడేలా చూడాలన్నది జగన్ ఇద్దేశం. 70 వేల కోట్లతో జగన్ తన సంక్షేమాన్ని అమలు చేస్తుంటే చంద్రబాబు మాత్రం ఏకంగా లక్షన్నర కోట్లు చేస్తానంటూ మాట్లాడుతున్నారు. రాష్ట్ర బడ్జెట్‌తో సంబంధం లేకుండా చంద్రబాబు అబద్ధాల హామీలు ఇస్తున్నారు’’ అని సజ్జల మండిపడ్డారు.
‘‘ఒక బాధ్యత కలిగిన నాయకుడిగా జగన్ మేనిఫెస్టో ప్రకటించారు. చంద్రబాబు లాగా ఇష్టం వచ్చినట్లు హామీలు ఇవ్వమని కొంతమంది మాతో కూడా అన్నారు.కానీ జగన్ ఎప్పుడూ చేయలేని పని చెప్పరు. ఇచ్చిన హామీ నుంచి వెనక్కి పోరు. ఎగ్గొట్టాలనుకునే చంద్రబాబు అడ్డమైన హామీలు ఇస్తున్నారు. చంద్రబాబు మళ్లీ అధికారంలోకి వస్తే ఉన్న వ్యవస్థలన్నీ నాశనం అవుతాయి. జన్మభూమి కమిటీలు మళ్లీ వస్తాయి. చంద్రబాబుకు ఎవరైనా ఓటేస్తే తమ ఓటును తాము వృథా చేసుకున్నట్టే. చంద్రబాబు తన పాలనలో ఏం చేశారో ఇప్పటికీ ఎందుకు చెప్పలేకపోతున్నారు?’’ అంటూ సజ్జల నిలదీశారు.
‘‘జగన్ పాలనలో ఏం జరిగిందో ఎవరైనా చెప్పగలరు. కుప్పంతో సహా ఎక్కడైనా చెక్ చేసేందుకు సిద్దమే. చంద్రబాబుకు ధైర్యం ఉంటే ఇరవై ఇళ్లకు వెళ్లి అడిగే ధైర్యం ఉందా?. పోలవరం పాపం చంద్రబాబుదే. లోకేష్ ఎక్కడ ఉన్నాడో ఎవరికీ తెలియదు. ఎందుకు ప్రజలకు కనపడటం లేదు?. పవన్ కళ్యాణ్ చంద్రబాబు దత్తపుత్రుడు. చంద్రబాబు మాటలే పవన్ కూడా మాట్లాడతారు. సెక్రటేరియట్ ని కూడా తాకట్టు పెట్టామని కూడా పవన్ అన్నారు. రాజధానిలోని పొలాలను తాకట్టు పెట్టిందే చంద్రబాబు’’ అంటూ సజ్జల దుయ్యబట్టారు.