రాజ్యసభకు ఆ ముగ్గురూ ఏకగ్రీవం

Returning Officer Announces Unanimous On Rajya Sabha Elections Of Telangana - Sakshi

రేణుకా చౌదరి, అనిల్‌ యాదవ్, వద్దిరాజు ఎన్నిక

కాంగ్రెస్‌ నుంచి ఇద్దరు, బీఆర్‌ఎస్‌ నుంచి ఒక్కరు

రిటర్నింగ్‌ అధికారి నుంచి ధ్రువీకరణ పత్రాలు తీసుకున్న అనిల్, వద్దిరాజు

నేడు తీసుకుంటానని సమాచారమిచ్చిన రేణుకాచౌదరి 

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ కోటాలో మూడు రాజ్యసభ స్థానాలకు జరిగిన ద్వైవార్షిక ఎన్నికలో కాంగ్రెస్‌ నుంచి ఇద్దరు, బీఆర్‌ఎస్‌ నుంచి ఒక్కరు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు రిటర్నింగ్‌ అధికారి ప్రక టించారు. రాజ్యసభకు ఏకగ్రీవంగా ఎన్నికైన వారి లో కాంగ్రెస్‌ నుంచి మాజీ కేంద్ర మంత్రి రేణుకా చౌదరి, యూత్‌ కాంగ్రెస్‌ నాయకుడు అనిల్‌ కుమార్‌ యాదవ్, బీఆర్‌ఎస్‌ నుంచి సిట్టింగ్‌ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర ఉన్నారు. అనిల్‌ కుమార్‌ యాదవ్, వద్ది రాజు రవిచంద్ర మంగళవారం రిటర్నింగ్‌ అధికారి ఉపేందర్‌రెడ్డి చేతుల మీదుగా ఎన్నిక ధ్రువీకరణ పత్రాలు అందుకున్నారు. బుధవారం ధ్రువీకరణ పత్రం తీసుకుంటానని రేణుకా చౌదరి రిటర్నింగ్‌ అధికారికి సమాచారం ఇచ్చారు.

భారీ ప్రదర్శనగా వచ్చిన అనిల్‌
యువజన కాంగ్రెస్‌ జాతీయ కార్యదర్శి, సికింద్రాబాద్‌ డీసీసీ అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్న అనిల్‌ కుమార్‌ యాదవ్‌ ధ్రువీకరణ పత్రాన్ని అందుకునేందుకు పార్టీ కార్యకర్తలతో భారీ ప్రదర్శనగా అసెంబ్లీకి చేరుకున్నారు. అనిల్‌ వెంట ఆయన తండ్రి, మాజీ ఎంపీ అంజన్‌ కుమార్‌ యాదవ్, ప్రభుత్వ విప్‌ బీర్ల అయిలయ్య తదితరులున్నారు. అనిల్‌కుమార్‌ యాదవ్‌ను అసెంబ్లీ కార్యదర్శి నరసింహాచార్యులుతో పాటు పలువురు అభినందించారు. ఈ సందర్భంగా అనిల్‌ మీడియాతో మాట్లాడుతూ.. తాను రాజ్యసభకు వెళ్లే అవకాశం దక్కడం తన విజయం కాదని, తెలంగాణ యువజన కాంగ్రెస్‌ విజయమని వ్యాఖ్యానించారు. ఒక బీసీ బిడ్డను పెద్దల సభకు పంపి కాంగ్రెస్‌ అధిష్టానం బీసీలందరికీ తగిన గౌరవం ఇచ్చిందని చెప్పారు.

కేసీఆర్‌కు రుణపడి ఉంటానన్న వద్దిరాజు
రాజ్యసభకు 2022లో జరిగిన ఉప ఎన్నికలో  బీఆర్‌ఎస్‌ తరపున తొలిసారిగా ఎన్నికైన వద్దిరాజు రవిచంద్ర మరోమారు రాజ్యసభలో అడుగు పెడుతున్నారు. రెండోమారు రాజ్యసభకు ఎన్నికైన ఆయన  రిటర్నింగ్‌ అధికారి చేతుల మీదుగా ఎన్నిక ధ్రువీకరణ పత్రం అందుకున్నారు. ఆయన వెంట ఎమ్మెల్సీ శేరి సుభాష్‌రెడ్డి, పార్టీ ప్రధాన కార్యదర్శి భరత్‌కుమార్‌ గుప్తాతో పాటు పార్టీ నాయకులు ఉన్నారు. తనను రెండోసారి రాజ్యసభకు పంపిన పార్టీ అధినేత కేసీఆర్‌కు జీవితాంతం రుణపడి ఉంటానని, తెలంగాణకు రావాల్సిన విభజన హామీలపై పార్లమెంటులో గొంతెత్తుతానని వద్దిరాజు ప్రకటించారు.

ఖమ్మం జిల్లాలో బీఆర్‌ఎస్‌ బలోపేతానికి కృషి చేయడంతో పాటు కేసీఆర్‌ మరోమారు ముఖ్యమంత్రి అయ్యేందుకు శక్తివంచన లేకుండా పనిచేస్తానన్నారు. కాగా, ఈ నెల 8న రాష్ట్రం కోటాలో మూడు రాజ్యసభ స్థానాలకు నోటిఫికేషన్‌ విడుదల కాగా 15 వరకు నామినేషన్లు స్వీకరించారు. అసెంబ్లీలో ఎమ్మెల్యేల సంఖ్యాబలం ఆధారంగా కాంగ్రెస్‌కు రెండు, బీఆర్‌ఎస్‌ ఒక స్థానం దక్కాయి. మూడు స్థానాలకు ముగ్గురు మాత్రమే నామినేషన్లు దాఖలు చేయడం..  పరిశీలన, విత్‌డ్రా గడువు ముగియడంతో వారు  ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు మంగళవారం రిటర్నింగ్‌ అధికారి ప్రకటించారు.

whatsapp channel

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram


 

Read also in:
Back to Top