
జైపూర్: రాజస్థాన్‌లో విద్యార్థి సంఘాల ఎన్నికలను నిర్వహించాలంటూ కాంగ్రెస్ అనుబంధ ఎన్‌ఎస్‌యూఐ కార్యకర్తలు, ఆ పార్టీ నేతలు చేపట్టిన ఆందోళన ఉద్రిక్తతకు దారి తీసింది. జైపూర్‌లోని షహీద్ స్మారక్ వద్ద జరిగిన నిరసన కార్యక్రమంలో కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి సచిన్ పైలట్ కూడా పాల్గొన్నారు. వీరిని చెదరగొట్టేందుకు పోలీసులు వాటర్ కెనన్లను ప్రయోగించారు.
బారికేడ్లను దాటి సివిల్ లైన్స్ ప్రాంతంలో ఉన్న సీఎం నివాసానికి వెళ్లేందుకు ప్రయత్నించిన ఆందోళన కారులను పోలీసులు అడ్డుకున్నారు. వారిపైకి వాటర్ కెనన్లను ప్రయోగించారు. ఈ సందర్భంగా ఇరువర్గాల మధ్య తోపులాట చోటుచేసుకుంది. కాంగ్రెస్ ఎమ్మెల్యే ముకేశ్ భాకర్, ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర అధ్యక్షుడు వినోద్ జాకడ్ సహా 30 నాయకులు, కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కార్యక్రమంలో అంతకుముందు పైలట్ మాట్లాడారు.
Took part in the protest organised by the Rajasthan unit of the NSUI, along with @varunchoudhary2 and @VinodJakharIN - against the state’s BJP government
NSUI’s long standing demand is that the student body elections be held in across universities and colleges in Rajasthan.… pic.twitter.com/FiEoCwdyLP— Sachin Pilot (@SachinPilot) August 5, 2025
ఈ సందర్బంగా సచిన్ పైలట్.. ‘ఢిల్లీలోని ప్రభుత్వాన్ని ఆదర్శంగా తీసుకుని రాష్ట్రంలోని బీజేపీ ప్రభుత్వం నియంతృత్వంతో వ్యవహరిస్తోందని నిప్పులు చెరిగారు. నిలిపివేసిన విద్యార్థి సంఘాల ఎన్నికలను తిరిగి నిర్వహించాలని డిమాండ్ చేశారు. పార్లమెంట్‌లో ప్రతిపక్ష నేతలను మాట్లాడకుండా చేసినట్లే ఇక్కడి రాష్ట్ర ప్రభుత్వం కూడా వ్యవహరిస్తోందని విమర్శించారు. రాజకీయాలు విద్యార్థి దశ నుంచే ప్రారంభం కావాలని, గెలుపోటములు కాకుండా ఎన్నికల ప్రక్రియను చేపట్టడమే ముఖ్యమైన అంశమన్నారు. ప్రజల్లో విశ్వసనీయత కోల్పోయిన రాష్ట్రంలోని బీజేపీ ప్రభుత్వం పంచాయతీ, మున్సిపల్ ఎన్నికలను సైతం జరిపేందుకు భయపడుతోందని పైలట్ ఆరోపించారు.