చిన్న పరిశ్రమలపై కుట్ర.. భారత్‌ జోడో యాత్రలో రాహుల్‌ గాంధీ

Rahul attacks BJP govt, says demonetisation, GST aimed to destroy - Sakshi

అందుకే నోట్ల రద్దు, జీఎస్టీ

బడా పారిశ్రామికవేత్తల కోసమే

మోదీ సర్కార్‌పై రాహుల్‌ విమర్శలు

కొచ్చి: తమకు ఆప్తులైన బడా పారిశ్రామిక వేత్తలు, వ్యాపారులకు మేలు చేసేందుకే మోదీ సర్కార్‌ నోట్ల రద్దు, జీఎస్‌టీలను అమలుచేసిందని కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ తీవ్ర ఆరోపణలు చేశారు. కేరళలో బుధవారం భారత్‌ జోడో యాత్ర సందర్భంగా కొచ్చిలో సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు చెందిన ప్రతినిధులు రాహుల్‌ గాంధీని కలిశారు. ఈ సందర్భంగా వారినుద్దేశించి రాహుల్‌ ప్రసంగించారు.

‘చిరు వ్యాపారుల పొట్ట కొట్టడమే మోదీ సర్కార్‌ పని. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలను చిధ్రం చేసి కేవలం తమకు అత్యంత దగ్గరివారైన అతి కొద్దిమంది భారీ పారిశ్రామిక వేత్తలకు లాభం వచ్చేలా ప్రభుత్వం పథకరచన చేసింది. ఈ కుట్రలో భాగంగానే మోదీ సర్కార్‌ పెద్ద నోట్లను రద్దు చేసింది. వస్తుసేవల పన్ను(జీఎస్‌టీ)ని అమల్లోకి తెచ్చింది. నోట్ల రద్దు, జీఎస్‌టీ ధాటికి అసంఘటిత రంగం అతలాకుతలమైంది. మోదీ మిత్రులకు కావాల్సింది ఇదే’ అని రాహుల్‌ గాంధీ వ్యాఖ్యానించారు. చిన్న సంస్థలకు అనుమతుల మంజూరులో జాప్యం చేస్తూ పెద్ద తలకాయలకు లబ్ధిచేకూరుస్తున్నారని ఆరోపించారు.

కేరళలో సుగంధ ద్రవ్యాలు, రబ్బర్‌ తోటల రైతుల సమస్యలు, పర్యావరణపరంగా సున్నితమైన ప్రాంతాల పరిరక్షణ బాధ్యతలను రాష్ట్ర సర్కార్‌ విస్మరించడం వంటి సమస్యలను రాష్ట్ర కాంగ్రెస్‌ బృందం రాహుల్‌ను వివరించింది. ఈ అంశాలను పార్లమెంట్‌లో లేవనెత్తుతానని రాహుల్‌ వారికి హామీ ఇచ్చారు. మరోవైపు రాహుల్‌.. సంఘ సంస్కర్త శ్రీ నారాయణ గురుకు నివాళులర్పించి కొచ్చి సమీపంలోని మాదవనలో బుధవారం భారత్‌ జోడో యాత్రను కొనసాగించారు. రాహుల్‌తోపాటు రాజస్తాన్‌ కాంగ్రెస్‌ నేత సచిన్‌ పైలట్‌ పాల్గొన్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top