ఏనుగెక్కి ప్రగతి భవన్‌ పోవాలె..

Praveen Kumar Comments At Nalgonda BSP Meeting - Sakshi

బహుజన రాజ్యం ఎంతో దూరంలో లేదు: ప్రవీణ్‌ కుమార్‌

ఎర్రకోటపై ‘నీలి’ జెండా ఎగురవేయాలని పిలుపు

నల్లగొండలో జరిగిన రాజ్యాధికార సంకల్ప సభలో బీఎస్పీలో చేరిక

సాక్షి ప్రతినిధి, నల్లగొండ:  ‘మనం ఏనుగు ఎక్కి ప్రగతి భవన్‌కు పోవాలి. ఎర్రకోటపై మన నీలి జెండా (బీఎస్పీ జెండా)ను ఎగురవేయాలి’ అని మాజీ ఐపీఎస్‌ అధికారి, బీఎస్పీ రాష్ట్ర కో–ఆర్డినేటర్‌ ఆర్‌.ఎస్‌.ప్రవీణ్‌ కుమార్‌ పిలుపునిచ్చారు. బహుజనులకు రాజ్యాధికారం ఎంతో దూరంలో లేదని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ దళితబంధు పథకానికి ఖర్చు చేయనున్న రూ. 1,000 కోట్లు ఎవరి పైసలని ప్రశ్నించారు. దళితులపై సీఎంకు నిజమైన ప్రేమే ఉంటే ఆయన సొంత ఆస్తులు అమ్మి ఖర్చు పెట్టాలని డిమాండ్‌ చేశారు. ఆదివారం నల్లగొండలోని ఎన్‌.జి. కాలేజీ మైదానంలో నిర్వహించిన రాజ్యాధికార సంకల్ప సభలో బీఎస్పీ నేషనల్‌ కోఆర్డినేటర్‌ రామ్‌జీ గౌతమ్‌ సమక్షంలో ప్రవీణ్‌కుమార్‌ బహుజన సమాజ్‌ పార్టీ (బీఎస్పీ)లో చేరారు. ఆయనకు రాంజీ గౌతమ్‌ బీఎస్పీ కండువా కప్పి పార్టీ సభ్యత్వం అందించారు. అలాగే ఆయన్ను బీఎస్పీ రాష్ట్ర కో–ఆర్డినేటర్‌గా ప్రకటించారు. సభకు తరలివచ్చిన అశేష జనవాహినిని ఉద్దేశించి ఈ సందర్భంగా ప్రవీణ్‌కుమార్‌ సుదీర్ఘంగా ప్రసంగించారు. తన రాజకీయ ప్రాధాన్యతలు, ఆకాంక్షలను వివరిస్తూనే రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే... 
ఆదివారం నల్లగొండలో జరిగిన రాజ్యాధికార సంకల్ప సభకు హాజరైన అశేష జనవాహిని 

మీ కోసమే రాజకీయాల్లోకి వచ్చా... 
‘ఈ సభను చూస్తుంటే దొరల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. మీ ఉత్సాహం చూస్తుంటే ప్రగతి భవన్‌ చాలా దగ్గరలో ఉన్నట్లుగా కనిపిస్తోంది. బహుజనులు బానిసలు కాదు.. పాలకులుగా మార్చాలన్న బాధ్యతను నాపై పెట్టారు. మీ అందరి కోసమే ఆరున్నర ఏళ్ల సర్వీసు ఉన్నా రాజీనామా చేసి వచ్చా. లక్షల మంది బహుజనుల బతుకులు మార్చాలంటే త్యాగం చేయాల్సిన అవసరం ఉందని అమ్మకు చెప్పా. రెక్కాడితే కానీ డొక్కాడని, ఆకలైతే అన్నం దొరకని కుటుంబాలు ఉన్నాయి. వారందరికీ న్యాయం చేయాలి.. వారి గొంతుకను కావాలని చెప్పి వచ్చా. కొట్లాడి, 1,300 మంది ప్రాణత్యాగం చేసి తెచ్చుకున్న తెలంగాణ అమరవీరుల స్థూపం వద్ద పాదాభివందనం చేశా. మేం కష్టపడి త్యాగాలు చేస్తే అధికారం మరొకరు చెలాయిస్తున్నారు. పంతం నెగ్గే వరకు వదలొద్దని అమరులు నాకు చెప్పి పంపించారు. 
 

గొప్పగా బహుజన రాజ్యం... 
జనాభా ప్రాతిపదికన అధికారంలో వాటా ఇవ్వాలి. ఇవ్వకపోతే గుంజుకుంటాం. మీరు గ్రామాలకు వెళ్లి మన బహుజన రాజ్యం ఎంత గొప్పగా ఉండబోతోందో మన వారికి చెప్పండి. బహుజన రాజ్యంలో అన్ని కులాల వారికీ సమాన అధికారం ఉంటుంది. లక్షల మంది అమెరికాకు వెళతారు. ప్రతి మండలంలో ఒక ఇంటర్నేషనల్‌ స్కూల్‌ ఉంటుంది. కల్లుగీత కార్మికుల బిడ్డలు కంప్యూటర్‌ ఇంజనీర్లుగా ఉంటారు. మైనారిటీలు మిలియనీర్లు అవుతారు. మాల మాదిగలు డాలర్లు సంపాదిస్తారు. బంజారా బిడ్డలు బంగళాలు కొంటరు. గిరిజన బిడ్డలు విదేశాలకు వెళతారు. రాళ్లు గొట్టిన వారు రాకెట్‌ ప్రయోగిస్తారు. చిందు కళాకారుల బిడ్డలు సినిమా రంగంలోకి వెళ్తారు. మన పిల్లలు కంపెనీలు పెట్టి సంపదను సృష్టించి, ఉద్యోగాలు ఇచ్చేలా చేస్తాం. ప్రైవేటు రంగంలో కూడా రిజర్వేషన్లు రావాలి. అవి సాధించే వరకు నిద్రపోను. బహుజన రాజ్యం మీరంతా తలచుకుంటే వస్తుంది. తరతరాలుగా మనల్ని దోపిడీ చేసి సంపాదించిన ఆధిపత్య కులాల వారు రకరకాల పథకాలు, కుట్రల ద్వారా ఆ సొమ్మును మనపై చల్లుతారు. ఓటును అమ్ముకోవద్దు. నల్లగొండ సభ రాష్ట్ర రాజకీయాలనే కాదు దేశ రాజకీయాలను మార్పు చేసే అవకాశం ఉంది.

మీ ఆస్తులమ్మి ‘దళితబంధు’ ఇవ్వండి
సీఎం కేసీఆర్‌ ‘దళితబంధు’కు రూ. 1,000 కోట్లు ఖర్చు పెడుతున్నారు. అవి ఎవరి పైసలు? బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలు కష్టపడిన సొమ్ము కాదా? వాటిని మీరు విచ్చలవిడిగా ఖర్చు పెడుతున్నారు. మాపై నిజమైన ప్రేమే ఉంటే మీ ఆస్తులు అమ్మి మాకు పెట్టండి. మా భవిష్యత్‌ మేమే నిర్ణయించుకునేలా చేయండి. 1,000 గురుకులాలు పెడితే మారిపోతుందా? అందులో చదివేది 4 లక్షల మందే.  ఈ కొద్దిమంది చదివితే బంగారు తెలంగాణ అన్నట్టా? రాష్ట్రంలో వేల సంఖ్యలో పాఠశాలల ఉన్నాయి. సీఎం ఎన్నిసార్లు రివ్యూ చేశారు. వారికి ఏం ఒరిగింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ పిల్లలు 61.70 లక్షల మంది స్కూళ్లలో చదువుకుంటున్నారు. వాటిల్లోకి సీఎం ఎందుకు పోవడం లేదు? ప్రభుత్వ స్కూళ్లు, కాలేజీలు, యూనివర్సిటీల్లో వసతుల్లేవు. నియామకాలు లేవు. బడ్జెట్‌ ప్రకటనే కానీ నిధుల విడుదల ఏదీ? పేదల బిడ్డలు చదివే విశ్వవిద్యాలయాలను పట్టించుకోకుండా ప్రైవేటు యూనివర్సిటీలు ఇచ్చారు. మాటల గారడీతో ప్రజలు ఏడున్నర ఏళ్లుగా మోసపోతున్నారు. ఇలాంటి వాటికి చరమగీతం పాడే రోజులు దగ్గర పడ్డాయి. అది నల్లగొండ నుంచే మొదలైంది.  

మీరే అపరజ్ఞానులా? 
సంపద 5 శాతం మంది చేతిలో ఉంటే 95 శాతం మంది పేదలే. 46 మందికి భారతరత్న వస్తే ఒక్కరే ఓబీసీ ఉన్నారు. దళితులు, బహుజనులు లేరు. 52 శాతం మంది ఓబీసీల్లో అర్హులే లేరా. మాకు చేతగాదా.. మీరే అపరజ్ఞానులా. 60 వేల బుక్కులు చదివారా? 11 మంది సీఎంలు అయ్యారు. అందులో పది మంది ఆధిపత్య కులాల వారే. నేను ఏ కులానికి వ్యతిరేకం కాదు.   

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top