బిహార్ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ నేత రాహుల్
బెగూసరాయి/ఖగారియా: ప్రధానమంత్రి నరేంద్రమోదీ అదానీ, అంబానీ చేతుల్లో కీలుబొమ్మగా మారారని కాంగ్రెస్ నేత, లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్‌గాంధీ విమర్శించారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఫోన్ చేయగానే భయపడి పాకిస్తాన్‌తో యుద్ధాన్ని విరమించారని ఎద్దేవా చేశారు. బిహార్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం ఆయన బెగూసరాయి, ఖగారియా జిల్లాల్లో నిర్వహించిన ఎన్నికల సభల్లో ప్రసంగించారు.
‘పెద్ద ఛాతీ ఉండగానే శక్తిమంతులు అయిపోరు. మహాత్మాగాందీని చూడండి. చూడటానికి పీలగా ఉండే ఆయన నాడు ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన బ్రిటిష్‌వారిని ఎదిరించి పోరాడారు. కానీ, 56 ఇంచుల ఛాతీ అని గొప్పలు చెప్పుకుంటున్న నరేంద్రమోదీ.. ఆపరేషన్ సిందూర్ సమయంలో ట్రంప్ ఫోన్ చేయగానే వణికిపోయారు. పాకిస్తాన్‌పై చేపట్టిన సైనిక చర్యను రెండు రోజుల్లోనే విరమించారు. ట్రంప్‌ను చూసి భయపడటమే కాదు.. ఆయన అదానీ, అంబానీ చేతుల్లో కీలుబొమ్మగా కూడా మారిపోయారు. ట్రంప్ చెప్పగానే మోదీ ఆపరేషన్ సిందూర్‌ను
నిలిపేశారు’అని విమర్శించారు.
డ్యాన్స్ చేయమన్నా చేస్తారు..
ప్రధాని మోదీ తీసుకునే నిర్ణయాలన్నీ దేశంలోని పెద్ద వ్యాపారస్తుల ప్రయోజనాల కోసమేనని రాహుల్‌గాంధీ విమర్శించారు. మోదీ ఏది చేసినా ఓట్ల కోసమే చేస్తారు. ఓట్లకోసం వేదికలపై డ్యాన్సులు కూడా చేస్తారు. ఎన్నికలు ముగిసిన తర్వాత కార్పొరేట్ల కోసం మాత్రమే పనిచేస్తారు. బీజేపీ మీకు తక్కువ ధరకు ఇంటర్నెట్ ఇస్తుంది. దానితో మీరు రీల్స్ చూస్తారు.. చేస్తారని అన్నారు.
చేపలు పట్టిన రాహుల్‌గాంధీ
బిహార్ ఎన్నికల ప్రచారంలో రాహుల్‌గాంధీ కొద్దిసేపు చెరువులో చేపలు పట్టారు. బెగూసరాయి జిల్లాలో ఆదివారం ఆయన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. కొద్దిదూరంలోని చెరువులో జాలర్లు చేపలు పట్టడాన్ని గమనించి వికాస్ శీల్ ఇన్‌సాన్ పార్టీ నేత, మాజీ మంత్రి ముఖేశ్ సాహ్నితో కలిసి ఆయన చిన్న పడవలో చెరువులోకి వెళ్లారు. జాలర్లతో మాట్లాడుతూనే.. పడవలో నుంచి ఛాతీవరకు నీళ్లున్న చెరువులోకి ఒక్కసారిగా దూకేశారు. ఇద్దరు నేతలు జాలర్లతో కలిసి కొద్దిసేపు చేపలు పట్టారు. రాహుల్ చేపలు పడుతున్న వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది.


