జన సైనికుల ముసుగులో రౌడీలు.. ఆ దాడి హేయం: పేర్ని నాని | Perni Nani Condemns Jana Sena Activists Attack On RMP Doctor Giridhar In Machilipatnam | Sakshi
Sakshi News home page

జన సైనికుల ముసుగులో రౌడీలు.. పోలీసులు కంట్రోల్‌ చేయాల్సిందే: పేర్ని నాని

Sep 12 2025 9:03 AM | Updated on Sep 12 2025 9:15 AM

Perni Nani Condemns Jana Sena Workers Attack RMP Doctor Incident

సాక్షి, కృష్ణా: పవన్‌ కల్యాణ్‌పై కామెంట్‌ చేశాడని ఓ ఆర్‌ఎంపీ వైద్యుడిపై జన సైనికులు(Jana Sainiks) దాడి చేయడం దారుణమని మాజీమంత్రి పేర్ని నాని అన్నారు. పోలీసులు వాళ్లను గనుక అదుపు చేయకపోతే భవిష్యత్తులో మరింత ప్రమాదకరంగా మారతారని ఆందోళన వ్యక్తం చేశారాయన.

‘‘ఆర్ఎంపీ వైద్యుడు నాలుగు రోజుల క్రితం ఓ యూట్యూబ్ ఛానల్ లో పవన్ కళ్యాణ్ పై కామెంట్ చేశారు. విలేఖరి అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు..చేసిన వ్యాఖ్యలపై స్పందించారు. ఆ మాత్రం దానికే జనసేన ముసుగులో రౌడీయిజం చేస్తున్నారు

వందమందికి పైగా జనసేన గూండాలు(Jana Sena Goons) గిరిధర్ పై దాడి చేశారు. గిరిధర్ ఇంటిపై బీభత్సం సృష్టించారు. రజకుడనే చిన్న చూపుతో గిరిధర్ పై దాడి చేశారు. మరి పవన్‌ను మిగిలిన కులాలకు చెందిన వాళ్లు కూడా ప్రశ్నిస్తున్నారు కదా?.. వాళ్ల మీద మీ ప్రతాపం ఎందుకు చూపించలేకపోతున్నారు??. దాడి చేయడానికి బలహీనులే మీకు కనిపిస్తారా???

జనసేన ముసుగు ఉన్న గూండాలను కంట్రోల్ చేయాలని పోలీసులను, జిల్లా ఎస్పీని కోరుతున్నాం. ఈ రౌడీలను కంట్రోల్ చేయకపోతే భవిష్యత్తులో మరింత ప్రమాదకరంగా మారతారు. ఇప్పటికే నమస్కారం పెట్టలేదని పోలీసులను కొట్టే స్థితికి వచ్చారు. జగన్ మోహన్ రెడ్డిని,నన్ను,నా కుమారుడ్ని నోటికొచ్చినట్లు తిడతారు. పవనను ప్రశ్నిస్తే మాట్లాడితే దాడులు చేస్తారు. గిరిధర్,సతీష్ ల పై దాడి చేసిన వారి పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం అని పేర్ని నాని అన్నారు.

మచిలీపట్నం మండలం సత్రంపాలేనికి చెందిన ఆర్‌ఎంపీ వైద్యుడు గిరిధర్‌(RMP Giridhar Attack) మంగళవారం ఒక యూట్యూబ్‌ ఛానల్‌లో మాట్లాడుతూ.. ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ని నిలదీశారు. ఈ క్రమంలో.. ఆయన్ని అరెస్ట్‌ చేయాలంటూ జన సైనికులు ఆయన ఇంటి ముందు గురువారం రాత్రి ధర్నాకు దిగారు. అటుపై ఆయనపై దాడి చేసి బలవంతంగా ఆయనతో క్షమాపణలు చెప్పించారు. ఈ వీడియో కూడా సామాజిక మాధ్యమాల్లో వైరలైంది. ఇది ఇక్కడితోనే ఆగలేదు..  

.. జనసేన పెద్దల ఒత్తిడితో గురువారం రాత్రి చిలకలపూడి పోలీసులు గిరిధర్‌ను పోలీస్‌ స్టేషన్‌కు తీసుకొచ్చారు. గిరిధర్‌కు మద్దతుగా పీఎస్‌కు వైఎస్సార్సీపీ నేతలు వచ్చారు. ఈ క్రమంలో జనసేన శ్రేణులు కవ్వింపునకు దిగబోయాయి. దీంతో పోలీసులు మోహరించి పరిస్థితిని అదుపులో ఉంచారు. ఈలోపు మాజీ మంత్రి పేర్ని నాని ఠాణా వద్దకు చేరుకుని విషయంపై ఆరా తీశారు. ఇరు పార్టీల వారు పరస్పరం ఫిర్యాదులు చేసుకున్నారు. 

ఇదీ చదవండి: మా పవనన్ననే నిలదీస్తావా?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement