గెలుపే మన లక్ష్యం.. గమ్యం 

Opposition Parties Should Be Afraid To Contest After This Election - Sakshi

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధిక మెజార్టీ సాధిద్దాం

పార్టీ కార్యాలయంలో శ్యాంప్రసాద్‌రెడ్డి పరిచయ కార్యక్రమం

జిల్లా కో–ఆర్డినేటర్‌ బాలినేని, ఎంపీలు, ఎమ్మెల్యేలు సమష్టి నిర్ణయం

నెల్లూరు(సెంట్రల్‌): రానున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి అత్యధిక మెజార్టీతో గెలుపే లక్ష్యంగా అందరం కలిసికట్టుగా పనిచేద్దామని పార్టీ జిల్లా కో ఆర్డినేటర్‌ బాలినేని శ్రీనివాసులురెడ్డి, ఎంపీలు, ఎమ్మెల్యేలు ముక్తకంఠంతో ప్రకటించారు. నెల్లూరులోని మాగుంట లే అవుట్‌లో ఉన్న వైఎస్సార్‌ సీపీ జిల్లా కార్యాలయంలో రాజ్యసభ సభ్యుడు, పార్టీ జిల్లా అధ్యక్షుడు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ అభ్యర్థి పేర్నాటి శ్యాంప్రసాద్‌రెడ్డి పరిచయ కార్యక్రమాన్ని ఆదివారం నిర్వహించారు.

మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి, ఎంపీలు ఆదాల ప్రభాకర్‌రెడ్డి, మద్దెల గురుమూర్తి, ఎమ్మెల్యేలు ఆనం రామనారాయణరెడ్డి, కిలివేటి సంజీవయ్య, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, మానుగుంట మహీధర్‌రెడ్డి, వెలగపల్లి వరప్రసాద్, మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి, మేకపాటి విక్రమ్‌రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్బంగా బాలినేని శ్రీనివాసులురెడ్డి, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, మంత్రి గోవర్ధన్‌రెడ్డి మాట్లాడుతూ వచ్చే నెల మొదటి నుంచి ఓటర్‌ జాబితాలో పేర్ల నమోదు ఉంటుందన్నారు. ప్రతి నియోజకవర్గంలో పట్టభద్రుల ఓటర్లను గుర్తించి నమోదు చేసే ప్రక్రియపై ప్రత్యేక చొరవ తీసుకోవాలన్నారు. పట్టభద్రులకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేసిన వాటిని కూడా గుర్తు చేయాలన్నారు. డిగ్రీ పూర్తి చేసిన ప్రతి ఒక్కరిని గుర్తించాలన్నారు. ప్రతి నియోజకవర్గంలో అధిక ఓట్లు ఉన్నాయని, పూర్తిగా వైఎస్సార్‌సీపీ వైపే పట్టభద్రులు ఉన్నారన్నారు.  

ప్రతిపక్షాలు భయపడాలి  
పట్టభద్రుల ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థికి వచ్చే మెజార్టీ చూసి ప్రతిపక్ష పార్టీలు రానున్న ఎన్నికల్లో పోటీ చేయడానికి కూడా భయపడే విధంగా తీర్పును తీసుకువద్దామన్నారు. ఓటరు లిస్టులో పేర్లు నమోదు అనేది అత్యంత ప్రతిష్టాత్మంగా జరగాలన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరిని గుర్తించి ఓటు నమోదు చేయించడంతో పాటు, ఓటు హక్కు వినియోగించుకునే విధంగా చూడాలన్నారు. పట్టభద్రుల ఓట్లు చాలా కీలకమన్నారు. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేస్తున్న అభివృద్ధి, సంక్షేమాన్ని వాళ్లు గమనిస్తున్నారని, వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై ప్రత్యేక ఆదరాభిమానాలు వాళ్లకు ఉన్నాయన్నారు. ప్రతి ఓటు ఎంతో కీలకంగా భావించి మెజార్టీ వచ్చే విధంగా చూడాలన్నారు. చాలా కాలం తర్వాత జిల్లాలో తిరిగి పట్టభద్రుల ఎన్నికల వాతావరణం వస్తోందని, ఈ విషయంపై ప్రతి ఒక్కరం దృష్టి సారించాల్సిన అవసరం ఉందన్నారు. గెలవడం ఖాయమని, మెజార్టీని చూసి ప్రతిపక్షాలు భయపడే విధంగా తీసుకుని వద్దామన్నారు. సమావేశంలో ఎమ్మెల్సీ బల్లి కల్యాణ్‌చక్రవర్తి, రాష్ట్ర కార్యదర్శి కోటంరెడ్డి గిరిధర్‌రెడ్డి, కొండ్రెడ్డి రంగారెడ్డి,  పి రూప్‌కుమార్, నిరంజన్‌బాబురెడ్డి, వీరి చలపతి తదితరులు పాల్గొన్నారు.   

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top