ప్రతిపక్షాలది ‘సెల్ఫ్‌ గోల్‌’ : ప్రధాని మోదీ

Nrendra Modi slams Opposition for stalling Parliament, terms it self-goal - Sakshi

స్వీయ ప్రయోజనాలే విపక్షాలకు ముఖ్యం

అందుకే పార్లమెంట్‌ కార్యకలాపాలను అడ్డుకుంటున్నాయి

విపక్షాల తీరును తీవ్రంగా ఎండగట్టిన ప్రధాని మోదీ

లక్నో: ప్రజాసంక్షేమమే పరమావధిగా కొనసాగే పార్లమెంట్‌ సభా కార్యక్రమాలను అడ్డుకుంటూ విపక్షాలు ‘సెల్ఫ్‌ గోల్‌’ చేసుకుంటున్నాయని ప్రధాని మోదీ విపక్షాల వైఖరిని తీవ్రంగా తప్పుబట్టారు. ‘ఒకవైపు, పలు రంగాల్లో విజయపరంపరలో ‘గోల్‌’ తర్వాత గోల్‌ కొడుతూ దేశం ముందుకు సాగుతుంటే, మరో పక్క స్వీయ ప్రయోజనాలు చూసుకుని విపక్షాలు ‘సెల్ఫ్‌ గోల్స్‌’ చేస్తున్నాయని మోదీ ఆరోపించారు. ప్రధానమంత్రి గరీభ్‌ కళ్యాణ్‌ అన్న యోజన దినోత్సవాన్ని ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం పాటిస్తున్న సందర్భంగా గురువారం కేంద్రప్రభుత్వ ఆహార భద్రతా పథకం లబ్దిదారులతో మోదీ వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు.

‘సరిగ్గా రెండేళ్ల క్రితం ఇదే రోజున జమ్మూకశ్మీర్‌ రాష్ట్ర ప్రత్యేక ప్రతిపత్తిని తొలగిస్తూ ఆర్టికల్‌ 370ని కేంద్రప్రభుత్వం రద్దు చేసింది. గత ఏడాది అయోధ్య రామమందిరం కోసం ‘భూమి పూజ’ కార్యక్రమాన్నీ ఘనంగా చేసుకున్నాం. ఈసారి ప్రఖ్యాత ఒలంపిక్స్‌లో భారత హాకీ జట్టు విజయకేతనం ఎగరేసింది. 50 కోట్ల కోవిడ్‌ వ్యాక్సినేషన్‌ పూర్తయింది. రికార్డుస్థాయిలో జీఎస్‌టీ వసూళ్లు, వ్యవసాయ ఉత్పత్తుల్లో గణనీయ పెరుగుదల, విక్రాంత్‌ యుద్ధవిమాన వాహక నౌక తయారీ.. ఇలా దేశం ఎంతగా పురోగతిని కోరుకుంటోంది.. ఎంతటి ఘన విజయాలను సాధిస్తోంది. ఎంతగా దేశం పురోగమిస్తుందనేవి ఏవీ విపక్షాలకు పట్టవు. స్వీయ ప్రయోజనాలే లక్ష్యంగా పెగసస్‌ అంశంపై పార్లమెంట్‌ కార్యకలాపాలను అడ్డుకుంటున్నాయి ’ అని మోదీ ఆగ్రహం వ్యక్తంచేశారు.

యూపీ సీఎంను ఉద్దేశిస్తూ.. ‘ ఆయన సీఎం యోగి మాత్రమే కాదు. కర్మయోగి’ అని కొనియాడారు. మానవాళికి సవాలుగా పరిణమించిన మహా విపత్తును ఎలా ఎదుర్కోవాలా అని ప్రతీ పౌరుడు శ్రమిస్తుంటే.. వీరు( విపక్ష సభ్యులు) జాతి ప్రయోజనాలకోసం చట్టాలు చేసే పార్లమెంట్‌ సభాకార్యక్రమాలను అడ్డుకుంటున్నారని మోదీ ఆగ్రహం వ్యక్తంచేశారు. ‘ వీరు దేశ ప్రగతిని ఆపే పనిలో ఉన్నారు. కానీ 130 కోట్ల భారతీయులు దేశం ముందుకు సాగడం కోసం పాటుపడుతున్నారు. భారత్‌ ముందడుగు వేస్తోంది(భారత్‌ చల్‌ పఢా హై)’ అని మోదీ వ్యాఖ్యానించారు. ‘‘ దేశ ప్రగతి పథం ఢిల్లీకి యూపీ మీదుగా వెళ్తోంది. యూపీని వాడుకుని కొన్ని ‘కుటుంబాలు’ మాత్రమే బాగుపడ్డాయి. ఆ కుటుంబాల వారు యూపీ అభివృద్ధికి చేసింది శూన్యం ’ అని మోదీ పరోక్ష వ్యాఖ్యలు చేశారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top