బీజేపీ పెద్దల కాళ్ల కోసం నారా లోకేష్ వెదుకులాట | Nara Lokesh Trials In Delhi To Release Chandrababu Naidu From Jail - Sakshi
Sakshi News home page

హస్తిన వీధుల్లో నారా లోకేష్.. కేసు నుండి బాబును బయట పడేందుకు వెంపర్లాట

Sep 26 2023 4:51 PM | Updated on Sep 26 2023 5:51 PM

Nara Lokesh Trials In Delhi To Release Chandrababu From Jail - Sakshi

న్యూఢిల్లీ: టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి  నారా లోకేష్ ఢిల్లీలోనే ఎందుకు పాతుకుపోయారు? బీజేపీ అగ్రనేతల కాళ్ళు పట్టుకుని తన తండ్రిని విడిపించుకోడానికి  లోకేష్ చేస్తోన్న ప్రయత్నాలు ఫలించడం లేదని ప్రచారం జరుగుతోంది. బీజేపీ నేతలు కనీసం అపాయింట్‌మెంట్ కూడా ఇవ్వకపోవడంతో లోకేష్ హస్తినలోనే ఒక స్టార్ హోటల్లో మకాం వేశారు. ఏపీ బీజేపీ అధ్యక్షురాలు నారా లోకేష్ పెద్దమ్మ దగ్గుబాటి పురందేశ్వరి ద్వారా బీజేపీ నేతలతో టచ్‌లోకి వెళ్లాలని చేస్తోన్న ప్రయత్నాలు కూడా ఫలించలేదు.

అరెస్టుతో షాక్.. 
371 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దోచుకున్న కేసులో మాజీ ముఖ్యమంత్రి టిడిపి జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేసి జైలుకు పంపిన సంగతి తెలిసిందే. అరెస్ట్ చేసిన సమయంలో తన తండ్రికి ఈజీగా బెయిల్ వస్తుందని అసలు జైలుకు వెళ్లరని భావించారు లోకేష్. కానీ లోకేష్ కళ్ళముందే చంద్రబాబు నాయుడు జైలుకెళ్లారు. చేసేదేమీ లేక కోట్లలో ఫీజులు తీసుకునే సిద్ధార్ధ లూథ్రా, హరీష్ సాల్వే వంటి దిగ్గజాలను చంద్రబాబు నాయుడి తరపున న్యాయవాదులుగా పెట్టుకున్నారు. అయినా కూడా ప్రయోజనం లేకపోవడం తండ్రీకొడుకులిద్దరూ షాక్ తిన్నారు.

ఢిల్లీ గల్లీల్లో.. 
చివరకు అరెస్టు తతంగమంతా ముగిశాక ములాఖత్‌లో తన తండ్రిని కలిశారు లోకేష్. అదే సమయంలో లోకేష్‌కు చంద్రబాబు కొన్ని విషయాలు చెప్పారు. అర్జంటుగా ఢిల్లీ వెళ్లి బీజేపీ పెద్దలను బతిమాలో బామాలో తనని జైలు నుంచి బయటపడేసే మార్గం చూడమని తనయుడికి చెప్పగా లోకేష్ ఆగమేఘాల మీద ఢిల్లీ వెళ్లారు. జాతీయ మీడియా ద్వారా ఏపీ ప్రభుత్వంపై బురద జల్లాలని ప్రయత్నించి విఫలమయ్యారు. ఆ తర్వాతి రోజునే లోకేష్  ఏపీ వస్తున్నారని పార్టీ వర్గాలు ప్రచారం కూడా చేశాయి.

అనేక ప్రశ్నలు.. 
ఈ లోగా ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు కేసు తెరమీదకు వచ్చింది. ఈ కేసులో లోకేష్‌ పేరును A14గా చేర్చింది సీఐడీ. దీంతో లోకేష్‌ మదిలో కొత్త సందేహాలు మొదలయ్యాయి. ఆంధ్రప్రదేశ్‌లో అడుగుపెడితే అరెస్ట్‌ చేస్తారా? ఒకవేళ అరెస్ట్‌ చేస్తే ఏ జైలుకు పంపే ఆస్కారం ఉంది?  ఏపీకి రాకుండా ఢిల్లీలోనే గడిపిస్తే వచ్చే నష్టమేంటి? ఏపీ పోలీసులు ఢిల్లీకి వచ్చి అరెస్ట్‌ చేసే అవకాశాలుంటాయా? నన్ను అరెస్ట్‌ చేస్తే రాజకీయ కక్ష అని ప్రచారం చేసుకోవచ్చా? చంద్రబాబునే పట్టించుకోవడం లేదు, రేపు నన్నెవరు పట్టించుకుంటారు? ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ వేస్తే లాభమా? నష్టమా? ఒక వేళ పిటిషన్‌ను కోర్టు కొట్టివేస్తే వెంటనే అరెస్ట్‌ చేస్తారా? నేరుగా ప్రజల్లోకి వెళ్తే అందరి మధ్య అరెస్ట్‌ చేసే అవకాశమేమైనా ఉందా? అసలు A14ని అరెస్ట్‌ చేయాలంటే ముందున్న 13 మంది తర్వాతేనా? లేక ఎప్పుడయినా అరెస్ట్ చేయవచ్చా? ఇటువంటి అనుమానాలతో టిడిపి ఎమ్మెల్యేలను, నేతలను లోకేష్‌ ప్రశ్నలతో వేధిస్తోన్నట్టు సమాచారం. పైగా తప్పుడు కేసులు తెలుగుదేశాన్ని ఏం చేయలేవంటూ ప్రకటనలు ఇవ్వాలని సూచిస్తున్నట్టు కూడా తెలుస్తోంది. 

పట్టించుకునే నాధుడేడి?
ఇక హస్తినలో బీజేపీ అగ్రనేత కేంద్ర హొంమంత్రి అమిత్ షా అపాయింట్‌మెంట్ కోసం లోకేష్ చేయని ప్రయత్నం లేదు. టిడిపి నేత నారా లోకేష్ పేరు చెబితేనే  బిజెపి అగ్రనేతలు అపాయింట్‌మెంట్ కూడా ఇవ్వడం లేదని స్వయంగా కమలనాథులే చెబుతున్నారు. ఒక్క సారి అమిత్ షా అపాయింట్‌మెంట్ ఇస్తే చాలు ఆయన కాళ్లు పట్టుకుని అయినా సరే తన తండ్రిని కాపాడుకోవాలని లోకేష్ కృతనిశ్చయంతో ఉన్నారని తెలుస్తోంది. ప్రస్తుతానికైతే అతి కష్టమ్మీద రాష్ట్రపతి అపాయింట్‌మెంట్‌ దక్కించుకుని మొత్తానికి ఏదో సాధించానన్నట్టుగా పార్టీ నేతలకు చెప్పుకుంటున్నారు లోకేష్‌.

అడుగుపెడితే అరెస్టేనా? 
ఇక లోకేష్‌ ఢిల్లీలో ఉండడానికి మరో కారణం కూడా ఉందంటున్నారు. ప్రస్తుతం స్కిల్ డెవలప్‌మెంట్ స్కాంలో చంద్రబాబు జైల్లో ఉన్నారు. అదే కేసులో నారా లోకేష్ కూడా నిందితుడని కేంద్ర దర్యాప్తు సంస్థలు చెబుతున్నాయి. షెల్ కంపెనీల ద్వారా పంపిన కోట్లాది రూపాయల లూటీ సొమ్ములో కొంత భాగం హవాలా ద్వారా లోకేష్‌ సన్నిహితుడైన కిలారు రాజేష్ ద్వారా తిరిగి లోకేష్‌కు అందాయని కీలక ఆధారాలను కూడా సేకరించింది ఈడీ. చంద్రబాబును కస్టడీలోకి తీసుకుని విచారిస్తోన్న సిఐడీ పోలీసులు చంద్రబాబు నుండి సేకరించే ఆధారాలతో పాటు ఈడీ ఇంతకు ముందే తమకు అప్పగించిన ఆధారాలతో సీఐడీ లోకేష్‌ను కూడా విచారించే అవకాశాలున్నాయని అందుకే లోకేష్ భయపడుతున్నట్లు తెలుస్తోంది.

ఇది కూడా చదవండి: పోలీసు కస్టడీ, బెయిల్‌ పిటిషన్లపై.. ఒకేరోజు విచారణ జరుపుతాం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement