40 నియోజకవర్గాల్లో కీలకం.. ముస్లింలు ఎటువైపు? 

Muslims are crucial in 40 constituencies - Sakshi

బీఆర్‌ఎస్‌ వెంట వరుసగా రెండు పర్యాయాలు 

అంతకుముందు కాంగ్రెస్‌ ఓటు బ్యాంకుగా..

అసెంబ్లీ ఎన్నికల్లో ముస్లిం మైనారిటీలు జై కొట్టెదేవరికి..? వరుసగా రెండు పర్యాయాలు బీఆర్‌ఎస్‌ వెంట నడిచినన ముస్లిం ఓటర్లు ఈసారి ఎటు వైపు మొగ్గుచూపుతారన్నది ఆసక్తికరంగా మారింది. ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినా.. ముస్లిం ఓట్ల ప్రస్తావన కచ్చితంగా ఉంటుంది. తెలంగాణలో కూడా ముస్లిం ఓట్లు కీలకం.  మెజారిటీ స్థానాల్లో గెలుపోటములపై ప్రభావితం కనబర్చే మైనారిటీ ఓటర్లపై ప్రధాన రాజకీయపక్షాలు దృష్టి సారించాయి.

అధికార బీఆర్‌ఎస్‌ ‘అభివృద్ధి, సంక్షేమ’ మంత్రంతో  మరోసారి అధికార పీఠం తమదేనని ధీమా వ్యక్తం చేస్తుండగా, బీఆర్‌ఎస్‌ పాలనపై ప్రజా వ్యతిరేకత నేపథ్యంలో ఈసారి అధికారం హస్తగతం ఖాయమన్న ధీమా కాంగ్రెస్‌లో వ్యక్తమవుతోంది. భారతీయ జనతాపార్టీ మాత్రం మైనారిటీ ఓట్లపై పెద్దగా ఆశలేనప్పటికీ కేంద్రంలోని సుస్థిర ప్రభుత్వం చూపి కొన్ని ఓట్లయినా రాబట్టుకోవాలని యత్నిస్తోంది. ఇలా ప్రధాన రాజకీయ పార్టీలు ముస్లిం ఓట్ల కోసం వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నాయి. 

ఈ నియోజకవర్గాల్లో కీలకం 
హైదరాబాద్‌ పాతబస్తీలోని ఏడు అసెంబ్లీ స్థానాలతోపాటు మరో 33 అసెంబ్లీ నియోజకవర్గాలలో ముస్లిం ఓటర్లు అభ్యర్థుల గెలుపోటములను నిర్ణయించే స్థాయిలో ఉన్నారు. హైదరాబాద్‌లో అత్యధికంగా సుమారు 43 శాతం వరకు,æ ఆదిలాబాద్, నిజామాబాద్, మహబూబ్‌నగర్‌లో 34 నుంచి 38 శాతం, కరీంనగర్, నల్లగొండ, ఖమ్మం, వరంగల్‌లో 20 నుంచి 28 శాతం వరకు ముస్లిం ఓటర్లు  ఉన్నారు. ఇక ప్రతి నియోజకవర్గంలోనూ కనీసం10 నుంచి 18 శాతం వరకు ముస్లిం ఓటర్లు ఉంటారు. 

బీఆర్‌ఎస్‌ అభివృద్ధి మంత్రం 
అధికార బీఆర్‌ఎస్‌ ముస్లిం ఓట్లపై గట్టిగానే ఆశలు పెట్టుకుంది. గత రెండు పర్యాయాలు కలిసివచ్చినట్టుగానే ఈసారి కూడా ముస్లిం ఓటర్లు తమవెంటే నని భావిస్తోంది. తొమిదిన్నర ఏళ్లలో మైనారిటీ అభివృద్ధి, సంక్షేమం కోసం రూ. 9,166 కోట్ల ఖర్చుచేసినట్లు పేర్కొంటోంది. 204 మైనారిటీ గురుకులాలు ఏర్పాటు చేసి అందులో 1.31 లక్షల విద్యార్థులకు ఉచిత విద్య, వసతి కల్పన చేపట్టడం తమకు కలిసి వచ్చే అంశంగా అంచనా వేస్తోంది.  

షాదీ ముబారక్‌ పథకం కింద 2.68 లక్షల మందికి ఆర్థిక చేయూత, విదేశీ విద్య తదితర పథకాలు కలిసి వస్తాయని భావిస్తోంది. వాస్తవానికి దశాబ్ద కాలంగా ముస్లిం ఓటర్లు బీఆర్‌ఎస్‌ వెంట నడుస్తున్నారనే చెప్పాలి. 2014లో తెలంగాణ సెంటిమెంట్, 12శాతం రిజర్వేష¯న్‌ హామీలతో బీఆర్‌ఎస్‌ వైపు మొగ్గు చూపిన ముస్లిం వర్గాలు 2018లో మైనారిటీ గురుకులాలు, షాదీ ముబారక్, శాంతి భద్రత తదితర అంశాల ప్రభావంతో బీఆర్‌ఎస్‌ వెంటే నడిచాయి. ముస్లింల ఓట్లు ఎక్కువగా ఉన్న నియోజకవర్గాల్లో అత్యధికం బీఆర్‌ఎస్‌ గెలుచుకోవడమే ఇందుకు బలం చేకూర్చుతోంది. 

సబ్‌ప్లాన్‌ డిక్లరేషన్‌తో  సహా కాంగ్రెస్‌ హామీల వెల్లువ 
ఈసారి ఎలాగైనా అధికారమే లక్ష్యంగా పావులు కదుపుతున్న కాంగ్రెస్‌ మైనారిటీ ఓటు బ్యాంక్‌పై ఆశలు పెంచుకుంది. ముస్లిం ఓటర్లు కలిసివస్తే అధికారం హస్తగతం కావడం సులువవుతుందన్న ఆకాంక్షతో వారి కోసం ప్రత్యేక మైనారిటీ సబ్‌  ప్లాన్స్  డిక్లరేషన్‌ ప్రకటించింది.

మైనారిటీ సంక్షేమ బడ్జెట్‌ను రూ.4,000 కోట్లకు పెంచుతామని హామీ ఇస్తోంది. నిరుద్యోగ మైనారిటీ యువత, మహిళలకు సబ్సిడీ రుణాలను అందిస్తామని, కులగణనతో న్యాయమైన రిజర్వేషన్లు కల్పిస్తామని, విద్యావంతులకు  ఆర్థిక చేయూతను అందిస్తామని,  మైనారిటీ సంస్థల్లో ఖాళీలను భర్తీ చేస్తామని వాగ్దానాలు గుప్పిస్తోంది. ఈ హామీలతో మైనారిటీ ఓటర్లు తమ వైపు మొగ్గుచూపుతారని కాంగ్రెస్‌ భావిస్తోంది. 

మజ్లిస్‌ మామ పల్లవి  
మజ్లిస్‌ పార్టీ తన మిత్రపక్షమైన అధికార బీఆర్‌ఎస్‌కు ముస్లిం ఓటర్ల మద్దతును కూడగట్టేందుకు రాష్ట్ర వ్యాప్తంగా ముస్లిం ప్రాంతాల్లో హలత్‌–ఏ–హజిరా పేరిట బహిరంగ సభలతో  నిర్వహిస్తోంది. కాంగ్రెస్‌వైపు ముస్లిం ఓటర్లు మొగ్గుచూపకుండా కట్టడి చేసేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తోంది.

బీజేపీతో సమానంగా కాంగ్రెస్‌ను పోల్చుతూ విమర్శనా్రస్తాలు సంధిస్తోంది.. బీఆర్‌ఎస్‌కు మద్దతు ఇవ్వాలని...సీఎం కేసీఆర్‌ను మామగా సంబోధిస్తూ  కొత్త పల్లవి అందుకుంది. స్వయంగా మజ్లిస్‌ అధినేత అసదుద్దీన్‌ ఒవైసీ సభల్లో విరివిగా పాల్గొని  ప్రసంగిస్తుండటం ప్రాధాన్యం సంతరించుకుంది. ఒవైసీ ప్రసంగాలు కొంత వరకు మైనారిటీ ఓటర్లపై ప్రభావం పడే అవకాశాలు లేకపోలేదు.  

-మహమ్మద్‌ హమీద్‌ ఖాన్‌

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top