- డీఎస్సీ అక్రమాలకు ఇసుక పేరుతో డైవర్షన్
- టీచర్ రిక్రూట్‌మెంట్ స్కాంలో మంత్రి లోకేష్ అడ్డంగా దొరికిపోయాడు
- దానికి సమాధానం చెప్పుకోలేక డైవర్షన్ పాలిటిక్స్
- మాజీ ఎంపీ మార్గాని భరత్
రాజమండ్రి: మంత్రి నారా లోకేష్ నేతృత్వంలో టీచర్ రిక్రూట్‌మెంట్ స్కాం జరిగినట్టు ఆధారాలతో సహా వెలుగులోకి రావడంతో దానికి సమాధానం చెప్పుకునే ధైర్యం లేక గత ప్రభుత్వంలో ఇసుక అక్రమాలు అంటూ మరో డైవర్షన్ పాలిటిక్స్‌కి కూటమి ప్రభుత్వం తెరలేపిందని వైఎస్సార్‌సీపీ జాతీయ అధికార ప్రతినిధి, మాజీ ఎంపీ మార్గాని భరత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజమండ్రిలోని పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇసుక అక్రమాల గురించి మాట్లాడే నైతిక హక్కు టీడీపీ నాయకులకు లేదని చెప్పారు.
వైఎస్సార్‌సీపీ హయాంలో కేంద్ర ప్రభుత్వ సంస్ధ ద్వారా అత్యంత పాదర్శకంగా ఈ టెండర్లు నిర్వహించి ప్రభుత్వ ఖజానాకి రూ.4 వేల కోట్లు వచ్చేలా చేశామని చెప్పారు. కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన రెండేళ్లలో ఉచిత ఇసుక అంటూ ఆ డబ్బు ప్రభుత్వ ఖజానాకి రాకుండా నాయకులు జేబులు నింపుతోందని ఆరోపించారు. రాష్ట్రంలో ఏ మూలనైనా ఉచితంగా ఇసుక లభిస్తోందా అని ఆయన ప్రశ్నించారు.
2014-19 మధ్య గత టీడీపీ ప్రభుత్వ హయాంలో కూడా ఐదేళ్లలో ఇసుక పేరుతో 19 జీవోలు ఇచ్చి రకరకాలుగా ఇసుక దోపిడీకి పాల్పడిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ప్రభుత్వానికి రూ.4 వేల కోట్ల ఆదాయం తీసుకొచ్చినవైఎస్సార్‌సీపీ ఇసుక విధానంలోనే దోపిడీ జరిగి ఉంటే, ఉచిత ఇసుక అంటూ ఖజానాకి ఒక్క రూపాయి కూడా లేకుండా చేస్తున్న కూటమి వల్ల ఇంకెంత నష్టం జరిగి ఉండాలని ప్రశ్నించారు. గోదావరి జిల్లాల పరిధిలో ఒక్కో ఎమ్మెల్యే ఇసుక ద్వారా నెలకు రూ. కోటి సంపాదిస్తున్నారని,వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం వచ్చాక వారి బాగోతాలన్నీ బయటపెట్టి చట్టపరంగా కఠినంగా శిక్షిస్తామని మార్గాని భరత్ హెచ్చరించారు.
ఆయన ఇంకా ఏమన్నారంటే..
80 లక్షల టన్నుల ఇసుక నెలరోజుల్లో లేపేశారు
ఒకపక్క డీఎస్సీ అక్రమాల గురించి రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతుంటే దాన్నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికి గత ప్రభుత్వంలో ఇసుక దోపిడీ అంటూ మరో డైవర్షన్ పాలిటిక్స్‌కి కూటమి ప్రభుత్వం తెరలేపింది. గత ప్రభుత్వంలో 5.08 కోట్ల టన్నుల ఇసుకను అక్రమంగా తవ్వేశారంటూ ఈనాడు పత్రిక రాయించి ఒక అక్రమ కేసును సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు. ఇసుక అక్రమాల గురించి చంద్రబాబు అండ్ కో మాట్లాడటమే పెద్ద జోక్. ఉచిత ఇసుక అని ప్రచారం చేస్తున్న ప్రభుత్వం, రాష్ట్రంలో ఎక్కడైనా ఉచితంగా ఇసుక దొరుకుతుందేమో చూపించాలి.
మా ప్రభుత్వంలో ఏడాదికి రూ.750 కోట్ల చొప్పున, ఐదేళ్లలో నాలుగువేల కోట్లు ప్రభుత్వానికి ఆదాయం వచ్చింది. కానీ ఇప్పుడు మరి ఆ డబ్బంతా ఎక్కడకు పోయింది? ఎవరి జేబులోకి వెళ్లిందో చెప్పాలి. మా ప్రభుత్వంలో రాష్ట్ర ఖజానాకు కనీసం డబ్బులైనా వచ్చేవి, ఇప్పుడు అదికూడా లేదు. అధికార దుర్వినియోగంతో ఇసుక చుట్టూ ఒక మాఫియాను ఏర్పాటు చేసి మొత్తం దోచేస్తున్నారు.వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం దిగిపోయేనాటికి స్టాక్ యార్డుల్లో నిల్వ ఉంచిన 80 లక్షల టన్నుల ఇసుకను కూటమి ప్రభుత్వం వచ్చి నెలరోజులు గడవక ముందే సగం ఇసుకను టీడీపీ నాయకులు కాజేశారు. గోదావరి జిల్లాల్లో ఒక్కో ఎమ్మెల్యే కేవలం ఇసుక ద్వారానే నెలకు రూ. కోటి సంపాదిస్తున్నారు.
ఇసుక విధానంపై రోజుకో మాట
చంద్రబాబు, ఆయన ఎల్లో మీడియా వాదించినట్టుగా గత ఐదేళ్లవైఎస్సార్‌సీపీ పాలనలో 5.08 కోట్ల టన్నుల ఇసుకను అక్రమంగా తవ్వేశారనేది వారి దృష్టిలో నిజమే అయినా, ప్రభుత్వానికి ఇసుక ద్వారా రూ. 4 వేల కోట్ల ఆదాయం వచ్చింది. అదే ఉచిత ఇసుక అని ప్రచారం చేస్తున్న కూటమి ప్రభుత్వం ద్వారా ఇంకెన్ని వేల కోట్లు ప్రభుత్వ ఖజానాకి నష్టం జరిగి ఉండాలి? ఈ రెండేళ్లలో ఎంత ఇసుకను దోచేశారు. ఆ డబ్బంతా ప్రభుత్వ ఖజానాకి చేరకుండా ఎవరి జేబుల్లోకి వెళ్లినట్టు?
ఇప్పుడే కాదు, 2014-19లో కూడా మధ్య ప్రభుత్వ ఖజానాకు ఒక్క రూపాయి కూడా ఆదాయం రానీయకుండా పక్కా అవినీతి పథక రచనతో ఇసుకను దోచేశారు. అదే వ్యవహారం ఇప్పుడు కూడా నడుస్తోంది. ఆరోజుల్లో ఇసుక బాధ్యతలను మొదట ఏపీఎండీసీకి అప్పగించారు. ఆ తర్వాత డ్వాక్రా సంఘాలకు ఇస్తున్నామన్నట్టుగా బిల్డప్ ఇచ్చారు. 2 నెలలు కాకుండానే దాన్నీ రద్దు చేసి టెండర్లు నిర్వహిస్తామన్నారు. చివరకు ఎలాంటి చట్టబద్ధత లేకుండా ఉచిత ఇసుక పేరుతో ఒకే ఒక్క మెమో ఇచ్చి అప్పనంగా వారి మనుషులకు అప్పగించారు. మొత్తంగా 19 జీవోలు ఆ ఐదేళ్లలో ఇచ్చారు.వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఏర్పాటయ్యాక కూటమి నాయకుల ఇసుక దందాను ఖచ్చితంగా వెలుగులోకి తీసుకొచ్చి అందుకు కారకులైన వారిని చట్టపరంగా శిక్షించేదాకా పోరాడుతాం.
నాడు పారదర్శకంగా ఇసుక ఈ టెండర్లు.. ఖజానాకి రూ.4 వేల కోట్ల ఆదాయం
గత వైయస్సార్సీపీ ప్రభుత్వంలో అత్యంత పారదర్శకంగా ఇసుక విధానాన్ని అమలు చేశాం. దోపిడీలకు అడ్డుకట్ట వేసి ఇటు ప్రభుత్వానికి ఆదాయం వచ్చేలా, అటు వినియోగదారునికీ సరసమైన ధరకు అందేలా కేంద్ర ప్రభుత్వ ఫ్లాట్ పాం మీద ఈ-టెండర్లు నిర్వహించాం. రీచ్‌ల వద్ద ఆపరేషన్ ఖర్చులతో కలిపి టన్ను ఇసుకను రూ.475కే సరఫరా చేయడం జరిగింది. ఇందులో రూ.375లు నేరుగా రాష్ట్ర ప్రభుత్వానికి చేరేది. రవాణా ఛార్జీలతో కలిపి ప్రతి నియోజకవర్గానికీ ఇసుక రేట్లను ప్రకటించాం. వైయస్సార్సీపీ ప్రభుత్వాన్ని నిరంతరం దుమ్మెత్తిపోసే పత్రికల్లో కూడా నియోజకవర్గాల వారీగా పారదర్శకంగా రేట్లపై ప్రకటనలు ఇచ్చాం. ప్రజలకు ఒకవైపు తక్కువ ధరకు ఇస్తూనే మరోవైపు రాష్ట్ర ఖజానాకు డబ్బులు వచ్చేట్టుగా చేశాం. రేట్లపై సెబ్ ద్వారా నిరంతరం పర్యవేక్షణ చేసి తప్పులకు ఆస్కారం లేకుండా కఠిన చర్యలు తీసుకున్నాం. తద్వారా ఏడాదికి రూ.750 కోట్ల ఆదాయాన్ని ఖజానాకు వచ్చేలా చేశాం.
డీఎస్సీ అక్రమాలపై మంత్రి లోకేష్ సమాధానం చెప్పాలి
సంక్షేమం, అభివృద్ధి ఎవరి హయాంలో జరిగిందో చర్చించడానికి నారా లోకేష్ చేసిన సవాల్‌నువైఎస్సార్‌సీపీ జాతీయ మీడియా అధికార ప్రతినిధిగా నేను స్వీకరిస్తున్నా. దీనిపై బహిరంగ చర్చకు ఎప్పుడు, ఎక్కడికి రమ్మన్నా రావడానికి నేను సిద్ధంగానే ఉన్నాను. డీఎస్సీలో మొదటి ర్యాంకు తెచ్చుకున్న నవీన్ అనే వ్యక్తికి ఎందుకు ఉద్యోగం ఇవ్వలేదో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ సూటిగా చెప్పగలరా?
సర్టిఫికెట్ వెరిఫికేషన్ కి రాలేదని చెబుతున్నారు. కానీ, ఇదే నవీన్ ప్రభుత్వం తన ఐడీని బ్లాక్ చేసి కాల్ లెటర్ రాకుండా చేసిందని హైకోర్టును కూడా ఆశ్రయించారు. మంత్రి నారా లోకేష్ స్వయంగా మీడియా ముందుకొచ్చివైఎస్సార్‌సీపీ, డీఎస్సీ రాసి ఉద్యోగం కోల్పోయిన అభ్యర్థుల ప్రశ్నలకు సమాధానాలు చెబితే డీఎస్సీలో ఎలాంటి మోసం జరగలేదని ప్రజలు నమ్ముతారు. స్పోర్ట్స్ కోటాలో ఎవరెవరికి ఉద్యోగాలు కేటాయించారు? ఏ నిబంధనల ప్రకారం వారికి ఉద్యోగాలిచ్చారో బయటపెట్టాలి. టీచర్ ఉద్యోగం కోసం రూ. 15 లక్షలు వసూలు చేశారని బయటకొచ్చిన ఆడియో టేపుల ద్వారా స్పష్టంగా తేలిపోయింది. దీనికి కూడా మంత్రి లోకేష్ సమాధానం చెప్పాలి. నిరుద్యోగులకు వివరణ ఇవ్వాలి’ అని డిమాండ్ చేశారు.


