అమిత్‌ షాపై కేటీఆర్‌ వ్యంగ్యాస్త్రాలు

Minister KTR Satires On Central Home Minister Amit Shah - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: మునుగోడు బహిరంగ సభలో పాల్గొనేందుకు ఆదివారం రాష్ట్రానికి వచ్చిన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షాపై టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ మంత్రి కేటీ రామారావు ట్విట్టర్‌ వేదికగా వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ‘ప్రముఖ క్రికెటర్‌ తండ్రి’అంటూ అమిత్‌ షాతో పాటు బీజేపీలో చేరిన కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి కుటుంబ రాజకీయ నేపథ్యాన్ని ప్రస్తావిస్తూ కేటీఆర్‌ ట్వీట్‌ చేశారు. ‘కేవలం తన ప్రతిభ ఆధారంగా అంచెలంచెలుగా ఎదిగి భారతీయ క్రికెట్‌ బోర్డ్‌ బీసీసీఐ కార్యదర్శి పదవిలో ఉన్న ఓ ‘ప్రముఖ క్రికెటర్‌ తండ్రి’ఈరోజు తెలంగాణకు వస్తున్నారు. ఓ సోదరుడు ఎంపీ, భార్య ఎమ్మెల్సీగా గతంలో పోటీ చేసిన నేపథ్యాన్ని కలిగిన ఓ పెద్దమనిషి తరపున ప్రచారం చేస్తారు.

టీఆర్‌ఎస్‌ది కుటుంబ పాలన అంటూ ఉపన్యాసం దంచుతారు’అని అమిత్‌ షా, రాజగోపాల్‌రెడ్డి కుటుంబ రాజకీయ నేపథ్యాన్ని పరోక్షంగా ప్రస్తావిస్తూ కేటీఆర్‌ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ‘బిల్కిస్‌ బానోపై అత్యాచార కేసు దోషులుగా ఉన్న సంస్కారి రేపిస్టులను మీ ప్రభుత్వం ఎందుకు విడుదల చేసిందో తెలంగాణ ప్రజలు మీ నుంచి వినేందుకు అత్యంత ఆసక్తితో ఉన్నారు.

ఎర్రకోట బురుజుల నుంచి మీ ప్రధాని చేసిన బోధనలకు వ్యతిరేకంగా బలాత్కార్‌ సమర్థన జరుగుతోంది. పీఎం గారిని గుజరాత్‌ ప్రభుత్వం సీరియస్‌గా తీసుకోవడం లేదా?’అని ప్రశ్నించారు. ‘ఆవిష్కరణలు, మౌలిక వసతులు, సుస్థిరాభివృద్ధిపై సమష్టిగా దృష్టి పెడితేనే దేశాభివృద్ధి సాధ్యం. కానీ దేశ నాయకత్వం విభజన ఎగతాళి స్వప్రయోజనాల కోసం ప్రజలను రెచ్చగొట్టడం వంటి చర్యలకు పూనుకుంటోంది. 1987లో భారత్‌ చైనా జీడీపీ ఒకే రకంగా ఉన్నా, ఇప్పుడు గణాంకాలు పూర్తి భిన్నంగా ఉన్నాయి’అని కేటీఆర్‌ మరో ట్వీట్‌లో బీజేపీ పాలనపై మండిపడ్డారు. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top