ఏ ముఖం పెట్టుకొని పాదయాత్ర?

Minister Ktr Fires On Bandi Sanjay Padayatra Hyderabad - Sakshi

పాలమూరు ఎత్తిపోతలకు జాతీయ హోదా ఇవ్వనందుకా?

నదీ జలాల్లో తెలంగాణ వాటా తేల్చనందుకా?: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సంజయ్‌పై కేటీఆర్‌ ధ్వజం

కర్ణాటక, గుజరాత్‌లలో బీజేపీ అసమర్థ పాలన చూసి సిగ్గుపడాలని మంత్రి ఎద్దేవా

సాక్షి, హైదరాబాద్‌: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ఏ ముఖం పెట్టుకొని పాదయాత్ర చేస్తున్నారని టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్, మంత్రి కె. తారక రామారావు ప్రశ్నించారు. పాలమూరు ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా ఇవ్వనందుకా.. నదీ జలాల్లో తెలంగాణ వాటా తేల్చకుండా శిఖండి సంస్థను ఏర్పాటు చేసి ఏడేళ్లుగా తాత్సారం చేస్తున్నందుకా? అని నిలదీశారు. హైదరాబాద్‌ మాదాపూర్‌ హెచ్‌ఐసీసీ ప్రాంగణంలో ఈ నెల 27న జరగనున్న టీఆర్‌ఎస్‌ ప్లీనరీకి సంబంధించిన ఏర్పాట్లపై సోమవారం పార్టీ నేతలతో సమావేశమైన కేటీఆర్‌ ఆ తర్వాత మీడియాతో మాట్లాడారు.

తమ పాలనపై మహబూబ్‌నగర్‌ జిల్లా పాదయాత్రలో అడ్డగోలుగా విమర్శలు చేస్తున్న బండి సంజయ్‌... ఆ పొరుగునే ఉన్న బీజేపీపాలిత రాష్ట్రమైన కర్ణాటకకు వెళ్లి అక్కడి పరిస్థితులతో తెలంగాణ పరిస్థితులను పోల్చి చూడాలని కేటీఆర్‌ సూచించారు. ఇందుకోసం అవసరమైతే ఆయనకు ఏసీ వాహనం సమకూరుస్తామన్నారు. తెలంగాణలో పాలన, సంక్షేమ పథకాలు బాగున్నందున తమను విలీనం చేయాలని ప్రకటించిన బీజేపీ రాయచూరు ఎమ్మెల్యేను బండి సంజయ్‌ కలసి రావాలన్నారు. కర్ణాటక మంత్రులు 40 శాతం కమీషన్లు తీసుకుంటున్నారంటూ కాంట్రాక్టర్లు ఆత్మహత్య చేసుకొనే పరిస్థితి నెలకొందని, అక్కడి అసమర్థ పాలన చూసి సంజయ్‌ సిగ్గుపడాలని విమర్శించారు. మరో బీజేపీపాలిత రాష్ట్రమైన గుజరాత్‌లో కరెంటు కోసం రైతులు రోడ్డెక్కారని.. ఆ రాష్ట్ర ప్రభుత్వం పవర్‌ హాలిడేలు ప్రకటిస్తుంటే సంజయ్‌ మాత్రం టీఆర్‌ఎస్‌ పాలనపై పనికిమాలిన కూతలు కూస్తున్నారని దుయ్యబట్టారు. 

కేంద్రం ఇస్తానంటే అడ్డుకుంటున్నామా? 
బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు ఏం చేసిందో చెప్పకుండా మత విద్వేషాలు రెచ్చగొట్టే ప్రసంగాలతో బండి సంజయ్‌ పాదయాత్ర సాగుతోందని కేటీఆర్‌ విమర్శించారు. తెలంగాణలో అధికారంలోకి వస్తే వైద్యం, విద్యను ఉచితంగా అందిస్తామని చెబుతున్న బీజేపీ... అవే పథకాలను పొరుగునే ఉన్న కర్ణాటకలో ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం ప్రజలకు అన్నీ ఉచితంగా ఇస్తే తామేమైనా అడ్డుకుంటున్నామా? అని ప్రశ్నించారు. సొల్లు పురాణం, అబద్ధాలతో బండి సంజయ్‌ పాదయాత్ర సాగుతోందన్నారు. అంబేడ్కర్‌ ఆలోచనలకు అనుగుణంగా ఏర్పాటైన టీఆర్‌ఎస్‌... కేసీఆర్‌ నాయకత్వంలో తెలంగాణను అభివృద్ధి బాటలో ఉద్యమంలా తీసుకెళ్తోందని కేటీఆర్‌ అన్నారు.  

రేపు వరంగల్‌కు మంత్రి కేటీఆర్‌ 
సాక్షి ప్రతినిధి, వరంగల్‌: రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ వరంగల్‌ పర్యటన ఖరారైంది. బుధవారం ఆయన వరంగల్, హనుమకొండ జిల్లాల్లో పర్యటించనున్నారు. మహానగర పాలక సంస్థ (స్మార్ట్‌ సిటీ) పథకంలో భాగంగా వివిధ అభివృద్ధి పనులకు ప్రారంభో త్సవాలు చేయనున్నారు. ప్రాంతీయ గ్రంథాలయం, కాపువాడ భద్రకాళి బండ్, పబ్లిక్‌ గార్డెన్‌ను మంత్రి ప్రారంభించి, డబుల్‌ బెడ్‌రూం ఇళ్లను లబ్ధిదారులకు పంపిణీ చేస్తారు. అనంతరం హనుమకొండ, వరంగల్‌ జిల్లాల కలెక్టర్లు సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. 
 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top