ఆనాడు పోలవరంపై ఎందుకు పోరాటం చేయలేదు..?

Minister Anil Kumar Yadav Fires On CPI Leader Ramakrishna - Sakshi

సీపీఐ నేత రామకృష్ణపై మంత్రి అనిల్‌కుమార్‌ యాదవ్‌ ధ్వజం

సాక్షి, తాడేపల్లి: ప్రతిపక్ష నేత చంద్రబాబు అజెండా కోసమే సీపీఐ నేత రామకృష్ణ పనిచేస్తున్నారని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అనిల్‌కుమార్‌ యాదవ్‌ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. సోమవారం ఆయన తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ పోలవరంపై సీపీఐ రామకృష్ణ రాజకీయం చేయాలని చూశారని, అలాంటివి వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం సహించదని ధ్వజమెత్తారు. ‘‘పోలవరం గురించి తెలుసుకోవాలంటే పది మంది వెళ్తే సరిపోతుంది. 200 మంది వెళ్లి పోలవరంలో ఏమి చేస్తారు. వామపక్ష పార్టీలు పేదల కోసం పోరాడేవి. ఇప్పుడు సీపీఐ రామకృష్ణ చంద్రబాబు అజెండా కోసం, మెప్పు కోసం పోరాటం చేస్తున్నారు. చంద్రబాబు హయాంలో పోలవరంపై రామకృష్ణ ఎందుకు పోరాటం చేయలేదు. ఎర్త్‌ డ్యాం పనులే ఫిబ్రవరి నుండి ప్రారంభమవుతాయి. రామకృష్ణ చెప్పినట్టు అంగుళం ఎత్తు కూడా తగ్గించడం లేదు. పోలవరం ప్రారంభోత్సవానికి మిమ్మల్ని పిలుస్తాం. వచ్చి టేపు పట్టుకుని కొలతలు వేసుకోవచ్చు. (చదవండి: ‘హైదరాబాద్‌ జూమ్‌ టీవీలో ప్రతిపక్షం’)

పోలవరంపై ప్రజల్లో అపోహలు సృష్టిస్తున్నారు..
చంద్రబాబుకు నష్టం జరిగే వ్యాఖ్యలు రామకృష్ణ చేయరు. కేవలం రచ్చ చేయడానికి పోలవరం వెళ్లే ప్రయత్నం చేశారు. అన్ని పార్టీల నుండి ప్రతినిధులు వచ్చినా పోలవరం పనులు మేము వివరిస్తాం. ప్రతి పార్టీ నుండి ఇద్దరు వచ్చినా వివరాలు అందిస్తాం. జూమ్‌లో చంద్రబాబు ఆదేశాలు ఇస్తారు. రామకృష్ణ ఇక్కడ అమలు చేశారు. పోలవరం అర్అండ్‌ఆర్‌ గృహ నిర్మాణల పై రామకృష్ణ ఎందుకు మాట్లాడలేదు. చంద్రబాబు చేసిన గలీజును కడిగేస్తుంటే చూసి ఓర్వలేక పోతున్నారు. పోలవరంపై ప్రజల్లో అపోహలు సృష్టిస్తున్నారు. 2017లో క్యాబినెట్‌లో చంద్రబాబు ఒప్పుకున్న దానిని  గురించి రామకృష్ణ నోరు మెదపరని’’ మంత్రి నిప్పులు చెరిగారు. (చదవండి: పోలవరం పరుగులు: ఎమ్మెల్సీ డొక్కా)

రచ్చ చేస్తానంటే చూస్తూ ఊరుకోం..
2021కి పోలవరం పూర్తి చేస్తామని చంద్రబాబు ఆదేశాలతో రామకృష్ణ రచ్చ చేస్తానంటే చూస్తూ ఊరుకోమన్నారు. చంద్రబాబు కమీషన్ల కోసం పోలవరం కడతానని ఒప్పుకున్నారు. ఆర్ధిక మంత్రి కేంద్రంతో చర్చలు జరుపుతున్నారు ఇవి వారికి కనబడవని మంత్రి ధ్వజమెత్తారు. ‘‘పోలవరం కట్టి ఎడమ, కుడి కాల్వ నుంచి నీరు ఇస్తాం. పోలవరం పూర్తయితే.. కొంత మంది కళ్లలో రక్తం కారుతుంది. పోలవరం దగ్గర బల ప్రదర్శనలు పనికి రావు. ప్రభుత్వం ఎక్కడైనా ఒక్క అడుగు, సెంటీ మీటర్ తగ్గిస్తుందని చెప్పిందా? 70 సంవత్సరాల కల పోలవరం ప్రాజెక్టును శంకుస్థాపన చేసిన మహానేత వైఎస్సార్‌. ఎన్టీఆర్‌ను 150 అడుగులు లోతులో పూడ్చిన నేత చంద్రబాబు. ప్రాజెక్ట్ పూర్తయితే వైఎస్సార్‌ విగ్రహం పెడతామంటే తప్పేముంది. పోలవరం కోసం వైఎస్సార్‌ చేసిన కృషి ప్రజలకు తెలియాలి. వయసు పైబడిన చంద్రబాబుకు మతి భ్రమించిందని’’ మంత్రి అనిల్‌కుమార్‌ యాదవ్‌ దుయ్యబట్టారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top