చంద్రబాబు దళిత ద్రోహి

Meruga Nagarjuna Fires On Chandrababu - Sakshi

31లక్షల ఎకరాలకు పట్టాలిస్తుంటే కోర్టులకు వెళ్లి ఆపుతున్నారు

సీఎం వైఎస్‌ జగన్‌ దళితుల సంక్షేమం, అభివృద్ధికి పనిచేస్తున్నారు

రాష్ట్రంలో బీజేపీ మత రాజకీయాలు చేస్తోంది

వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ఎస్సీ సెల్‌ అధ్యక్షుడు, ఎమ్మెల్యే మేరుగ నాగార్జున

సాక్షి, విశాఖపట్నం: టీడీపీ అధినేత చంద్రబాబు దళిత ద్రోహి అని వైఎస్సార్‌సీపీ ఎస్సీ సెల్‌ అధ్యక్షుడు, ఎమ్మెల్యే మేరుగ నాగార్జున చెప్పారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్న 31 లక్షల ఎకరాలకు పట్టాలిస్తుంటే కోర్టులకు వెళ్లి ఆపుతున్నారని విమర్శించారు. శనివారం ఇక్కడ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. దళితులు ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా అభివృద్ధి చెందేలా ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుంటే టీడీపీ కోర్టుల ద్వారా ఆపే ప్రయత్నం చేస్తోందని అన్నారు. దళితుడైన డాక్టర్‌ సుధాకర్‌ మరణానికి చంద్రబాబు, అయ్యన్నపాత్రుడే కారణమన్నారు.

దళిత ద్రోహులైన వర్ల రామయ్య, నక్కా ఆనంద్‌బాబు, జవహర్, వంగలపూడి అనితలతో కలిసి దళితుల్లో విభేదాలు సృష్టించాలని చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని తెలిపారు. ఎన్టీఆర్‌ హయాంలో దళితుల  సంక్షేమం జరిగిందని చంద్రబాబు ఒప్పుకున్నందుకు ధన్యవాదాలని.., ఆ తర్వాత మహానేత వైఎస్సార్, ఇప్పడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దళితుల సంక్షేమం, అభివృద్ధికి పని చేస్తున్నారని చెప్పారు. ఎవరి హయాంలో దళితుల అభివృద్ధి జరిగిందో బహిరంగ చర్చకు సిద్ధమా అని సవాల్‌ విసిరారు. అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు దళితులపై చులకన భావంతో వ్యవహరించారన్నారు.

దళితుల భూములు లాక్కోవడం, మహిళలపై దాడులు చేశారని, దళిత హక్కు చట్టాలను చుట్టాలుగా వాడుకున్నారని విమర్శించారు. చిత్తురు జిల్లా రామకుప్పంలో అంబేడ్కర్‌ విగ్రహం పెట్టనివ్వలేదని అసత్య ప్రచారం చేస్తున్నారని, రాష్ట్రంలో డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేడ్కర్‌ విగ్రహాలను ఏర్పాటు చేస్తున్నదే తమ ప్రభుత్వమని చెప్పారు. అధికారంలోకి వస్తే సంపూర్ణ గృహ హక్కు పథకం (ఓటీఎస్‌) ఉచితంగా చేస్తామని హామీలివ్వడం కాదని, ఐదేళ్లు అధికారంలో ఉండి ఏమి చేశారని మండిపడ్డారు. గుంటూరులో ‘జిన్నా టవర్‌’’ పేరు మార్చాలంటూ బీజేపీ మత రాజకీయాలు చేస్తోందని  అన్నారు. 2018 వరకు టీడీపీతో కలిపి బీజేపీ రెండు పర్యాయాలు కేంద్రం, రాష్ట్రంలో అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు మార్చలేదని ప్రశ్నించారు. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top