Arvind Kejriwal: మీ ఉత్సాహం చూస్తుంటే మూడు రోజుల్లోనే సిసోడియాను అరెస్టు చేస్తారు

Manish Sisodia might be arrested in two three days Arvind Kejriwal - Sakshi

అహ్మదాబాద్‌: గుజరాత్‌లో ఆమ్‌ ఆద్మీ పార్టీకి విశేష స్పందన లభిస్తోందని తెలిపారు అరవింద్ కేజ్రీవాల్. ఈ ఉత్సాహం చూస్తుంటే ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీశ్ సిసోడియాను అరెస్టు చేసేందుకు సీబీఐపై ఒత్తిడి పెరుగుతుందన్నారు. మరో 10 రోజుల్లో సిసోడియాని సీబీఐ అరెస్టు చేయవచ్చని, కానీ ప్రజల నుంచి వస్తున్న స్పందన చూస్తుంటే మరో రెండు మూడు రోజుల్లోనే ఆయనను అరెస్టు చేస్తారేమోనని పేర్కొన్నారు. గుజరాత్‌లోని భావ్‌నగర్‌లో నిర్వహించిన ర్యాలీలో కేజ్రీవాల్ ఈమేరకు వ్యాఖ్యానించారు.

మనీశ్ సిసోడియా మాట్లాడుతూ.. ప్రజల నుంచి మద్దతు పెరుగుతున్నందుకే బీజేపీ తనను లక్ష‍్యంగా చేసుకుందని ఆరోపించారు. 'మీ ఆగ్రహం, ఉత్సాహం కారణంగానే కేంద్రం నా మెడపై ఉచ్చు బిగించాలని చూస్తోంది. నా గురించి ఆందోళన చెందకండి. నాది నిజాయితీ మెడ. ఎక్కడా దాసోహం అవ్వదు.' అని సిసోడియా అన్నారు.

ఢిల్లీ, పంజాబ్‌లో అధికారంలో ఉన్న ఆప్ ఈసారి గుజరాత్‌లో పాగా వేయాలని చూస్తోంది. ఈ ఏడాది చివర్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటాలని భావిస్తోంది. 30 ఏళ్లు అధికారంలో ఉన్న బీజేపీ ప్రజలకు నాణ్యమైన విద్య, వైద్యం, ఉద్యోగాలు ఇవ్వడంలో విఫలమైందని పెద్ద ఎత్తున ప్రచారం చేస్తోంది. తాము అధికారంలోకి వస్తే 10 లక్షల ఉద్యోగాలు, మెరుగైన విద్య, వైద్యం అందిస్తామని, రూ.3000 నిరుద్యోగ భృతి ఇస్తామని హామీల వర్షం కురిపిస్తోంది.

ఢిల్లీ ప్రభుత్వం తీసుకొచ్చిన లిక్కర్ పాలసీలో అవినీతి జరిగిందని సీబీఐ కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో మనీశ్ సిసోడియాపై అభియోగాలు మోపింది. గతవారం సిసోడియా నివాసంతో పాటు దేశవ్యాప్తంగా ఏడు రాష్ట్రాల్లోని 31 చోట్ల సోదాలు నిర్వహించింది. అయితే ఢిల్లీలో ఆప్ ప్రభుత్వం అందిస్తున్న విద్య, వైద్యానికి అంతర్జాతీయంగా ప్రశంసలు దక్కుతున్నాయని, అది చూసి ఓర్వలేకే కేంద్రం సీబీఐతో తమపై దాడులు చేయిస్తోందని ఆప్ ఆరోపించింది.
చదవండి: ‘రాజీ’ ఎరుగని బీజేపీ ఎమ్మెల్యే‌.. ఏడికైతే ఆడికైతది.. తగ్గేదెలే!

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top