అ‍ర్ధరాత్రి హైడ్రామా.. మమతా బెనర్జీ సైతం ఎంట్రీ ఇచ్చి.. | Mamata Banerjee Visits Bhabanipur Strongroom | Sakshi
Sakshi News home page

అ‍ర్ధరాత్రి హైడ్రామా.. మమతా బెనర్జీ సైతం ఎంట్రీ ఇచ్చి..

May 1 2026 1:54 AM | Updated on May 1 2026 9:53 AM

 Mamata Banerjee Visits Bhabanipur Strongroom

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లో అర్ధరాత్రి హైడ్రామా నెలకొంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కోల్‌కతాలోని భవానీపూర్ నియోజక వర్గానికి సంబంధించిన స్ట్రాంగ్‌రూమ్‌కు చేరుకున్నారు. ఈవీఎం స్ట్రాంగ్‌రూమ్‌లో బ్యాలెట్ బాక్సులు తెరిచారని ఆమె ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. 

దీంతో పరిస్థితిని స్వయంగా పరిశీలించేందుకు మమతా బెనర్జీ వచ్చారు. దక్షిణ కోల్‌కతాలోని సఖావత్ మెమోరియల్ స్కూల్‌కు వచ్చారు. ఇది భవానీపూర్ అసెంబ్లీ నియోజకవర్గ కౌంటింగ్ కేంద్రం. అక్కడ ఏప్రిల్ 29న జరిగిన పోలింగ్‌కు సంబంధించిన ఈవీఎంల స్ట్రాంగ్‌రూమ్ ఉంది. 

ఆ కౌంటింగ్ కేంద్రాన్ని మమతా బెనర్జీ పరిశీలించి, అర్ధరాత్రి దాటాక మీడియాతో మాట్లాడారు. “అభ్యర్థి లేదా ఒక ఏజెంట్ మాత్రమే పై అంతస్తులో ఉండవచ్చు. మీడియా కోసం సీసీటీవీ కెమెరా ఏర్పాటు చేయాలని కూడా నేను సూచించాను. పారదర్శకతను కొనసాగించాలి. ఫిర్యాదులు రావడంతో నేను వెంటనే ఇక్కడికి వచ్చాను. కేంద్ర బలగాలు మొదట నన్ను లోపలికి అనుమతించలేదు. లెక్కింపు ప్రక్రియలో జోక్యం చేసుకుంటే మేము సహించం. 

ఇక్కడ ఈవీఎంల కోసం స్ట్రాంగ్‌రూమ్ ఉంది. చాలా చోట్ల మానిప్యులేషన్ జరుగుతోందని మేము గమనించాము. ఎన్నికల నియమాల ప్రకారం పార్టీ అభ్యర్థి, ఎన్నికల ఏజెంట్‌కు సీల్ చేసిన గది వరకు వెళ్లే అనుమతి ఉంటుంది. మా ఏజెంట్‌ను అరెస్ట్ చేశారు. ఏకపక్ష వైఖరి కనిపిస్తోంది. తప్పుడు చర్యలకు పాల్పడితే ప్రాణాలు అడ్డుపెట్టి పోరాడతాం” అని తెలిపారు.

నేతాజీ ఇండోర్ స్టేడియంలోనూ అంతే.. 
కోల్‌కతాలోని నేతాజీ ఇండోర్ స్టేడియంలో ఈవీఎం స్ట్రాంగ్‌రూమ్ బయట కూడా అర్ధరాత్రి ఉద్రిక్తత నెలకొంది. అక్కడ తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీ నేతలు ధర్నాకు దిగారు. సంబంధిత పార్టీ ప్రతినిధులు లేకుండా బ్యాలెట్ బాక్సులను తెరుస్తున్నారని ఆరోపించారు. ఈ స్ట్రాంగ్‌రూమ్‌లో పలు అసెంబ్లీ నియోజకవర్గాల ఈవీఎంలను ఉంచారు.

బెంగాల్ మంత్రి శశి పాంజా, తృణమూల్ ప్రతినిధి కునాల్ ఘోష్‌ ఈవీఎంల భద్రతపై అనుమానం వచ్చి స్వయంగా అక్కడికి వచ్చి నిరసన చేపట్టారు. వారిద్దరు నేతాజీ ఇండోర్ స్టేడియం బయట ధర్నా ప్రారంభించారని తృణమూల్ ఓ ప్రకటనలో తెలిపింది.

మరోవైపు, తృణమూల్ ఆరోపణలను బీజేపీ నేత తాపస్ రాయ్ పూర్తిగా ఖండించారు. “ఇవి అన్నీ తృణమూల్ ఇప్పుడు భయ వాతావరణాన్ని సృష్టించేందుకు వ్యాపింపజేస్తున్న వదంతులు. వాళ్లే భయపడుతున్నారు. నేనూ స్ట్రాంగ్‌రూమ్ పరిశీలించేందుకు వచ్చాను. తృణమూల్ అబద్ధాలు చెబుతోంది” అన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement