Maharashtra MLC Election: అధికార పక్షానికి బీజేపీ భారీ షాక్‌

Maharashtra MLC Election Results 2022: BJP Wins 5 Seats, Congress 1, NCP 2, Shiv Sena 2 - Sakshi

చీలిపోయిన మహావికాస్‌ ఆఘాడీ ఓట్లు

ఫలించిన ఫడ్నవీస్‌ వ్యూహం

ఐదుగురు బీజేపీ అభ్యర్థుల విజయం

శివసేన రెండు, ఎన్సీపీ రెండు స్థానాల్లో విజయం

పరాజయం పాలైన కాంగ్రెస్‌ అభ్యర్థి హండోరే

సాక్షి ముంబై: మహారాష్ట్ర విధాన పరిషత్‌ ఎన్నికల ఫలితాలు మహావికాస్‌ ఆఘాడికి షాక్‌నిచ్చాయి. విధాన పరిషత్‌ ఎన్నికల్లో 10 స్థానాలకోసం 11 మంది అభ్యర్థులు బరిలోకి దిగారు. అయితే రసవత్తరంగా జరిగిన ఈ ఎన్నికల్లో బీజేపీకి చెందిన అయిదుగురు అభ్యర్థులూ విజయం సాధించడం విశేషం. ముఖ్యంగా మొత్తం 285 ఓట్లలో రెండు ఓట్లు రద్దయ్యాయి. ఇక ప్రథమ ప్రాధాన్యమిచ్చిన ఓట్లతో బీజేపీ నలుగురు, శివసేన ఇద్దరు, ఎన్సీపీ ఇద్దరు అభ్యర్థులు ఇలా మొత్తం ఎనిమిది మంది అభ్యర్థు లు గెలుపొందారు. ఇక మిగిలిన రెండు స్థానాల కోసం హోరాహోరీగా పోటీ కొనసాగింది. కాని చివరికి కాంగ్రెస్‌ అభ్యర్థి చంద్రకాంత్‌ హండోరే పరాజయంపాలు కాగా బీజేపీ అభ్యర్థి ప్రసాద్‌ లాడ్‌ విజయం సాధించారు. మరోవైపు కాంగ్రెస్‌ అభ్యర్థి భాయి జగతాప్‌ కూడా విజయం సాధించారు. 

ఇలా బీజేపీకి చెందిన అయిదుగురు అభ్యర్థులు ప్రవీణ్‌ దరేకర్, శ్రీకాంత్‌ భారతీయ్, ఉమా ఖాకరే, రామ్‌ శిందే, ప్రసాద్‌ లాడ్‌ విజయం సాధించగా శివసేనకు చెందిన సచిన్‌ ఆహీర్, ఆమషా పాడవీ, ఎన్సీపీకి చెందిన రామ్‌రాజే నింబాల్కర్, ఏక్‌నాథ్‌ ఖడ్సేలు విజయం సాధించగా కాంగ్రెస్‌కు చెందిన ఇద్దరు అభ్యర్థులలో చంద్రకాంత్‌ హండోరే పరాజ యం పొందగా భాయి జగతాప్‌ మాత్రం విజయం సాధించారు. ముఖ్యంగా ప్రసాద్‌ లాడ్, భాయి జగతాప్‌ల మధ్య గట్టి పోటీ ఉంటుందని భావించారు. కానీ ఊహించని విధంగా భాయిజగతాప్, ప్రసాద్‌ లాడ్‌లు ఇద్దరూ విజయం సాధించినప్పటికీ చంద్రకాంత్‌ హండోరే మాత్రం పరాజయం చవిచూడాల్సి వచ్చింది. ఇలా కాంగ్రెస్‌కు ఈ ఫలితాలు గట్టి షాక్‌ నిచ్చాయని చెప్పవచ్చు. మరోవైపు మహావికాస్‌ ఆఘాడి ఓట్లు చీలిపోవడంతో బీజేపీకి లాభం చేకూరింది. ఇండిపెండెంట్లతో 112 మంది అభ్యర్థుల మద్దతున్నప్పటికీ బీజేపీకి 133 ఓట్లు పోలయ్యాయి.  

కాంగ్రెస్‌ అభ్యంతరంతో ఆలస్యమైన లెక్కింపు 
విధాన పరిషత్‌ ఎన్నికల ఫలితాల సమయంలో కాంగ్రెస్‌ అభ్యంతరంతో ఓట్ల లెక్కింపు జాప్య మైంది. మొత్తం 288 మంది ఎమ్మెల్యేలుండగా 285 మంది ఎమ్మెల్యేలు ఓటు హక్కు వినియోగించుకున్నారు. మిగిలిన ముగ్గురిలో నవాబ్‌ మల్లిక్, అనీల్‌ దేశ్‌ముఖ్‌లకు హైకోర్టు ఓటు వేసేందుకు అనుమతిని నిరాకరించగా మరోవైపు శివసేన ఎమ్మెల్యే రమేష్‌ లాట్కే మృతి చెందిన సంగతి తెలిసిందే. ఇలా ఓట్లు వేసిన 283 మంది ఎమ్మెల్యేలలో రెండు ఓట్లు రద్దు అయ్యాయి. కానీ ఓట్ల లెక్కింపు సమయంలో ముక్తా తిలక్‌తోపాటు మరో అభ్యర్థి ఓటు హక్కు వినియోగించుకోవడంపై కాంగ్రెస్‌ అభ్యంతరం వ్యక్తం చేసింది. దీంతో ఓట్ల లెక్కింపు ఆలస్యమైంది. ఈ విషయంపై ఎన్నికల కమిషన్‌కు కూడా కాంగ్రెస్‌ ఫిర్యాదు చేసింది. కానీ ఎన్నికల కమిషన్‌ కాంగ్రెస్‌ అభ్యంతరాలను తోసిపుచ్చింది. దీంతోపాటు ఓట్ల లెక్కింపును కొనసాగించాలని ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఓట్లు లెక్కింపు మళ్లీ ప్రారంభించారు.
  

హ్యాట్రిక్‌ సాధించిన రామ్‌రాజ్‌ నింబాల్కర్‌... 

శరద్‌ పవార్‌ సన్నిహితుడుగా గుర్తింపు పొందిన ఎన్సీపీ సీనియర్‌ నేత రామ్‌రాజే నింబాల్కర్‌ విధాన పరిషత్‌ ఎన్నికల్లో విజయం సాధించి హ్యాట్రిక్‌ సాధించారు. ఆయనకు మొదటి ప్రాధాన్య ఓట్లు 28 లభించాయి. దీంతో ఆయన సునాయసంగా గెలుపొందారు. ఆయన విధాన పరిషత్‌ ఎన్నికల్లో విజయం సాధించడంతో విధాన పరిషత్‌ స్పీకర్‌ పదివి ఆయన వద్దనే ఉండనుండడం ఖాయమైందని చెప్పవచ్చు. (చదవండి: శివసేనలో చీలిక.. డేంజర్‌లో మహా సర్కార్!?)

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top