‘దరఖాస్తుల తీసుకోవడమే తప్పా పరిష్కరించింది లేదు’

Madhu Yashki Goud Takes On Telangana CM KCR - Sakshi

హైదరాబాద్‌: కేసీఆర్‌ సర్కారుపై మరొకసారి ప్రశ్నలు కురిపించారు తెలంగాణ కాంగ్రెస్‌ ప్రచార కమిటీ చైర్మన్‌ మధు యాష్కీ గౌడ్‌. 2014 ఎన్నికల సమయంలో కాంగ్రెస్‌ ఇస్తున్న 200 రూపాయల పింఛన్‌ను 1000 రూపాయలకు పెంచుతామమని కేసీఆర్‌ ప్రకటించారని, ఎన్నికల్లో గెలుపు తర్వాత ఆసరా పింఛన్‌ 65 ఏళ్లు పూర్తయిన వాళ్లు మాత్రమే అర్హులుగా ప్రకటించారని మధు యాష్కీ గౌడ్‌ ఆరోపించారు.  అంతేకాకుండా భార్యభర్తల్లో ఒకరికి మాత్రమే ఆసరా పింఛన్‌ వర్తిస్తుందని ప్రభుత్వం ప్రకటించిందనే విషయాన్ని ప్రస్తావించారు.

ఆదివారం ప్రెస్‌నోట్‌ను విడుదల చేసిన మధు యాష్కీ గౌడ్‌.. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ పాలనపై మండిపడ్డారు. 2018 ఎన్నికల సమయంలో 65 సంవత్సరాలు అర్హతను 57కు తగ్గిస్తామని ప్రకటించాడు. ‘ఎన్నికలు పూర్తయి మళ్లీ అధికారంలోకి వచ్చి మూడున్నర సంవత్సారాలు అవుతున్నా ఇప్పటివరకు ఆసరా పెంక్షనర్ల వయసు తగ్గింపుపై కల్వకుంట్ల ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. పింఛన్‌దారుల అర్హత వయసు తగ్గింపుపై ఇప్పటివరకూ కేసీఆర్‌ ప్రభుత్వం ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు. 

57 సంవత్సారాలు నిండిన వారు మీ సేవలో దరఖాస్తు చేసుకోవాలని మాత్రమే.. అది కూడా పత్రికా ముఖంగా ప్రకటించారు.. అంతకుమించి మరేమీ చేయలేదు.రాష్ట్రంలో కొత్త పెంక్షన్ల కోసం దాదాపు 11 లక్షల మంది దరఖాస్తులు చేసుకున్నారు. ఆసరా పించన్లకోసం వితంతువులు, ఒంటరి మహిళలు, దివ్యంగులు, వృద్దులు దరఖాస్తు చేసుకున్నారు. కేసీఆర్ ప్రభుత్వం 2018 నుంచి కొత్తగా పింఛన్లు ఇవ్వడం ఆపేసింది. కేవలం హుజూరాబాద్, దుబ్బాక ఉప ఎన్నికల సమయంలో ఆయా నియోజకవర్గాల్లో మాత్రమే కొత్తగా పింఛన్లు ఇచ్చారు.

మిగిలిన రాష్ట్రంలో ఎక్కడా ఇవ్వలేదు. ప్రస్తుత రాష్ట్ర ఖజానా ఖాళీగా ఉంది.. ఆసరా పింఛన్లు వస్తున్న వాళ్లకు కూడా నెలాఖరుకి మాత్రమే డబ్బులు వస్తున్నాయి.2021 - 2022 కు పెట్టిన భారీ అంకెల బడ్జెట్ చివరకు లోటు బడ్జెట్ గా మిగిలింది.. మొత్తంగా 10 వేల కోట్ల రూపాయల లోటు బడ్జెట్ ఏర్పడింది. ప్రతిపాదిత పథకాలకు కూడా డబ్బులు లేవు. కేసీఆర్ రెండోసారి ప్రభుత్వం ఏర్పాటు చేశాక అన్ని పథకాలకు దరఖాస్తులు తీసుకోవడమే తప్ప వాటిని పరిష్కరించింది లేదు. ఇప్పటివరకు ఆసరా పింఛన్‌ కోసం 13.07 లక్షల దరఖాస్తులు, ధరణి సవరణలకోసం 5 లక్షలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ  సబ్సిడీ లోన్ల కోసం 8.20 లక్షలు, రేషన్ కార్డుల కోసం 3.90 లక్షలు, పోడు పట్టాల కోసం 2.50 లక్షలు, గొర్రెల పంపిణీ కోసం 3.63 లక్షల దరఖాస్తులను ప్రభుత్వ తీసుకుంది.  వీటిలో వేటికి ప్రభుత్వం పరిష్కారం చూపలేదు’ అని మధు యాష్కీ గౌడ్‌ విమర్శించారు. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top