పట్టాభి ఎపిసోడ్‌.. నటన ఫెయిలైందా?.. ఇంతకీ ఏం జరిగింది?

Loss To Tdp Due To Pattabhi Overaction - Sakshi

సాక్షి ప్రతినిధి, విజయవాడ: టీడీపీ దీనస్థితిపై ఆ పార్టీ వర్గాల్లో అలజడి మొదలైంది. తమ గొయ్యి తామే తవ్వుకొంటున్నామని ఆ పార్టీ నేతల్లో చర్చ నడుస్తోంది. పార్టీకి హైప్‌ తేవాలనే  కొత్త వ్యూహాలతో కష్టాలు కొని తెచ్చుకొంటున్నామని అంటున్నారు. గన్నవరం వ్యవహారంలో పట్టాభి ఓవరాక్షన్‌ వల్లే  ఇంత నష్టం చవిచూడాల్సి వచ్చిందని వాపోతున్నారు.

ఆయనకు సంబంధంలేని గన్నవరానికి వెళ్లి అక్కడ ఎమ్మెల్యేను దుర్భాషలాడటం అంటే ఏనుగును చూసి కుక్కలు మొరిగినట్టుందని ఎద్దేవా చేస్తున్నారు. గన్నవరం బాధ్యతలు  చూస్తున్న బచ్చల అర్జునుడు అనారోగ్యంతో  ఉన్నాడనే ఓ సాకు ఆధారంగా పట్టాభి చక్రం తిప్పాలని భావించాడు. ఆలోచన వచ్చిందే తడవుగా వ్యూహాత్మకంగా ఎమ్మెల్యే వంశీపై మాటల యుద్ధం మొదలు పెట్టాడు.

ఐదు, ఆరు రోజుల తరువాత నేరుగా గన్నవరానికి వెళ్లి తన తడాఖా చూపిద్దాం అనుకున్నాడు. గొడవ సృష్టించడం ద్వారా టీడీపీకి సానుభూతి వచ్చేలా అడుగువేద్దామనుకున్నాడు. అయితే ఆయనతోపాటు,  టీడీపీ శ్రేణుల చిల్లర చేష్టలు, దిగజారుడు వ్యాఖ్యలతో వంశీ వర్గీయులు తీవ్రంగా బాధపడిపోయారు. టీడీపీ శ్రేణులు వైఎస్సార్‌ సీపీ నేతలు, కార్యకర్తలపై దూసుకొస్తుండటంతో ప్రతిఘటించక తప్పలేదు.

పోలీసులను భయపెట్టి...
పోలీసులను భయపెట్టి లబ్ధిపొందాలని చూసిన  పట్టాభి అండ్‌ గ్యాంగ్‌ వ్యూహం బెడిసికొట్టింది. సీఐకి గాయం అయినప్పటికీ పోలీసులు  సంయమనంతో వ్యవహరించి ఇరువర్గాలను అక్కడి నుంచి పంపించేశారు. ఆ తరువాత కూడా టీడీపీ నేతలు అతి చేయడం ఆ పార్టీ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. పట్టాభి చేసింది సబబేనని సమర్థిస్తూ మాట్లాడాలని  అధిష్టానం నుంచి సూచనలు అందటంపై భగ్గుమంటున్నారు.

చంద్రబాబు తీరుపై...
ఇంతటితో ఈ వ్యూహానికి ఫుల్‌స్టాప్‌ పెట్టాల్సిన చంద్రబాబు తగుదునమ్మా అంటూ ప్రత్యేక విమానం వేసుకొని విజయవాడకు రావటం, పట్టాభి భార్యను పరామర్శించడం ముమ్మాటికీ వ్యూహాత్మక తప్పిదమని ఆ పార్టీలోని పలువురు సీనియర్లు అభిప్రాయ పడుతున్నారు. కొద్ది రోజుల క్రితం నందిగామలో ఇలానే ఓవరాక్షన్‌ చేసి, అనక దొరికి పోయి తేలు కుట్టిన దొంగల్లా మిన్నకుండిపోవాల్సి వచ్చిందన్న విషయం తమ అధిష్టానం గుర్తిస్తే బావుటుందని అంటున్నారు. ఈ వ్యవహారాన్ని సాగదీసేకొద్దీ వంశీకి విస్తృత ప్రచారం వస్తుందనే విషయాన్ని తమ బాబు గుర్తించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

నటన ఫెయిల్‌తో అభాసుపాలు..
నటన ఫెయిల్‌ కావడంతో పట్టాభి మరింత అభాసుపాలయ్యాడు. పోలీసులు థర్డ్‌ డిగ్రీ ప్రయోగించకపోయినా కొట్టారని నమ్మించేందుకు గన్నవరం కోర్టులో ఆయన  చేసిన నటన అంతా ఇంతా కాదని అంటున్నారు. ఇది టీడీపీ పరువు మరింత తీసిందని పేర్కొంటున్నారు. దీంతో అభాసుపాలు కావాల్సి వచ్చిందని చెబుతున్నారు. కోర్టును తప్పుదోవ పట్టించే యత్నాన్ని, అతని నటనను గుడివాడ, విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రులు బహిర్గతం చేశాయి.
చదవండి: ‘ఎల్లో గ్యాంగ్‌’ బరితెగింపు.. ఈనాడు ‘కొట్టు’కథ  

ఇరువర్గాల ఘర్షణలో చేతికి చిన్న గాయం తప్ప, ఆయనకు ఎలాంటి గాయాలు లేవని, ఆరోగ్యంగా ఉన్నాడని వైద్యులు తమ రిపోర్టులో పేర్కొన్నారు. మొత్తం మీద గన్నవరం ఎపిసోడ్‌లో పట్టాభి పార్టీ పరువు తీశాడని, కొంత మంది టీడీపీ నేతలే మండిపడుతున్నారు. ఇప్పటికైనా ఇలాంటి తప్పుడు ఆలోచనలు మానుకొని, ప్రజల వద్దకు వెళితే మంచిదనే భావన ఆ పార్టీ వర్గాల్లోనే వ్యక్తమవుతోంది.   

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top