సోషల్ మీడియాలో వ్యంగ్యరూపంలో ప్రారంభమైన కాక్రోచ్ జనతా పార్టీ (CJP) రోజుల వ్యవధిలోనే విపరీతమైన క్రేజ్‌ను సంపాదించుకుంది. ఎంతలా అంటే భారత్‌లో ప్రధానంగా ఉన్న రాజకీయా పార్టీలను వెనక్కు నెట్టి మరీ ఈ పార్టీ దూసుకుపోయింది ఏ నోట విన్నా సీజేపీ అనే స్థాయికి ఈ సోషల్ మీడియా పార్టీ చేరింది. అయితే దీన్ని నెలకొల్పంది అభిజీత్ దిప్కే. మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌కు చెందిన అభిజిత్.. ఇటీవల దీన్ని సోషల్ మీడియా వేదికగా లాంచ్ చేయగా విశేషమైన ఆదరణ లభించింది.
అయితే దీనికి ఆదిలోనే గట్టి షాక్ తగిలింది. రికార్డులు సృష్టిస్తూ దూసుకుపోతున్న ఈ పార్టీకి చెందిన ‘ఎక్స్’ (ట్విట్టర్) ఖాతా భారతదేశంలో బ్లాక్ అయ్యింది. యువతలో విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్న ఈ డిజిటల్ ఉద్యమ అకౌంట్ బ్లాక్ కావడం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
ఆ పేరును నాకిచ్చేయండి..
హరియాణాలోని పానిపట్‌కి చెందిన న్యాయవాది సుధీర్ జాకర్ సీజేపీని తన పేరుతో ఎన్నికల సంఘంలో నమోదు చేయాలని ప్రయత్నిస్తున్నాడు. ఆయన తానే పార్టీ జాతీయ కన్వీనర్ అని ప్రకటించుకున్నాడు, దీన్ని అమెరికాలో చదువుకుంటున్న అభిజీత్ దిప్కే నుంచి వేరు చేసి తన పేరుతో పార్టీ ఏర్పాటుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ సుధీర్ జాకర్.. కేంద్ర ఎన్నికల కమిషన్‌ను ఆశ్రయించాడు.
ఆ పేరును తనకు కేటాయించాలని కోరుతూ ఈసీకి దరఖాస్తు చేసుకున్నారు. ఆ పార్టీని రిజిస్టర్ చేసుకోవడానికి భారత్‌కు రమ్మంటే రానంటున్న అభిజిత్ దీప్కే నుంచి ఆ పార్టీని వేరు చేయాలని దరఖాస్తులో కోరారు. ‘యువతలో కోపం పెరుగుతోంది. ఎవరైనా ముందుగా ఈ పేరును నమోదు చేసి దుర్వినియోగం చేస్తే ఉద్యమం నశిస్తుంది. అందుకే నేను ముందుకు వచ్చాను’ అని దరఖాస్తు చేసుకునే క్రమంలో చెప్పుకొచ్చారు సదరు న్యాయవాది.
ప్రారంభించిన ఐదు రోజుల తర్వాత గత గురువారం భారతదేశంలో సీజేపీ ‘ఎక్స్’ ఖాతాను నిలిపివేశారు. దేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆన్‌లైన్ ట్రెండ్‌లలో ఒకటిగా అవతరించిన సీజేపీని ప్రస్తుతం బ్యాన్ చేశారు. మరి ఇది పార్టీగా రూపాంతరం చెందుతుందా? తుపాను వేగంతో వచ్చిన ఈ పార్టీకి ఇక్కడతోనే కథ ముగిసినట్లా అనేది కాలమే నిర్ణయించాలి. మొత్తంగా సీజేపీ ఇప్పుడు అసలు స్థాపకుడు అభిజీత్ దిప్కే వర్సెస్ జాకర్ మధ్య యాజమాన్య పోరుకు తెరతీయడం మరింత హాట్ టాపిక్‌గా మారింది.


