రైతుల్ని కాల్చి చంపిన చరిత్ర మీది

Kurasala Kannababu Fires On Chandrababu - Sakshi

చంద్రబాబుపై మంత్రి కన్నబాబు మండిపాటు

కాకినాడ రూరల్‌: రాష్ట్రంలో రైతుల కోసం అనేక పథకాలు అమలు చేస్తుంటే.. వ్యవసాయాన్ని మూసివేశారంటూ విపక్ష నేత చంద్రబాబు దిగజారి మాట్లాడుతున్నారని వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు మండిపడ్డారు. కాకినాడలో శనివారం మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడారు. చంద్రబాబు హయాంలో కాల్దారి నుంచి బషీర్‌బాగ్‌ వరకూ రైతులను కాల్చి చంపిన ఘటనలే ఉన్నాయని ధ్వజమెత్తారు. కాకినాడ ఎస్‌ఈజెడ్‌ విషయంలో రైతులను జైల్లో పెట్టించిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్‌ ఉచిత విద్యుత్‌ ఇస్తామంటే తీగలపై బట్టలు ఆరేసుకోవాలని చెప్పిన చంద్రబాబు.. రైతాంగం నష్టపోకుండా విద్యుత్‌ చట్టం తీసుకువచ్చానని ఇప్పుడు చెబుతున్నారని విమర్శించారు.

ప్రపంచ బ్యాంకు జీతగాడని అప్పట్లో కమ్యూనిస్టులు చంద్రబాబును విమర్శించేవారని గుర్తు చేశారు. చంద్రబాబు హయాంలో పెట్టిన బాకీలను ఇప్పుడు చెల్లించడానికే సరిపోతోందన్నారు. మోటార్లకు మీటర్లు పెడతారా? బిల్లులు కోసం రైతుల ఆస్తులు జప్తు చేస్తారా? అంటూ టీడీపీ వాళ్లు దుష్ప్రచారం చేస్తున్నారని, నిజానికి మీటర్ల ఏర్పాటుకు 96 శాతం మంది రైతులు అనుకూలంగా ఉన్నారని చెప్పారు. పారదర్శకత కోసమే మీటర్ల ఏర్పాటు అని స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి బీజేపీతో వ్యతిరేకత కారణంగా మీటర్లను వ్యతిరేకించిందని, ఏపీలో ఇచ్చే పథకాలు తెలంగాణలో ఇస్తున్నారా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ముఖ్యమంత్రి వైస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వ్యవసాయంలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చారని పేర్కొన్నారు. ఏ రైతుని అడిగినా ప్రభుత్వ నుంచి వచ్చే ప్రయోజనాలు చెబుతారని అన్నారు.   

వికేంద్రీకరణకు కట్టుబడి ఉన్నాం..
టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు అమరావతిని రాజధానిగా నిర్ణయించారని, మరీ టీడీపీ ప్రభుత్వానికి రాజధానిని నిర్ణయించే అధికారం ఉన్నప్పుడు వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వానికి ఎందుకు ఉండదని ప్రశ్నించారు. తమ ప్రభుత్వం అభివృద్ధి వికేంద్రీకరణకు కట్టుబడి ఉందని, దానికి అనుగుణంగానే భవిష్యత్‌లో నిర్ణయాలు ఉంటాయన్నారు. సీఎం జగన్, కేంద్ర మంత్రి షెకావత్‌ పోలవరం పర్యటనపై వక్రభాష్యాలు చెప్పడాన్ని కన్నబాబు తప్పుబట్టారు.    

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top