
సమావేశంలో మాట్లాడుతున్న కేటీఆర్
వెంగళరావునగర్, సాక్షి, హైదరాబాద్: రానున్న లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ డమ్మీ అభ్యర్థులను బరిలోకి దించనున్నట్టు బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీ రామారావు ఆరోపించారు. బీజేపీ అభ్యర్థుల విజయమే లక్ష్యంగా కాంగ్రెస్ పరోక్షంగా పని చేస్తోందని విమర్శించారు. కాంగ్రెస్‌కు ఓటు వేయడమంటే అది బీజేపీకి వేసినట్టేనన్నారు. యూసుఫ్‌గూడలోని ఓ ఫంక్షన్ హాల్‌లో శనివారం జరిగిన బీఆర్‌ఎస్ జూబ్లీహిల్స్ నియోజకవర్గ విస్తృతస్థాయి సమావేశంలో కేటీఆర్ మాట్లాడుతూ.. కాంగ్రెస్, బీజేపీలది విడదీయలేని ఫెవికాల్ బంధమని ధ్వజమెత్తారు. రాహుల్ భారత్ జోడో యాత్ర అని తిరుగుతుంటే కాంగ్రెస్ మిత్రపక్షాలు మాత్రం రాహుల్ చోడో అని వదిలి పోతున్నాయని, చివరకు ఆ కూటమిలో మిగిలేది రాహుల్ ఒక్కడేనని ఎద్దేవా చేశారు.
దేశంలోనే అట్టర్ ఫ్లాప్ మంత్రి కిషన్‌రెడ్డి
సికింద్రాబాద్ ఎంపీగా ఉన్న కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి నియోజకవర్గానికి ఏం చేశారో చెప్పాలని, కనీసంగా కూడా ఏమీ చేయని ఆయనకు ఈసారి ఓటు అడిగే నైతిక హక్కు లేదని కేటీఆర్ స్పష్టం చేశారు. దేశంలోనే అట్టర్ ఫ్లాప్ కేంద్రమంత్రి ఎవరైనా ఉన్నారంటే అది కిషన్‌రెడ్డి మాత్రమేనన్నారు. నగరంలో అతి పెద్ద గుడి కట్టింది పీజేఆర్ కుటుంబమని, అయినప్పటికీ ఆయన కుమారుడు ఏనాడూ ఓట్ల కోసం దానిని వాడుకోలేదని, కానీ బీజేపీ దేవుడి పేరు చెప్పి డ్రామాలు చేస్తోందని విమర్శించారు.
మైనారిటీలపై కాంగ్రెస్ పగబట్టింది
ఆర్‌ఎస్‌ఎస్ మూలాలు కలిగిన సీఎం రేవంత్‌రెడ్డి మైనారిటీలపై ప్రతీకారం తీర్చుకుంటున్నారని కేటీఆర్ ఆరోపించారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌కు మద్దతు ఇచ్చినందునే మైనారిటీలపై కాంగ్రెస్ పగబట్టిందని, రాష్ట్ర కేబినెట్‌లో మైనారిటీలకు స్థానం కల్పించకపోవడమే దీనికి నిదర్శనమన్నారు. తెలంగాణ భవన్‌లో శనివారం జరిగిన బీఆర్‌ఎస్ పార్టీ మైనారిటీ విభాగం సమావేశంలో కేటీఆర్ ప్రసంగించారు. రేవంత్ మంత్రివర్గంలో మైనారిటీలకు ప్రాతినిథ్యం లేదని, 1953 తర్వాత కేబినెట్‌లో మైనారిటీలకు చోటు లేకపోవడం ఇదే తొలిసారని గుర్తు చేశారు.
ఎమ్మెల్యేలుగా మైనారిటీలు ఎవరూ లేరనే సాకుతో కాంగ్రెస్ తప్పించుకోలేదని, మంత్రివర్గంలో చోటు కల్పించి ఆ తర్వాత శాసనమండలికి ఎన్నికయ్యేలా చూసుకునే అవకాశముందన్నారు. మైనారిటీ సెంటిమెంటును రెచ్చగొట్టేందుకు అసెంబ్లీ ఎన్నికల్లో షబ్బీర్ అలీ పేరును వాడుకున్న రేవంత్ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత కేవలం సలహదారు పదవితో సరిపెట్టారని కేటీఆర్ విమర్శించారు. రాష్ట్రంలో ఈనెల 22న నల్లగొండ, సంగారెడ్డి తది తర ప్రాంతాల్లో చోటు చేసుకున్న మత ఘర్షణలకు హోం శాఖ బాధ్యతలు చూస్తున్న సీఎం రేవంత్ బాధ్యత వహించాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.
ఆటోలో బీఆర్‌ఎస్ భవన్‌కు కేటీఆర్
యూసుఫ్‌గూడలోని ఫంక్షన్ హాల్‌లో విస్తృత స్థాయి సమావేశం అనంతరం బయటకు రాగా నే ఆటో కార్మికులు కేటీఆర్‌ను చుట్టుముట్టారు. తమ సమస్యలను ఆయనకు విన్నవించుకు న్నారు. దీనికి స్పందించిన కేటీఆర్ ఓ ఆటోలో ఎక్కి వారితో మాట్లాడారు. అదే ఆటోలో బీఆర్‌ఎస్ భవనానికి చేరుకున్నారు. దారిలో వారి సమస్యలను సావధానంగా విన్న కేటీఆర్ ఆటో కార్మికుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి పరిష్కారానికి కృషి చేస్తానని హామీ నిచ్చారు. ఆటోలో ఆయన వెంట ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ కూడా ఉన్నారు.