నమో అంటే.. నమ్మించి మోసగించడమే! | Sakshi
Sakshi News home page

నమో అంటే.. నమ్మించి మోసగించడమే!

Published Mon, Oct 2 2023 2:43 AM

KTR counter to PMs criticism - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ప్రధాని నరేంద్ర మోదీ పాల­మూ­రు సభలో కేసీఆర్‌ ప్రభుత్వంపై చేసిన విమర్శలను బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్, మంత్రి కె.తారక రామారావు ‘ఎక్స్‌’(ట్విట్టర్‌) వేదికగా తిప్పికొట్టారు. తమది జై కిసాన్‌ ప్రభుత్వమని... మోదీది నై కిసాన్‌ సర్కార్‌ అని ఎద్దేవా చేశారు. 

బీజేపీ స్టీరింగ్‌ అదానీ చేతిలోకి... 
‘న.మో. అంటే నమ్మించి మోసగించడమే అని దేశ ప్రజలకు తెలుసు. దేశ ప్రజలంతా జాతీయ స్థాయి లో అధికార మార్పు రావాలని కోరుకుంటున్నారు. బీఆర్‌ఎస్‌ స్టీరింగ్‌ కేసీఆర్‌ చేతిలో భద్రంగా ఉంది. కానీ బీజేపీ స్టీరింగ్‌ మాత్రం అదానీ చేతిలోకి వెళ్లిపోయింది. మీరు కిసాన్‌ సమ్మాన్‌ కింద ఇచ్చింది కేవ లం నామమాత్రం. కానీ ఒక చిన్న రాష్ట్రమైన తెలంగాణ, కొత్త రాష్ట్రమైనప్పటికీ 70 లక్షల మంది రైతులకు రూ. 72 వేల కోట్లను నేరుగా ఖాతాల్లో వేసిన విషయం మీరు తెలుసుకుంటే మంచిది. రైతుల రుణమాఫీ జరగలేదని మాట్లాడటం మిలియన్‌ డాలర్‌ జోక్‌.

స్వతంత్ర భారత చరిత్రలోనే ఒక కొత్త రాష్ట్రం రెండుసార్లు రైతు రుణమాఫీకి నడుం బిగించిన ఏకైక సందర్భం తెలంగాణలోనే ఆవిష్కృతమైంది. అన్నదాత అప్పులు మాఫీ చేసిన జై కిసాన్‌ ప్రభుత్వం మాది. కార్పొరేట్‌ దోస్తులకు రూ. 14.5 లక్షల కోట్ల రుణాలను రద్దు చేసిన నై కిసాన్‌ సర్కా రు మీది. కర్షకుల రక్తం కళ్లజూసిన రైతు హంతక రాజ్యం మీది. మీ ఎన్నికల హామీలను గాలికి వదిలేసి ఓట్ల వేటలో ఇప్పుడొచ్చి మాట్లాడితే నమ్మేదేవరు? ప్రాజెక్టుల వల్ల చుక్క నీరు రాలేదనడం మీ అవివేకానికి నిదర్శనం. తెలంగాణలో సాగునీటి విప్లవం సాగుతోంది.

తెలంగాణ రైతు పండించిన ధాన్యా న్ని కొనుగోలు చేయలేక చేతులెత్తేసిన మీరా మాట్లాడేది? తెలంగాణ రైతులు పండించిన ధాన్యా న్ని కొనమంటే నూకలు తినమన్న మీ కేంద్ర పెద్దల అవమానకర మాటలను తెలంగాణ రైతులు మరిచి పోలేదు. మీరెన్ని చెప్పినా మీ బీజేపీకి తెలంగాణలో నూకలు చెల్లిపోయాయి. నిన్న కాళేశ్వరమైనా నేడు పాలమూరు ప్రాజెక్టయినా ప్రపంచ సాగునీటి చరిత్రలోనే అతిగొప్ప మానవ నిర్మిత అద్భుతాలు. భవిష్యత్తు ఇరిగేషన్‌ రంగానికే సరికొత్త పాఠాలు. వాటిపై మీ ఆరోపణలు పూర్తిగా అవాస్తవాలు’అంటూ ఘాటుగా విమర్శలు గుప్పించారు.  

Advertisement
 

తప్పక చదవండి

Advertisement