ఇవి హైదరాబాద్‌ రక్షణకు సంబంధించిన ఎన్నికలు | Union Minister Kishan Reddy at Vengalrao Nagar Road Show | Sakshi
Sakshi News home page

ఇవి హైదరాబాద్‌ రక్షణకు సంబంధించిన ఎన్నికలు

Nov 5 2025 3:50 AM | Updated on Nov 5 2025 3:50 AM

Union Minister Kishan Reddy at Vengalrao Nagar Road Show

వెంగళరావునగర్‌రోడ్‌షోలోకేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి 

జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నిక ప్రచారం

వెంగళరావునగర్‌ : త్వరలో జరగనున్న ఉపఎన్నిక జూబ్లీహిల్స్‌కు మాత్రమే కాకుండా హైదరాబాద్‌ రక్షణకు సంబంధించిన ఎన్నికలని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి చెప్పారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం రాత్రి వెంగళరావునగర్‌ డివిజన్‌ పరిధిలోని వివిధ ప్రాంతాల్లో జరిగిన రోడ్‌షోలలో కిషన్‌రెడ్డి పాల్గొన్నారు. ఆయా ప్రాంతాల్లో ఓపెన్‌టాప్‌ జీపుపై పర్యటిస్తూ పలు ప్రాంతాల్లో ప్రజలనుద్దేశించి మాట్లాడారు. పదేళ్ల వరకు బీఆర్‌ఎస్‌ అధికారంలో ఉండగా, మజ్లిస్‌ పార్టీ మద్దతు పలికిందని, ఇప్పుడు కాంగ్రెస్‌ పార్టీ అదే దారిలో నడుస్తుందని చెప్పారు. 

ఇక్కడ ఎవరికి మంత్రి పదవి ఇవ్వాలన్నా, టికెట్‌ ఇవ్వాలన్నా దారుసలాంలో నిర్ణయం అవుతుందని, ఈ పరిస్థితి మన హైదరాబాద్‌కు, తెలంగాణకు అవసరమా ఆలోచించండన్నారు. నాడు ఇందిరాగాంధీ తెలంగాణ ఉద్యమాన్ని అణచివేసిందని తెలిపారు. సలావుద్దీన్‌ ఒవైసీ ఉన్న నాటి నుంచి ఇక్కడ మజ్లిస్‌ పార్టీ పెత్తనం చేసిందన్నారు. ఒకనాడు పాతబస్తీలో హిందువుల బస్తీలు కోకొల్లలుగా ఉండేవని, అయితే మజ్లిస్‌ పార్టీ వారిని బెదిరించి, దాడులు చేసి, మత కల్లోలాలు చేసి అక్కడ నుంచి పంపించి వేసిందని విమర్శించారు. 

ఖాళీ చేయని బస్తీల్లో దాడులు చేసి 300 మందిని హత్య చేసిన ఘనత మజ్లిస్‌ పార్టీకే ఉందన్నారు. అలాంటి మజ్లిస్‌ పార్టీకి మద్దతు పలకడానికి బీఆర్‌ఎస్, కాంగ్రెస్‌ పార్టీలు నేడు పోటీ పడుతున్నాయని చెప్పారు. కేటీఆర్, రేవంత్‌లు మజ్లిస్‌ పార్టీ ఒకే కుటుంబానికి చెందిన పార్టీలని, వాటికి బుద్ధి చెప్పాలన్నారు. 2014లో మజ్లిస్‌ పార్టీ తరఫున పోటీ చేసిన అభ్యర్థికి నేడు కాంగ్రెస్‌ పార్టీ టికెట్‌ ఇచి్చందని, ఈ చేతి గుర్తు వెనుక పతంగి గుర్తు ఉందని పేర్కొన్నారు. 

ఇక్కడ అభ్యర్థులు లేకపోవడంతో మజ్లిస్‌ పార్టీ వ్యక్తిని తీసుకొచ్చి కాంగ్రెస్‌ తరఫున నిలబెట్టిందని విమర్శించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం బంజారాహిల్స్‌లో పెద్దమ్మ గుడిని ధ్వంసం చేసిందని, మోహిదీపట్నం, ఎర్రగడ్డ ప్రాంతాల్లో ఒక వర్గం కోసం ఖబరస్తాన్‌కు స్థలాలు కేటాయించిందని, ఇది కేవలం మసీదు రాజకీయాల కోసమేనన్నారు. ఇది గూండాల పార్టీ, రౌడీల పార్టీ అని, ఇది ముస్లింలకు అండగా ఉండదని, గొడవలు మాత్రమే రేపుతుందని చెప్పారు. 

నిన్నటి వరకు బీఆర్‌ఎస్‌ను భుజాన వేసుకున్న మజ్లిస్‌ పార్టీకి ఇప్పుడు రేవంత్‌ ఎందుకు సపోర్ట్‌ చేస్తున్నాడని ప్రశ్నించారు. ఈ రెండు పార్టీలు చీకటి ఒప్పందాన్ని చేసుకున్నాయని, అందుకే ఇక్కడ హిందువులంతా ఐక్యతగా ఉండాలని కోరారు. హైదరాబాద్‌లో, రాష్ట్రంలో మార్పు రావాలంటే ఈ రెండు పార్టీలకు బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో మజ్లిస్‌ పార్టీ అంతుచూస్తామని, భూస్థాపితం చేస్తామని హెచ్చరించారు. 

జూబ్లీహిల్స్‌ అభివృద్ధి చెందాలంటే ప్రజలతో ఎల్లప్పుడూ ఉండే బీజేపీ అభ్యర్థి దీపక్‌రెడ్డిని గెలిపించాలని, కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌ పార్టీలను బొంద పెట్టాలన్నారు. ఈ రోడ్‌షోలో నిజామాబాద్‌ ఎమ్మెల్యే సూర్యనారాయణ గుప్తా, మాజీ ఎమ్మెల్యే లక్ష్మయ్య, బీజేపీ అభ్యర్థి లంకెల దీపక్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement