ఉద్యమ స్ఫూర్తిని మళ్లీ రగిలిస్తం | KTR Calls For BRS Diksha Divas On Nov 29th In Telangana, More Details Inside | Sakshi
Sakshi News home page

ఉద్యమ స్ఫూర్తిని మళ్లీ రగిలిస్తం

Nov 25 2024 6:13 AM | Updated on Nov 25 2024 10:41 AM

29న రాష్టవ్యాప్తంగా బీఆర్‌ఎస్‌ దీక్షా దివస్‌

అదేరోజు నిమ్స్‌లో అన్నదానం.. డిసెంబర్‌ 9న 

మేడ్చల్‌లో తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ 

ఏర్పాట్లపై ఈ నెల 26న సన్నాహక సమావేశం 

కాంగ్రెస్‌ నుంచి తెలంగాణను కాపాడుతాం 

బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీ రామారావు వెల్లడి

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ సమా­జాన్ని ఏకం చేసి ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించిన కేసీఆర్‌ స్ఫూర్తితో మరో మారు ప్రజల్లో ఉద్యమ స్ఫూర్తిని రగిలిస్తామని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీ రామారావు తెలిపారు. కాంగ్రెస్‌ కబంధ హస్తాల నుంచి నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలను కాపా­డేందుకు మరో­సారి సంకల్ప దీక్ష చేపట్టాల్సిన సమయం ఆసన్నమైందని అన్నారు. తెలంగాణ భవన్‌లో పార్టీ ఎమ్మెల్యేలు, పలువురు మాజీ మంత్రులతో కలిసి కేటీఆర్‌ ఆదివారం మీడియా సమావేశంలో మాట్లాడారు.

‘2009 నవంబర్‌ 29న నిరాహార దీక్ష ప్రారంభించి తెలంగాణ మలిదశ ఉద్యమాన్ని కేసీఆర్‌ మలుపు తిప్పారు. తెలంగాణపై కేసీఆర్‌ వేసిన ముద్రను గుర్తు చేసుకుంటూ 33 జిల్లాల్లోని బీఆర్‌ఎస్‌ కార్యాలయాల్లో ఈ నెల 29న దీక్షా దివస్‌ నిర్వహిస్తాం. దీక్షా దివస్‌ నిర్వహణకు ఈ నెల 26న అన్ని జిల్లాల్లో సన్నాహక సమావేశాలు ఏర్పాటు చేస్తాం. సీనియర్‌ నాయకులకు జిల్లాల వారీగా దీక్షా దివస్‌ ఇన్‌చార్జిలుగా బాధ్యతలు అప్పగించాం’అని కేటీఆర్‌ వెల్లడించారు.  

డిసెంబర్‌ 9న మేడ్చల్‌లో తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ 
కేసీఆర్‌ నిరాహార దీక్ష ముగించిన రోజును గుర్తు చేస్తూ డిసెంబర్‌ 9న మేడ్చల్‌లో తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ చేస్తామని కేటీఆర్‌ తెలిపారు. కేసీఆర్‌ నిరాహార దీక్ష చేసిన నిమ్స్‌ ఆసుపత్రిలో అన్నదానం, రోగులకు పండ్లు పంపిణీ చేస్తామని చెప్పారు. సమైక్య ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్‌ పాలనా కాలంలో తెలంగాణలోని ప్రతీ వర్గం, ప్రతీ మనిషి బతుకు చితికిపోయిందని, ఇప్పుడు తిరిగి అవే పరిస్థితులు కనిపిస్తున్నాయని అన్నారు. నిర్బంధాలు, అణచివేతలు, దుర్భర పరిస్థితులు దర్శనమిస్తున్నాయని.. కాంగ్రెస్‌కు అధికారమిస్తే తెలంగాణలో మళ్లీ అదే అంధకారం నెలకొని అట్టడుగు వర్గాలతో సహా అందరూ బాధపడుతున్నారని ధ్వజమెత్తారు. 

జాతీయ పార్టీలకు బుద్ధి చెప్పేలా.. 
‘స్వరాష్ట్ర కలను నిజం చేసేందుకు ‘కేసీఆర్‌ సచ్చుడో...తెలంగాణ తెచ్చుడో’అని తెగువ చూపిన నాయకుడికి మూడు కోట్ల మంది ప్రజలు ముక్త కంఠంతో అండగా నిలబడ్డారు. ఢిల్లీ మెడలు వంచి తెలంగాణ రాష్ట్రం సాధించిన కేసీఆర్‌ స్ఫూర్తితో ప్రస్తుతం మళ్లీ రెండు జాతీయ పారీ్టల మెడలు వంచాల్సిన బాధ్యత ప్రతీ పౌరుడిపై ఉంది. దుర్మార్గ కాంగ్రెస్, బీజేపీలకు బుద్ధి చెప్పాలనే సంకల్పంతో బీఆర్‌ఎస్‌ చేపడుతున్న కార్యక్రమాల్లో కార్యకర్తలు కలసికట్టుగా పనిచేయాలి’అని కేటీఆర్‌ పిలుపునిచ్చారు. సమావేశంలో మాజీ మంత్రులు తలసాని శ్రీనివాస్‌ యాదవ్, పద్మారావు గౌడ్, మహమూద్‌ అలీ, వేముల ప్రశాంత్‌రెడ్డి, ఎమ్మెల్యేలు కాలేరు వెంకటేశ్, కేపీ వివేకానంద్, ముఠా గోపాల్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement