ఎల్లో మీడియా.. వారి మరణాలకు చంద్రబాబే కదా బాధ్యుడు

KSR Comments Over Yellow Media False News About AP - Sakshi

సాధారణంగా ఎన్నికల యుద్దానికి రాజకీయ పార్టీలు రెడీ అవుతుంటాయి. రకరకాల వ్యూహాలు పన్నుతుంటాయి. వాటి తంటాలేవో అవి పడుతుంటాయి. కానీ, ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం అందుకు భిన్నంగా కొన్ని పత్రికలు, టీవీ సంస్థలు యుద్దం చేస్తున్నాయి. గత నాలుగున్నరేళ్లుగా అదే పనిలో ఉన్నా, ప్రస్తుతం మరింత ఉధృతం చేశాయి. ప్రతిపక్ష తెలుగుదేశం, జనసేన తదితర పార్టీలు ప్రస్తుతం ఉన్న వైఎస్సార్‌ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఓడించలేవన్న అభిప్రాయానికి ఆ మీడిమా  వచ్చి ఉండాలి. 

అందుకే వారి వల్ల కాని పని తామే చేయాలని పూనుకుని ఇష్టారాజ్యంగా ఏపీలో అధికారంలో ఉన్న వైఎస్సార్‌సీపీ ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని ఎంత వీలైతే అంత బద్నాం చేయాలని విశ్వయత్నం చేస్తున్నాయి. పిచ్చి పరాకాష్టకు చేరిందన్నట్లుగా ఇవి వ్యవహరిస్తున్నాయి. ఈ క్రమంలో అవి ఉఛ్చనీచాలు మరచిపోయాయి. నడి బజారులో నగ్నంగా తిరగడానికి సిగ్గు పడటం లేదు. ఎన్నిసార్లు, ఎన్నిరకాలుగా ఇది తప్పు, జర్నలిజం విలువలకు పాతరేయడమే అని ఎందరు చెప్పినా, అవి వినిపించుకునే దశలో లేవు. అందుకే ఏపీలో వచ్చే శాసనసభ ఎన్నికలో వైఎస్సార్‌సీపీకి, ప్రతిపక్షాలకు మధ్య కాదు. ఏపీ ప్రజలకు, ఒక  పచ్చ  మీడియాకు మధ్యే  అని తేలిపోతోంది.

ప్రజలను తమ అబద్దాల వార్తలతో నమ్మించాలని ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ-5 తదితర ఎల్లో  మీడియా చేస్తున్న వికృత విన్యాసాలను ప్రజలు గమనించడం లేదని కాదు. అయినా ఎల్లో మీడియా విషరూపాన్ని నిత్యం ప్రదర్శిస్తున్న తీరు అసహ్యంగా మారుతోంది. ఉదాహరణకు నవంబర్ 16న ఈనాడు మీడియా ఇచ్చిన వార్తా కథనాలను చూడండి. ఎంత ద్వేషం. ఈనాడు పత్రిక బ్యానర్‌గా ఇచ్చిన వార్త చదివితే ఎవరికైనా బీపీ వస్తుంది. ఈనాడు ఇంత నీచంగా రాసిందేమిటా అన్న కోపం వస్తుంది. అయినా ఏమి చేస్తాం. ఈనాడు, తదితర ఎల్లో మీడియా చేస్తున్న విష ప్రచారాన్ని ఎదుర్కోవలసిందే అని అనుకోవడం తప్ప.

తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరు వద్ద ఒక ఘటన జరిగింది. పోలీస్ ఎస్ఐ కొట్టారన్న కారణంగా ఒక వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇలాంటి ఘటనలను ఎవరూ సమర్ధించరు. కచ్చితంగా సంబంధిత పోలీసు అధికారిపై చర్య తీసుకోవాలి. ఆ ప్రకారం వెంటనే సీనియర్ ఐపీఎస్ అధికారి స్పందించి ఆ ఎస్ఐపై చర్య తీసుకున్నారు. సస్పెన్షన్ వేటు వేశారు. ఆ వార్తను ఇవ్వడం తప్పు కాదు. అభ్యంతరం లేదు. కానీ, మొత్తం ఏపీలో పోలీసులు హత్యలు చేస్తున్నట్లు చిత్రీకరిస్తూ ఇవి పోలీసు హత్యలు కావా? అంటూ తాటికాయంత అక్షరాలతో వార్తను ప్రచురించారు. హోం మంత్రిని నిలదీశారని మరో వార్త ఇచ్చారు. అదే సమయంలో మరో మంత్రి మేరుగ నాగార్జున సంబంధిత బాధిత కుటుంబాన్ని కలిసి ఓదార్చి ప్రభుత్వం తరఫున పది లక్షలు, స్థానిక నాయకుడి పక్షాన మరో పది లక్షల రూపాయల చెక్కులను అందచేశారు. ఆ విషయాన్ని మాత్రం కనీ, కనిపించకుండా రాసి, మిగిలినదంతా వారి పైత్యాన్ని జోడించి వార్తలు వండారు. 

అందులో ఒకటి, రెండు ఘటనలను ఉదహరించి, రాష్ట్రం అంతటా అలాగే జరుగుతున్నాయని, అందులోనూ దళితులపై జరుగుతున్నాయంటూ తప్పుడు ప్రచారానికి తెగబడుతున్నారు. దానికి కారణం ఏమిటంటే దళితవర్గాలలో, బలహీనవర్గాలలో వైఎస్సార్‌సీపీకి మంచి పట్టు ఉండటమే. ప్రభుత్వం అమలు చేస్తున్న స్కీములు అత్యధికం ఆ వర్గంవారు పొందడమే. అయినా వారిలో ప్రభుత్వంపై ద్వేషం నింపడానికి విపరీతంగా ఈనాడు, ఆ సంస్థ అధినేత రామోజీ కృషి చేస్తున్నారు. గతంలో ఎన్నడూ ఇలాంటి ఘటనలు జరగనట్లు, ఇప్పుడే ఇలా జరుగుతున్నట్లు దుష్ప్రచారం సాగిస్తున్నారు. చంద్రబాబు పాలన సమయంలో తిరుపతి శేషాచలం అడవుల్లో ఎర్రచందనం కూలీలు ఇరవై మందిని నిర్దాక్షిణ్యంగా కాల్చి చంపారు. వారంతా దళితులే. అయినా కనీసం పరిహారం కూడా ఇవ్వలేదు. తమిళనాడు ప్రభుత్వం వారి కుటుంబాలను ఆదుకోవడానికి సాయం ప్రకటించింది. 

అంటే దాని అర్ధం ఏపీలో జరిగిన ఎన్‌కౌంటర్ నకిలీదేనని కదా!. దాని గురించి ఈనాడు మీడియా కానీ, ఇతర పచ్చ మీడియా కానీ వార్తలు ఇచ్చాయా?.. పైగా కాల్చి చంపడాన్ని సమర్ధిస్తున్నట్లుగా అప్పట్లో ప్రచారం జరిగేది. రాజమండ్రి వద్ద గోదావరి పుష్కరాలలో కేవలం చంద్రబాబు కుటుంబం పుష్కర స్నానం చేసే సయమంలో భక్తులందరిని నిలిపివేసినప్పుడు తొక్కిసలాట జరిగింది. దాంతో ఇరవైతొమ్మిది మంది మరణించారు. వీరిలో ఎక్కువ మంది బలహీనవర్గాలవారే. అయినా ముఖ్యమంత్రిపై కాదు కదా!.. కనీసం  ఒక్క కానిస్టేబుల్‌పై కూడా చర్య తీసుకోలేదు. పైగా చంద్రబాబు రోడ్డు ప్రమాదాలలో ఎందరు చనిపోవడం లేదని వ్యాఖ్యానించారు. కుంభ మేళాలో తొక్కిసలాట జరిగి మరణించలేదా అని ప్రశ్నించారు. నిజానికి ఆనాటి ముఖ్యమంత్రిని, ఆయన కుటుంబాన్ని, ఆయన స్నాన ఘట్టాన్ని సినిమా తీయడానికి వచ్చిన బృందాన్ని బాధ్యులను చేయాలి?. తొక్కిసలాట వల్ల జరిగిన ఈ  మరణాలను ఎవరు చేసిన హత్యలుగా తీసుకోవాలి?.

అప్పట్లో ఈనాడు మీడియా ఆ మరణాలపై ఎక్కడైనా బాధపడినట్లు కనిపించిందా!. ప్రస్తుత బాపట్ల ఎంపీ నందిగం సురేష్ దళితుడే కదా!. అమరావతిలో పంటలు దగ్దం చేశారంటూ తప్పుడు ఆరోపణ చేసి, ఆ కేసులో సీఎం జగన్‌ పేరు చెప్పాలని పోలీసులు నానా హింసలు పెట్టారే.. దానిని ఎవరి హింస అని అనాలి?. కాపు ఉద్యమ నేత ముద్రగడ కుటుంబాన్ని పోలీసులు ఎంత అరాచకంగా అరెస్టు చేసింది తెలియదా?. ప్రతిపక్షనేతగా ఈ మధ్యనే కందుకూరులో వెళ్లి ఇరుకు రోడ్డులో సభ పెట్టి ఎనిమిది మంది మరణానికి కారకుడైంది చంద్రబాబు కాదా! అయినా ఈనాడు, జ్యోతి వంటి మీడియా ఎంత నిస్సిగ్గుగా సమర్ధించాయి!. 

గుంటూరులో చంద్రబాబు సభకు వస్తే  బహుమతులు ఇస్తామని చెప్పి జనసమీకరణ చేసినప్పుడు జరిగిన తొక్కిసలాటలో ముగ్గురు మరణించారు. ఈ మరణాలు హత్యలు కావా?. ఇవి తెలుగుదేశం హత్యలే అని ఈనాడు రాయలేదే!. ఇలా చెప్పుకుంటూ పోతే చాంతాడు అంత అవుతాయి. కానీ, వాటన్నిటిని కప్పిపుచ్చుతూ ముఖ్యమంత్రి జగన్ ప్రభుత్వంపై దారుణమైన నీచ ప్రచారాన్ని ఈనాడు మీడియా  సాగిస్తోంది. ఈ ఎన్నికల వరకు ఈ యుద్దం కొనసాగుతుంది. అందుకే ఇప్పుడు జరగబోయ యుద్దం కూడా ప్రతిపక్షాలతో కాకుండా  ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ-5 వంటి మీడియా సంస్థలతోనే అన్నది అర్ధం అవుతుంది.

:: కొమ్మినేని శ్రీనివాస రావు. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top