ఎల్లో మీడియా పైత్యం.. అధికారుల బదిలీలపై చెత్త రాతలు | Kommineni Srinivasa Rao Fire On Eenadu Fake News Over Officers Transfers - Sakshi
Sakshi News home page

ఎల్లో మీడియా పైత్యం.. అధికారుల బదిలీలపై చెత్త రాతలు

Published Wed, Apr 3 2024 11:47 AM | Last Updated on Wed, Apr 3 2024 1:02 PM

Kommineni Srinivasa Rao Fire On Eenadu Fake News - Sakshi

తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకున్న ఫలితం కనిపిస్తున్నట్లుగా ఉంది. ఆయన తాను కోరుకున్నట్లుగానే ఎన్నికల కమిషన్‌ను ప్రభావితం చేయగలుతున్నారన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఏపీలో తొమ్మిది మంది ఐఎఎస్, ఐపీఎస్ అధికారులను ఎన్నికల సంఘం బదిలీ చేయడం వెనుక ఏమి జరిగిందా అన్నదానిపై విశ్లేషణలు వస్తున్నాయి. కచ్చితంగా టీడీపీ కూటమి కేంద్రంలోని బీజేపీ ద్వారా ఎన్నికల సంఘంపై ఒత్తిడి తెచ్చి ఇంతమందిని బదిలీ చేయించారన్న భావన ప్రజలలో కలుగుతోంది.

ఎందుకంటే వీరిలో కొందరు అధికారులు కొద్ది కాలం క్రితమే బదిలీ అయినా, వారిని అక్కడ ఉండకుండా ఎన్నికల విధులు లేకుండా ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేయడం అనుమానాలకు తావిస్తోంది. ప్రత్యేకించి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం తీసుకువచ్చిన స్కీములు బాగా అమలు చేసిన అధికారులపైన, ఆయా చోట్ల టీడీపీ చేసిన అరాచకాలను అడ్డుకున్న పోలీసు అధికారులపైన టీడీపీ, ఈనాడు తదితర ఎల్లో మీడియా కక్ష కట్టి వారు బదిలీ అయ్యేలా చేసినట్లు కనిపిస్తుంది.  

ఏపీలో వైఎస్‌ జగన్‌ను ఒంటరిగా ఎదుర్కోవడం అసాధ్యం అన్న భావనకు వచ్చిన చంద్రబాబు , జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు పలురకాలుగా ప్రేమ లేఖలు రాయడం, ఆ తర్వాత ప్రలోభాలకు గురి చేయడం ద్వారా ఆయనను తనదారిలోకి తెచ్చుకున్నారు. అయినా అది జగన్‌ను ఓడించడానికి సరిపోవడం లేదని అనుకుని బీజేపీవైపు చూశారు. బీజేపీ పొత్తులోకి వస్తే వారివల్ల కలిసి వచ్చే ఓట్ల గురించి కాకుండా, కేంద్రంలో అధికారంలో ఉన్న ఆ పార్టీ ద్వారా కేసుల బెడద లేకుండా చూసుకోవడం, ఈడీ, ఐటీ, సీబీఐ దాడులు జరగకుండా జాగ్రత్తపడడం, వైఎస్సార్‌సీపీని ఇబ్బంది పెట్టడానికి కేంద్రంపై ఒత్తిడి తీసుకురావడం వంటి ప్రయోజనాలను ఆశించి పొత్తులోకి వెళ్లాలని ఆయన కోరుకున్నారు. దాని కోసం ఆయన ఢిల్లీ వెళ్లి బీజేపీ పెద్దల కాళ్లావేళ్ల పడి, ఆత్మగౌరవాన్ని వదలుకుని ఎలాగైతేనేం బీజేపీ పెద్దల మనసును ఆకట్టుకోగలిగారు. ఆ తర్వాత ప్రధాని మోదీ కూడా ఏపీలో కూటమి సభలో పాల్గొనేలా చేయగలిగారు. 

ఈ నేపథ్యంలో కేంద్రంలో తమ మనుషులు, ఇతర పార్టీలలో ఉన్న కోవర్టులతో ఆపరేషన్ ఆరంభించారు. తొలుత ఎన్నికలను నెల రోజుల పాటు ఆలస్యం చేయడంలో సఫలం అయ్యారన్న అభిప్రాయం కలిగింది. 2019లో తొలిదశలో ఏప్రిల్ పదకుండో తేదీకి ఎన్నికలు పూర్తి అయిపోతే, ఈసారి  ఎన్నికలు నాలుగోదశకు వెళ్లడం, మే పదమూడు వరకు అంటే  నెల రోజులు ఆలస్యం కావడం చూస్తే ఇది కూటమి పనే అన్న సందేహం వస్తోంది. ఆ తర్వాత వాలంటీర్ల వ్యవస్థను దెబ్బతీసే విధంగా వారితో ఈ రెండు నెలలు ప్రజలకు సేవలందించకుండా టీడీపీ కూటమి అడ్డుకోగలిగింది. వలంటీర్ల వ్యవస్థపై చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ తదితర టీడీపీ నేతలకు ఉన్న వ్యతిరేకత అందరికి తెలిసిందే. వారు గతంలో వలంటీర్ల పట్ల ఎంత నీచంగా మాట్లాడింది అందరికి గుర్తు ఉంది. కాకపోతే ఇప్పుడు రివర్స్ అయి తమ మెడకే చుట్టుకోవడంతో మాట మార్చి వలంటీర్లను కొనసాగిస్తామని చంద్రబాబు, పవన్ కళ్యాణ్లు చెబుతున్నప్పటికీ జనం ఎవరూ నమ్మడం లేదు. 

దానికి తోడు వలంటీర్ల వ్యవహారంలో తమకు సంబంధం లేదని టీడీపీ ఆఫీస్ నుంచి ఒకటికి పదిసార్లు ప్రజలకు మెస్సేజీలు  వెళుతున్నాయి. దానిని బట్టే వారు ఎంత కంగారు పడుతున్నది అర్ధం చేసుకోవచ్చు. ఎన్నికల కమిషన్ కూడా వలంటీర్ల వ్యవస్థపై వాస్తవాలు తెలుసుకోకుండా ఏకపక్షంగా ఆదేశాలు ఇవ్వడం కూడా తప్పే అని చెప్పాలి. చంద్రబాబుకు వివిధ పార్టీలలో కోవర్టులు ఉన్నారన్నది బహిరంగ రహస్యం. 2019 ఓటమి పాలయ్యాక చంద్రబాబు వెంటనే ప్లేట్ ఫిరాయించి బీజేపీకి జై కొట్టే పని పెట్టుకున్నారు. ఏకంగా నలుగురు రాజ్యసభ సభ్యులను బీజేపీలోకి పంపిచారు. అయినా ఆ పార్టీ పెద్దలకు చంద్రబాబుపై నమ్మకం కుదరలేదు. ఆ తరుణంలో ఈడీ, ఐటీ దాడులు చేయడం, చంద్రబాబు పీఎస్ వద్ద రెండువేల కోట్ల రూపాయల అక్రమాలు జరిగాయని సిబిటిడి ప్రకటించడం జరిగింది. దాంతో మరింతగా బీజేపీకి లొంగిపోయి ప్రధాని మోదీని పొగడడం ఆరంభించారు. తత్ఫలితంగా తనపై కేసులు ముందుకు వెళ్లకుండా చేసుకోగలిగారు.

 2019 ఎన్నికలకు ముందు మోదీని, సీబీఐ, ఐటి, ఈడి వంటి వాటిని చంద్రబాబు తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టేవారు. ఎన్నికల తర్వాత గప్ చుప్‌ అవడమే కాకుండా బీజేపీ వారి ప్రాపకం కోసం నానా పాట్లు పడ్డారు. అందుకోసం పవన్‌ను ప్రయోగించారు. ఆయనను బీజేపీ చివాట్లు పెట్టింది. అయినా వదలకుండా ఎలాగైతే బీజేపీతో టీడీపీకి పొత్తు కుదిర్చారు. ఆ తర్వాత చంద్రబాబు మళ్లీ యధా ప్రకారం తన కుట్రలకు శ్రీకారం చుట్టారు. సీఎం జగన్ ప్రభుత్వాన్ని మూడు పార్టీల కూటమి ఓడించలేదన్న అభిప్రాయానికి వచ్చి, ఎన్నికల కమిషన్ ను కూడా తన ఆయుధంగా వాడుకోవాలని ఆలోచించి ఉండవచ్చని అంటున్నారు.

ఇందుకోసం బీజేపీలో చేరిన టీడీపీ మాజీ ఎంపీలు సుజనా చౌదరి, సీఎం రమేష్ వంటివారిని ప్రయోగించారు. వారితో పాటు మాజీ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను పావుగా మార్చుకుని కధ ఆరంభించారు. ఆయనతో హైకోర్టులో కేసులు వేయించడం, ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదులు పంపించడం, మరోవైపు బీజేపీలో ఉన్న తన మనుషుల ద్వారా ఎక్కడ ఎవరికి చెప్పించాలో చెప్పించి ఎన్నికల సంఘంపై ఒత్తిడి తెస్తున్నట్లు జనం నమ్ముతున్నారు. ఎందుకంటే ఎన్నికల కమిషన్ పైన చంద్రబాబు 2019లో ఎలాంటి విమర్శలు చేసింది అందరూ చూశారు.

అప్పటి సీఈఓ గోపాలకృష్ణ ద్వివేది కార్యాలయానికి వెళ్లి ఆయన  రచ్చరచ్చ చేశారు. అప్పట్లో ఇంటెలిజెన్స్ ఛీఫ్ గా ఉన్న ఏబీ వెంకటేశ్వరరావుపై పలు ఆరోపణలు రావడంతో ఎన్నికల సంఘం ఆయనను ఎన్నికల విధుల నుంచి తప్పించింది. ఆయనతో పాటు మరో ఇద్దరు ఎస్పిలను బదిలీ చేసింది. ఆ చర్యను తీవ్రంగా తప్పు పడుతూ చంద్రబాబు నాయుడు ఎన్నికల సంఘాన్ని దుయ్యబట్టారు. అంతేకాక ఎన్నికల కమిషన్ ఉత్తర్వులను సవాల్ చేస్తూ హైకోర్టుకు వెళ్లారు. అయినా ఫలితం దక్కకపోవడంతో  వెంకటేశ్వరరావును బదిలీ చేయక తప్పలేదు. అసలు తొలుత కమిషన్ చెప్పినవారిని బదిలీ చేయడానికే ఆయన ఇష్టపడలేదు. దాంతో కమిషన్ సీరియస్ అయింది. ఇన్ని చేసినప్పుడు ఈనాడు రామోజీరావు, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణలకు ఎన్నికల కమిషన్‌లో నియంత కనిపించారు. మోదీనే కమిషన్‌ను నడిపిస్తున్నారని చంద్రబాబు ఆరోపిస్తే దానికి విశేష ప్రాధాన్యత ఇస్తూ ప్రచారం చేసేవారు.  ఇప్పుడు మాత్రం ఎన్నికల కమిషన్ బదిలీలు చేస్తే అది గొప్ప విషయంగా ప్రొజెక్టు చేస్తున్నారు.

దీనిని బట్టే తెలుగుదేశంతో పాటు, ఈనాడు, జ్యోతి వంటి మీడియా సంస్థలు ఎంత నీచంగా మారాయన్నది తెలిసిపోతుంది. ఈనాడులో అయితే పేజీల కొద్ది కధనాలు ఇచ్చి తన శాడిజాన్ని ప్రదర్శించింది. ఎన్నికల సంఘం చేసిన బదిలీలను వార్తగా ఇవ్వడం తప్పు కాదు. కానీ, బదిలీ అయినవారిపై విషం కక్కుతూ ఎన్నికలతో సంబంధం లేని అనేక విషయాలను వక్రీకరిస్తూ తన పైత్యాన్ని అంతటిని ఈనాడు మీడియా ప్రదర్శించి వికృతానందం పొందింది. కొద్ది రోజుల క్రితం ప్రధాని మోదీ సభలో మైక్ పనిచేయకపోతే దానికి కొందరు పోలీసు అధికారులను బాధ్యుల్ని చేస్తూ, కేంద్రం వారిపై చర్య తీసుకోబోతోందని ఈనాడు ప్రచారం చేసింది. అది జరగలేదు. ఇప్పుడు తొమ్మిది మందిని బదిలీ చేస్తే శరభ శరభ అంటూ పూనకం వచ్చినట్లు రాస్తూ అధికారులను అవమానించింది. వారంతా ఇంగితం మర్చారని, అధికార  వైఎస్సార్‌సీపీకి బంట్లుగా మారారని, తెలుగుదేశం బాకా పత్రికగా మారిన ఈనాడు  ఆరోపించింది. 

విపక్షాలు చేసిన ఆరోపణలను పరిగణనలోకి తీసుకునే కమిషన్ తన అధికారాలను వినియోగించి ఈ చర్య తీసుకుందని ఆ పత్రిక పేర్కొంది. అంటే దీని అర్ధం ఏమిటి? ఎన్నికల కమిషన్ పూర్తి స్థాయిలో విచారణ చేసుకోకుండా, విపక్షాల ఆరోపణలను ఆధారంగా చేసుకుని చర్య తీసుకున్నట్లే కదా!. ఇలా చర్య తీసుకోవడానికి కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీనే కారణమని ఎవరైనా అంటే కాదనే పరిస్థితి కనిపించడం లేదు. కొన్ని ఉదాహరణలు చూద్దాం. తిరుపతి కలెక్టర్ గా నియమితులైన లక్ష్మీ షా జనవరి 31 న జాయిన్ అయ్యారు. ఈనాడు దృష్టిలో ఆయన చేసిన తప్పు ఏమిటంటే టీటీడీ చైర్మన్ గా ఉన్న కరుణాకరరెడ్డిని కలవడమే. అంతకు మించి ఆయన చేసిన తప్పు ఏమీ లేదనే కదా!. విపక్షాలతో పాటు ఈనాడు వారు కోరుకున్నట్లు చెవిరెడ్డి భాస్కరరెడ్డిపై కేసు పెట్టలేదట. ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కాకుండానే, రెండు నెలల వ్యవధిలోనే ఆయనను బదిలీ చేశారంటే ఏదో ఒత్తిడి లేదని ఎలా అనుకోగలుగుతాం?. లక్ష్మీ షా గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థను సఫలం చేయడంలో కీలక పాత్ర పోషించినవారిలో ఒకరు. ఆ ద్వేషంతో కూడా టీడీపీ కూటమి ఆరోపణలు చేసి ఉండవచ్చు.

పల్నాడు ఎస్పీ రవిశంకర్ రెడ్డిపై ఈనాడు ఎన్ని అసత్యాలు రాసిందో చూస్తే  ఆశ్చర్యం కలుగుతుంది. ప్రధాని మోదీ సభ విఫలం అవడానికి కారణం తెలుగుదేశం పార్టీ అయితే, దానినంతటిని ఎస్పీపై నెట్టివేసింది. వైఎస్సార్‌సీపీవారు అరాచకాలు సృష్టించారట. తెలుగుదేశం వారు అసలు ఏమీ చేయలేదట. ఎంత దారుణంగా రాసిందో చూడండి. ప్రధాని మోదీ సభలో మైక్ లు పనిచేయకపోవడం వల్లే ఎస్పీని బదిలీ చేశామని అదే కారణమని ఎన్నికల కమిషన్ చెప్పనే లేదు కదా!. పోనీ ఫలానా కారణమని కమిషన్ తెలిపిందా?. కానీ, ఈనాడు, ఆంధ్రజ్యోతి మీడియా మాత్రం తమ పైత్యం అంతటిని కలిపి విషం చిమ్మాయి. కృష్ణా జిల్లా కలెక్టర్ రాజాబాబు మాజీ మంత్రి పేర్ని నాని చెప్పినట్లు వింటున్నారట. ఇలా ఈనాడు పత్రిక తనకు తోచినవన్నీ రాసేసి అధికార యంత్రంగాన్ని భయపెట్టడానికి యత్నించింది.

అధికారులు తప్పులు చేస్తే చర్యలు తీసుకోవద్దని ఎవరూ చెప్పరు. కానీ, విపక్షాలు పాలించే రాష్ట్రాలలోనే ఇలా చేస్తుంటే కచ్చితంగా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీపైనే విమర్శలు వస్తాయి. పశ్చిమబెంగాల్‌లో డీజీపీని మార్చిన వైనం విమర్శలకు దారి తీసింది. బీజేపీ పాలిత రాష్ట్రాలలో కొందరు హోం శాఖ కార్యదర్శులను మార్చినట్లు ఎన్నికల సంఘం ప్రకటించినా, వారంతా ముఖ్యమంత్రుల కార్యాలయంతో పాటు మరోచోట పనిచేస్తున్నారని వెల్లడించింది. అంటే వారిపై ఎలాంటి అభియోగాలు ఉన్నట్లు ఎన్నికల కమిషన్ తెలపలేదు. ఏపీలో కొందరు అధికారులను బదిలీ చేయగానే వారిపై తెలుగుదేశం మీడియా నానా చెత్త అంతా రాశాయంటే ఇదంతా బ్లాక్ మెయిలింగ్ టాక్టీస్ అని తెలుసుకోవడం పెద్ద కష్టం కాదు.

అధికారులు ఎవరైనా నిష్ఫక్షపాతంగా ఉంటే వారిని చెడగొట్టే లక్ష్యంతోనే టీడీపీ మీడియా ఇలా రాస్తోంది. అదే తాము కోరుకున్న అధికారి లేదా తమకు భయపడే అధికారి విశాఖలో ఉండి ఉంటే,తమకు సంబంధించిన మార్గదర్శి చిట్స్ సంస్థ అక్రమంగా రవాణా చేస్తున్న 51 లక్షల నగదును పట్టుకునే వారు కాదు కదా అన్నది ఈనాడు వారి ఉద్దేశం కావచ్చు. రామోజీరావు, రాధాకృష్ణల పిచ్చి కాకపోతే అధికారులే ఓట్లు వేయించే పరిస్థితి ఉంటే చంద్రబాబు ఎప్పటికి ఓడిపోయేవారు కాదు కదా! ముఖ్యమంత్రి జగన్  నమ్ముకుంది జనాన్ని కానీ.. అధికార యంత్రాంగాన్ని కాదన్న సంగతి ఆయన చేస్తున్న బస్ యాత్రలను బట్టే తెలుస్తుంది.


– కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్‌ పాత్రికేయులు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement