
ఏపీలో అధికార కూటమి అపరాధ భావనతో కొట్టుమిట్టాడుతోంది. టీడీపీ, జనసేన, బీజేపీలతో కూడిన పక్షం.. విపక్ష వైఎస్సార్‌సీపీ ఆత్మస్థైర్యంతో సంధిస్తున్న ప్రశ్నలకు జవాబు సైతం చెప్పలేకపోతోంది. ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ప్రజల తరపున వేస్తున్న ప్రశ్నలకు కూటమి పెద్దలు గుటకలు మింగుతున్నారు.
టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి.. జనసేన అధినేత పవన్ కల్యాణ్‌లు ఎన్నికలకు ముందు చెప్పిన అబద్దాలను ప్రజల ముందు ఉంచడంలో జగన్ సఫలమయ్యారు. జగన్ తాజా మీడియా సమావేశంలో చంద్రబాబు, పవన్‌ల అసత్యాల చిట్టాను బయటపెట్టిన తీరు ఆసక్తికరంగా ఉంది. ప్రతిదానికి ఆధార సహితంగా ఆయన మాట్లాడారు. గతంలో జగన్ సీఎంగా ఉండగా చంద్రబాబు, పవన్‌లు ఆధారాలతో నిమిత్తం లేకుండా నోటికి వచ్చిన అబద్దాలు ఆడారన్న విషయం ఇప్పుడు మరింత స్పష్టమవుతోంది. జగన్ మాటలు వింటే వీరిద్దరు అపరాధ భావనతో కుంగిపోవాలి. అబద్దాలతో ప్రజలను మోసం చేశామన్న సంగతి తెలిసిపోతుందే అని సిగ్గుపడాలి. అయితే అధికారాన్ని ఎంజాయ్ చేస్తున్నారు కనుక వారు అలాంటివాటిని పట్టించు కోకపోవచ్చు!. అయితే..
ఏపీ బడ్జెట్ ఎంత డొల్లగా ఉన్నది, టీడీపీ, జనసేనలు తాము చేసిన వాగ్దానాలకు ఎలా తూట్లు పొడిచింది కళ్లకు కట్టినట్లు జగన్ వివరించే యత్నం చేశారు. అప్పుల గురించి బడ్జెట్ పత్రాలలోను, సామాజిక, ఆర్ధిక సర్వేలోను ఇచ్చిన అంకెలను వివరించి కూటమిని నిలదీశారు. కూటమి ప్రతినిధులుగా పనిచేసే ఎల్లో మీడియా ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటివి కూడా జగన్ చేసిన వ్యాఖ్యలపై నోరు మెదపలేకపోయాయి. ఎన్నికలకు రెండేళ్ల ముందు నుంచి ఏపీ అప్పుల కుప్ప అయిపోయిందని, శ్రీలంక మాదిరి అవుతోందని టీడీపీ, జనసేనలతో పాటు ఎల్లో మీడియా దుర్మార్గపు ప్రచారం చేశాయి. రెండేళ్లపాటు కరోనా సంక్షోభం ఉక్కిరిబిక్కిరి చేసినా, రూపాయి ఆదాయం లేకపోయినా జగన్ సమర్థంగా పనిచేశారన్న సంగతి ప్రజలకు బాగా అర్ధమైంది.
ఇక.. తెలుగుదేశం తన వెబ్‌సైట్‌లో జగన్ ప్రభుత్వం రూ.13 లక్షల కోట్ల అప్పు చేసిందని పచ్చి అబద్దాన్ని ప్రచారం చేసింది. చంద్రబాబు, పవన్ ,లోకేష్‌లు పది నుంచి రూ.14 లక్షల కోట్ల వరకు తమకు తోచిన అంకెలు చెప్పి ప్రజలను తప్పుదోవ పట్టించే యత్నం చేశారు. ఈనాడు వంటి ఎల్లో మీడియా అవకాశం ఉన్న ప్రతిసారి నీచమైన రీతిలో పిచ్చి లెక్కలు, నిపుణుల పేరుతో దిక్కుమాలిన వాళ్లందరిని పోగు చేసి విష ప్రచారం చేసింది. తీరా ఇప్పుడు అధికారంలోకి వచ్చాక అసలు వాస్తవాలు ఒప్పుకోక తప్పలేదు.
👉ప్రభుత్వ గణాంకాల ప్రకారమే జగన్ ప్రభుత్వ టర్మ్ పూర్తి అయ్యేనాటికి అప్పు రూ.4.92 లక్షల కోట్లుగా వెల్లడైంది. ఇందులో 2014-19 మధ్య చంద్రబాబు ప్రభుత్వం చేసిన అప్పు సుమారు రెండు లక్షల కోట్లు, విభజన నాటికి ఉన్న అప్పు రూ.95 వేల కోట్లు కూడా ఉంది. అంటే జగన్ టైమ్ లో రెండు లక్షల కోట్ల మేరే బడ్జెట్ అప్పులు చేసినట్లు అర్థమవుతుంది. కాని ఈనాడు 2023 ఫిబ్రవరి 14న ఒక కథనాన్ని ఇస్తూ పార్లమెంటులో అప్పటికి రూ.4.24 లక్షల కోట్ల అప్పే అని చెప్పినా, ఏపీ అప్పు రూ.9.25 లక్షల కోట్లు అని, మిగిలిన అప్పులను జగన్ రహస్యంగా దాచేశారని పిచ్చి వాదన చేసింది. అది నిజమే అయితే కూటమి అధికారంలోకి వచ్చి పది నెలలు అవుతోంది కదా! ఆ రహస్య అప్పులేవో బయటపెట్టి ఉండవచ్చు కదా! అంటే అప్పుడు కావాలని అబద్దాలు ప్రచారం చేసి పాఠకులను ఈనాడు ,ఆంధ్రజ్యోతి వంటి ఎల్లో మీడియా మోసం చేసినట్లే కదా!
👉ఈ విషయంపై జగన్ కాగ్, ఆర్థిక సర్వేలలోని అంకెలను చూపుతూ ప్రశ్నించారు. దానికి అటు టీడీపీ నుంచి కాని, ఇటు ఎల్లో మీడియా నుంచి కాని సౌండ్ లేదు. అంతేకాదు... ఇప్పుడు ఏ సంక్షోభం లేకపోయినా, అప్పుడే చంద్రబాబు సర్కార్ రూ.70 వేల కోట్ల అప్పు చేయగా, మరో రూ.డెబ్బైవేల కోట్ల అప్పు సమీకరిస్తోంంది. ఇక సూపర్ సిక్స్‌కు గుండుసున్నా అంటూ కూటమి ఇచ్చిన ఒక్కో హామీని చదివి వినిపిస్తూ జగన్ అస్త్రాలు సంధించారు. అయినా కూటమి నేతలు, ఎల్లో మీడియా కిక్కురుమనలేదు.ఇవే కాకుండా ఎన్నికల ప్రణాళికలో చంద్రబాబు, పవన్ లు కలిసి చేసిన 143 వాగ్దానాలకు సంబంధించి కూడా ప్రశ్నలు వేశారు. సూపర్ సిక్స్ హామీలకే రూ.79179 కోట్ల రూపాయలు అవసరమైతే కేవలం రూ.17,179 కోట్లు కేటాయించడంలోని ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు. దీనిపై ఆర్ధిక మంత్రి కేశవ్ వివరణ ఇవ్వలేకపోయారు.
ఆడబిడ్డ నిధి కింద మహిళలకు ఒక్కొక్కరికి రూ.18 వేలు ఇప్పటికే బాకీ పడ్డారని, వచ్చే ఏడాది కూడా ఇవ్వడం లేదని బడ్జెట్ ద్వారా తేలిపోయిందని, దాంతో అది రూ.36 వేలు అయిందని ఆయన చెప్పారు.
అలాగే నిరుద్యోగులకు కూడా అదే ప్రకారం రూ.72 వేలు, తల్లికి వందనం కింద ప్రతి విద్యార్ధికి రూ.15 వేల చొప్పున బాకీ పడ్డారని అంటూ ఆయా స్కీముల పరిస్థితి, ప్రజలు ఏ మేర కూటమి చేతిలో మోసపోయింది ఆయన విశ్లేషించి చెప్పారు.
ఫించన్‌వెయ్యి రూపాయలు పెంచినా నాలుగు లక్షల పెన్షన్లలో కోత పెట్టడాన్ని ఆయన ఆక్షేపించారు. బలహీనవర్గాలకు ఏభై ఏళ్లకే పెన్షన్ హామీ ఏమైందని అడిగారు.
మహిళలకు ఉచిత బస్ ప్రయాణం హామీ చిన్నదే అయినా చంద్రబాబు ప్రభుత్వం నెరవేర్చలేదని, ఆయన కడుతున్న అమరావతిని రాయలసీమ నుంచి కూడా ఉచిత బస్‌లలో వచ్చి చూద్దామనుకున్న మహిళలకు నిరాశ మిగిల్చారని జగన్ ఎద్దేవ చేయడం ఆసక్తికరంగా ఉంది.
అలాగే అమరావతి గురించి ప్రస్తావిస్తూ అధికారం వచ్చింది కనుక, వారు తాము అనుకున్న విధంగా నిర్మాణం చేసుకోవచ్చని, కాని అందులో కూడా అబద్దాలు చెప్పడం ఏమిటని అన్నారు. అమరావతి రాజధానికి ప్రభుత్వ డబ్బు రూపాయి వ్యయం చేయనవసరం లేదని చెప్పిన చంద్రబాబు బడ్జెట్ లో రూ.ఆరు వేల కోట్లు, అప్పుల కింద రూ.31 వేల కోట్లు ఎలా తీసుకు వస్తున్నారని ప్రశ్నించారు. దీని గురించి కూడా చంద్రబాబు కాని, మున్సిపల్ మంత్రి నారాయణ కాని నోరు విప్పడం లేదు.
👉వైఎస్సార్‌సీపీ వాళ్లకు పనులు చేయవద్దని చంద్రబాబు చెప్పడంపై జగన్ మండిపడ్డారు. అలా అన్నందుకు చంద్రబాబును తక్షణమే పదవి నుంచి తొలగించాలని గవర్నర్‌కు సూచించారు. ఇక్కడ ఇంకో విషయం చెప్పాలి. చంద్రబాబు, ఆయన తోడల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావులు కలిసిపోయారట. తనకు చంద్రబాబుతో వైరం ఉండేది కానీ ఇప్పుడు పరిస్థితి మారిందని దగ్గుబాటి అన్నారు. మరో వైపు చంద్రబాబు అసలు వైఎస్సార్‌సీపీ వాళ్లకు పనులు చేయవద్దని ఎలా చెబుతున్నారు. చివరికి వైఎస్సార్‌సీపీ వారికి టీడీపీ వారు ఎవరైనా బంధువులు ఉన్నా, వారు కలుసుకున్నా పార్టీలో ఒప్పుకోవడం లేదట. చంద్రబాబు, దగ్గుబాటి కలవవచ్చు కాని, వేర్వేరు పార్టీలలో ఉన్న బంధువులు కలిస్తే తప్పని టీడీపీ నాయకత్వం ప్రచారం చేస్తుండడంపై విమర్శలు వస్తున్నాయి.
టీడీపీ క్యాడర్ ఈ పరిణామాన్ని గుర్తించి, వైఎస్సార్‌సీపీలో లేదా ఇతర పార్టీలలో ఉన్న తమ బంధువులతో గొడవలు పడవద్దని సలహా ఇవ్వాలి. బాబు ష్యూరిటీ-మోసం గ్యారంటీ అన్న డైలాగును జగన్ వాడుకుని ప్రజలకు అర్థమయ్యే రీతిలో చంద్రబాబు బడ్జెట్లో ఉన్న అంకెల గారడీని విడమరిచి చెప్పగలిగారు. శాసనమండలిలో వైఎస్సార్‌సీపీ సభ్యులు ఎక్కువగా ఉండడంతో వారు వీటిని ప్రస్తావిస్తుంటే మంత్రి లోకేష్‌తోసహా ఏ మంత్రి కూడా నేరుగా జవాబు ఇవ్వలేకపోతున్నారు. దాంతో కూటమి సర్కార్ ప్రతిష్ట దెబ్బతింటుండడంతో ఎర్రబుక్ పేరుతో వైఎస్సార్‌సీపీ వారిపై కేసులు పెడుతున్నారు.
అసెంబ్లీలో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ తమ వద్ద మంత్ర దండం లేదని చెబుతూ, చంద్రబాబు బ్రాండ్ ఉందని అన్నారు. చంద్రబాబు బ్రాండ్ అంటే అబద్దాలు చెప్పడమా అన్న ప్రశ్నకు జవాబు ఇవ్వలేరు. జగన్ అసెంబ్లీకి వెళ్లకపోయినా, అక్కడ మాట్లాడకపోయినా అవే విషయాలను మీడియా సమావేశం పెట్టి వివరించడం ద్వారా చంద్రబాబు, పవన్ ,లోకేష్ లను ఆత్మరక్షణలో పడేశారని చెప్పక తప్పదు.

:::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత.