మీటర్లు పెడితే నష్టమేంటో చెప్పాలి | Kakani Govardhan Reddy On Chandrababu Pawan Kalyan | Sakshi
Sakshi News home page

మీటర్లు పెడితే నష్టమేంటో చెప్పాలి

May 17 2022 4:23 AM | Updated on May 17 2022 4:23 AM

Kakani Govardhan Reddy On Chandrababu Pawan Kalyan - Sakshi

సాక్షి, అమరావతి: వ్యవసాయ కనెక్షన్లకు విద్యుత్‌ మీటర్లు పెట్టడం వలన వచ్చే నష్టమేమిటో చెప్పకుండా రైతులను తప్పుదోవ పట్టించేలా దుష్ప్రచారం చేయడం టీడీపీ అధినేత చంద్రబాబుకు తగదని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి హితవు పలికారు. సోమవారం సచివాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ వ్యవసాయ విద్యుత్‌ పక్క దారి పట్టకుండా మీటర్లు పెట్టాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. ఇప్పటికే శ్రీకాకుళం జిల్లాలో అమలు చేసిన పైలట్‌ ప్రాజెక్టు విజయవంతమైందని, అక్కడ 30 శాతం విద్యుత్‌ ఆదా అయినట్టు గుర్తించామని తెలిపారు.

అన్ని జిల్లాల్లో దశలవారీగా మీటర్లు పెట్టబోతున్నట్లు చెప్పారు. సబ్సిడీ సొమ్ము నేరుగా రైతుల ఖాతాల్లోనే జమ చేస్తామన్నారు. మీటర్ల వల్ల రైతులకు జరిగే నష్టమేమిటో చెప్పలేని దుస్థితిలో చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్‌ నాయుడు, దత్తపుత్రుడు పవన్‌ కళ్యాణ్‌ ఉన్నారన్నారు. వ్యవసాయం దండగ, ఉచిత విద్యుత్‌ ఇస్తే తీగలపై బట్టలారేసుకోవాలంటూ విమర్శించిన చంద్రబాబుకు రైతుల కోసం మాట్లాడే నైతిక అర్హత లేదన్నారు.  

జూన్‌ 6న 3వేల ట్రాక్టర్ల పంపిణీ 
వ్యవసాయ యాంత్రీకరణలో భాగంగా జూన్‌ 6న 3 వేల ట్రాక్టర్ల పంపిణీని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రారంభిస్తారని మంత్రి కాకాణి    గోవర్ధన్‌రెడ్డి చెప్పారు. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి  ప్రభుత్వం గత మూడేళ్లలో రైతులకు నేరుగా  1.10 లక్షల కోట్ల రూపాయల సాయం అందించిందని చెప్పారు.  వైఎస్సార్‌ రైతు భరోసా కింద రూ.23,875.59 కోట్ల పెట్టుబడి సాయం అందించామన్నారు. సున్నా వడ్డీ రుణాలు, పైసా భారం పడకుండా పంటల బీమా, సీజన్‌ ముగియకుండానే పంట నష్ట పరిహారం.. ఇలా ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు అందిస్తున్నట్లు తెలిపారు.

రైతు భరోసా కేంద్రాల ద్వారా నాణ్యమైన ధ్రువీకరించిన విత్తనం, ఎరువులు, పురుగు మందులను సరఫరా చేస్తున్నామన్నారు. టీడీపీ ఐదేళ్ల పాలనలో రైతులు కరువుకాటకాలతో అల్లాడిపోతే, మూడేళ్ల తమ పాలనలో ఒక్క మండలం కూడా కరువు జాబితాలోకి వెళ్లలేదని చెప్పారు. కరువు తీరా కురుస్తున్న వర్షాలతో ప్రాజెక్టులు నిండుకుండల్లా  ఉన్నాయని, భూగర్భ జలాలు ఎగసిపడుతున్నాయని అన్నారు. ఈ మూడేళ్లలో 16 లక్షల మెట్రిక్‌ టన్నుల అదనపు ఫలసాయం వచ్చిందని, 48 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం అదనంగా పండిందని వివరించారు. ఇవేమీ ఎల్లో మీడియాకు కన్పించకపోవడం విడ్డూరంగా ఉందని మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి అన్నారు. 

వేగంగా తుపాను నష్టం అంచనా
అసని తుపాను పంట నష్టం అంచనా వేగంగా జరుగుతోందని మంత్రి చెప్పారు. 6 వేల హెక్టార్లలో వ్యవసాయ, ఉద్యాన పంటలు దెబ్బతిన్నట్టు ప్రాథమికంగా అంచనా వేశారన్నారు. 33 శాతానికి పైగా నష్టపోయిన పంటలను పరిగణనలోకి తీసుకొని నష్టం తుది అంచనాల మేరకు బాధిత రైతులకు సీజన్‌ ముగిసే లోగా పరిహారం అందిస్తామని చెప్పారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement